రిటర్న్ జర్నీ : పదోతరగతి జీవశాస్త్రం, "Excretion" విసర్జనక్రియ పాఠం కథారూపంలో
రిటర్న్ జర్నీ
ఎయిర్ పోర్ట్ లో, ఒకటవ టెర్మినల్ దగ్గర తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది డాక్టర్ పద్మ. రెండు రోజుల క్రితం ఇండియా వస్తున్నట్లు శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఈ రెండు రోజుల్లో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఒక్క పద్మకు మాత్రమె తెలిసింది .
“ఏమోయ్ఎలా ఉన్నావు?” లగేజి ట్రాలి తో పాటు పద్మను దగ్గరగా తీసుకుంటూ అడిగాడు శేఖర్. “అబ్బాయి రాలేదా?” యధాలాపంగా అడిగాడు.
“డ్యూటీలో ఉన్నాడు”. సన్నగా చెప్పింది పద్మ.
కారు ఇంటికి బయలుదేరింది.
“హాస్పిటల్లో కొన్ని కేసులు ఉన్నాయి. చూసుకొని వెళ్దామా?” మెత్తగా అడిగింది పద్మ.
“మీ డాక్టర్స్ ఎప్పుడు ఆన్ డ్యూటీ ఏనా?, సరే పద”, అన్నాడు శేఖర్.
కారు హాస్పిటల్ వైపు పరిగెత్తింది.
1.
“ఏమిటి విషయం?”బెడ్ మీద ఉన్న పేషెంట్ ను చూస్తూ అడిగాడు శేఖర్/
“ESRD: ఎండ్ స్టేజి ఆఫ్ రీనల్ డిసీజ్”.
“అంటే?”
“రెండు మూత్రపిండాలు పాడైపోయాయి”
“ఎందుకిలా?”
“సరిపడినంత నీరు తీసుకోకపోవడం, నైట్ షిఫ్ట్ లు, అధికంగా తీసుకునే ఉప్పు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, అధిక రక్త పీడనం మొదలైనవి”.
“మరి ఇప్పుడుఎలా ?”
“నిన్ననే మూత్రపిండ మార్పిడి జరిగింది. జీవన్ దాన్ నుంచి అవయవాలు తీసుకోవడం జరిగింది.”
“మరి ఇప్పుడు అంతా ఓకేనా?”
“ఒక నెల సమయం పడుతుంది. బాడీ కొత్త అవయవాన్నిఅంగీకరించడానికి.”
“సరే ప్రమాదమేమీ లేదు జాగ్రత్తగా చూసుకోండి”. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాడు శేఖర్.
పేషెంట్ ఇంటి వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ ఉండగా దంపతులు ముందుకు నడిచారు.
2.
“ ఏమిటి విషయం?” అడిగాడు శేఖర్
“రేపటినుండి ఈ పాప, తొలిసారిగా ఈ ప్రపంచాన్ని చూడబోతుంది”
“అంటే?”
“ఆ పాప అంధురాలు”
“పుట్టినప్పటినుండా?”
“ కాదు, చిన్నప్పుడు పోషకాహార లోపం, ప్రధానంగా విటమిన్ ఏ,”
“మరి ఇప్పుడు?”
“ కార్నియా రీప్లాంటేషన్ జరిగింది. తప్పకుండా చూపు వస్తుంది.”
“తిరిగి లోకాన్ని చూడమంటే మామూలు విషయం కాదు.ఆల్ ద బెస్ట్”.అన్నాడు శేఖర్
3.
“ఈ కేసు ఏంటి?”
“COPD”
“అంటే?”
“chronic obstructive pulmonary disease. ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. లంగ్స్ మార్చక తప్పని పరిస్థితి. నిన్ననే ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తయింది”
“ఎందుకిలా జరుగుతుంది?”
“ప్రధానంగా నికోటిన్, కొన్ని సందర్భాల్లో కాలుష్యం, మరి కొన్ని సందర్భాల్లో పనిచేసే ప్రాంతాలు”
“అంటే?” అర్థం కానట్టు అడిగాడు శేఖర్
“గనులు, జిన్నింగ్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు, ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిల్ చేసే పరిశ్రమలు ఊపిరితిత్తుల ఆయుస్సు ను హరిస్తాయి”
ఏమి మాట్లాడకుండా ముందుకు కదిలాడు శేఖరు
4. పద్మ కొంచెం ముందు కదిలి మరో బెడ్ వద్ద ఆగింది
“ఏంటి విషయం?”
“ లివర్ సిరోసిస్”
“అంటే?”
“లివర్ గట్టిపడి, పని చేయటం మానేస్తుంది”
“ ఎందుకలా?”
“ప్రధానంగా మద్యపానం, మితిమీరిన తాగుడు, కానీ ఈ కేసు నాన్ ఆల్కహలిక్”
“అదెలా?”
