స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీ అర్హతపై సందిగ్ధత
- AP Teachers TV
- 1 day ago
- 1 min read
మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధనను విద్యాశాఖ పెట్టింది.
టెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కుల అర్హత
బీఈడీ చేసేందుకు 40 శాతమే
డీఎస్సీలో మాత్రం 45% ఉండాలనే నిబంధన

మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధనను విద్యాశాఖ పెట్టింది. కానీ, గతేడాది నిర్వహించిన టెట్‌లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులను అర్హతగా పేర్కొంది. డిగ్రీలో 40% మార్కులున్నా బీఈడీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో బీఈడీ చేసి, టెట్ పేపర్-2ఏ రాసిన అభ్యర్థులకు ఇప్పుడు మెగా డీఎస్సీలో 45% మార్కులు ఉండాలనే నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు. 2011 జులై తర్వాత చదివిన వారికి డిగ్రీలో 40% మార్కులు ఉండాలని గతేడాది జులైలో నిర్వహించిన టెట్‌లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది. టెట్‌కు అర్హత కల్పించిన వారికి డీఎస్సీకి అర్హత కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఈడీ ప్రవేశాలకు సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హతతో బీఈడీ చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డీఎస్సీ రాయలేకపోతే వారు చాలా నష్టపోతారు. దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి ఏపీపీఎస్సీ, డీఎస్సీ పరీక్షలు..
ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండటంతో రెండూ రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు నెల రోజులపాటు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ నాలుగు నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామక పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments