top of page
Writer's pictureAP Teachers TV

సీబీఎస్‌ఈ విద్యార్థులకు ప్రత్యేక ‘పరీక్ష’


ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

పదోతరగతి పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రభుత్వం చర్యలు

అమరావతి: ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు ఉండగా.. వీటిల్లో 82,764 మంది పదో తరగతి చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటిసారి వీరు సీబీఎస్‌ఈ పబ్లిక్‌ పరీక్షలు రాయనున్నారు. దీంతో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించేందుకు వీరికి ఒక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్కులు, పరీక్ష రాసిన విధానాన్ని పరిశీలించి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాయడంపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారింది. 2020-21లో ఒకేసారి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేసింది. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంగ్లంలోకి మారాల్సి వచ్చింది. వీరు ఇప్పుడు పదో తరగతికి వచ్చారు. ఈలోపు గత ప్రభుత్వం వెయ్యి బడులకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. ఈ బడుల్లో చదువుతున్న వారు సీబీఎస్‌ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వకుండా మార్పు చేయడంతో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది.



ఆ బడుల్లో ఇబ్బందులు

సీబీఎస్‌ఈ అమలు చేస్తున్న బడులపై అధ్యయనం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ.. 243 బడుల్లోని విద్యార్థుల్లో సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న వారికి కొంత మెరుగైన బోధన చేస్తే సీబీఎస్‌ఈ పరీక్షలు రాసేందుకు వీలుంటుందని వెల్లడించింది. దీంతో ఈ బడుల్లోని విద్యార్థులతో సీబీఎస్‌ఈ పరీక్షలు రాయించాలా? లేదంటే ఈ ఏడాదికి రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలా? అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులకు ఇప్పటికే ఫార్మెటివ్‌-1 పరీక్ష పూర్తి చేయాలి. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతవరకు దీన్ని నిర్వహించలేదు. ఇందుకోసం సిద్ధం చేసిన ప్రశ్నపత్రాలు ఉన్నాయి. వీటితోనే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

బోధనలోనూ వ్యత్యాసం..

సీబీఎస్‌ఈ పరీక్షలు ఆంగ్లంలోనే రాయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇచ్చినందున చాలాచోట్ల టీచర్లు తెలుగు, ఆంగ్లం మిళితం చేసి బోధన చేస్తున్నారు. విద్యార్థులు సైతం ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. వీరికి తొమ్మిదో తరగతి వరకు పాఠశాల స్థాయిలోనే పరీక్షలు నిర్వహించారు. దీంతో వారి సామర్థ్యాలను ఎవరూ అంచనా వేయలేదు. 

మైనర్‌ మాధ్యమాలకు మినహాయింపు..

రాష్ట్రవ్యాప్తంగా కన్నడ, ఉర్దూ, ఒడియా మాధ్యమాల్లో చదువుతున్న 303 మంది పదోతరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ పరీక్షల నుంచి విద్యాశాఖ మినహాయింపు ఇచ్చింది. మొదటి నుంచి మాతృభాష మాధ్యమాల్లో చదివినందున తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలు రాయలేరని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page