“హెపటైటిస్ వైరస్ , ఏ సైలెంట్ కిల్లర్”
“ఇప్పుడు పరిస్థితి ఏమిటి?”
“లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. అతను ప్రస్తుతానికి క్షేమం”
ఇంకా వెళదామా పద్మవైపు చూస్తూ అడిగాడు శేఖర్
ఇంకొకటి ప్లీజ్, లాస్ట్ కేసు అంటు ముందుకు కదిలింది పద్మ
5. “ఎవరి పాప?”
“సివియర్ హార్ట్ స్ట్రోక్”
“ఈ వయసులోనా?”
“జెనిటికల్ డిఫెక్ట్, దూరాన మాలమూల గ్రామం. తీసుకొచ్చే సమయం కల్లా, పరిస్థితి చేజారింది. హార్ట్ లోని రెండు వాల్సు దెబ్బతిన్నాయి. అదృష్టం కొద్దీ వెంటనే వాల్వ్ సు రీ ప్లాంటేషన్ చేయగలిగాము.”
“సరే ఇక అబ్బాయి దగ్గరికి వెళ్దామా ?”
“ఉమ్”
పద్మ, శేఖర్ ఇద్దరు కారిడార్ లో నడుస్తూ ఉన్నారు. పద్మ చేయి చిన్నగా కనిపిస్తుంది. అడుగులు తడబడుతూ ఉండగా కుర్చీలో కూలబడింది .
“ఏమైంది? “ ఆందోళనగా అడిగాడు శేఖర్
“మీకో విషయం చెప్పాలి మీరు ధైర్యంగా వినాలి”
“ఏమిటది?”
“ఇప్పుడు మీరు చూసిన ఐదు కేసులు, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ వి. ఆ అవయవ దాత మన అ….బ్బా…యి.”
శేఖర్కి ఒక పట్టాన ఏమి అర్థం కాలేదు .అర్థమయ్యేసరి కల్లా గుండె పగిలినంత భారం
“ఎలా జరిగింది?”
“యాక్సిడెంట్”
“డెడ్ బాడీ ఎక్కడ?”
పద్మ చేయి ఎత్తి క్యారిడార్ చివరి వైపు చూపించింది.
శేఖర్ నెమ్మదిగా లేచి తడబడుతూ క్యారిడార్ చివరికి వెళ్ళాడు
కారిడార్ చివరన టాయిలెట్ బ్లాక్, దాని పక్కన ఒక పెద్ద తోట్టి లో ఫార్మాలిడిహైడ్.దానిలో ఒక బాడీ.
ఒకసారి భయంగా,..రెండోసారి ధైర్యంగా,... మూడవసారి రెప్ప వేయకుండా…. చివరకు తనివి తీర తన గుండె ఏడుపు ఆగే వరకు చూస్తూ ఉండిపోయాడు శేఖర్. అప్పుడు అక్కడికి వచ్చిన వాచ్ మెన్ శేఖర్ ను పద్మావద్దకు తెచ్చాడు.
కార్ ఇంటికి బయలుదేరింది.
“మరి దహన సంస్కారాలు?” చిన్నగా అడిగాడు శేఖర్.
“నా బిడ్డ చనిపోలేదు. రేపటి వైద్యులకు సేవ చేస్తున్నాడు. కళ్ళు మూసుకొనే చెప్పింది పద్మ.”
కారు హస్పటల్ దాటి ఇంటి వైపు సాగిపోతుంది.
అర్జెంటుగా వచ్చిన ఫోన్ కాల్,... రోడ్డుపైన ఘోరమైన యాక్సిడెంట్…., రక్తపు మడుగులో తన బిడ్డ….,ట్రాఫిక్ ని చీల్చుకుంటూ పరిగెత్తిన అంబులెన్స్…., ఎమర్జెన్సీ వార్డ్…, ఐ సి యు, ….
“ ఐ యాం సారీ దా పేషంట్ ఇస్ నాట్ రెస్పాండ్, …ఇట్ ఇస్ బ్రెయిన్ డెడ్”
పద్మ కారులో అసహనంగా కదిలింది .
వెంటనే అతను తీసుకున్న నిర్ణయం.. తన జీవితంలో తను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సమయం. అవయవ దానానికి సంతకాలు… విరోచిత సైనికులు లాగా డాక్టర్ల బృందం చేసిన యుద్ధం… అవయవాల రవాణాకు దిగివచ్చిన పోలీస్ టీం… పట్నం నుంచి ఇరువైపులా ఉన్న హాస్పిటలకు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ గ్రీన్ క్యారీడర్స్ .పెట్టెలు పట్టుకుని పరిగెత్తిన వైద్య బృందాలు, దారి పొడవున పూలు చల్లుతున్న వైద్య సిబ్బంది మరియు ప్రజలు , స్వచ్ఛందంగా ట్రాఫిక్ క్లియర్ చేసిన జనాలు… పరుగెత్తి అలసిపోయిన అంబులెన్స్ లు…. ,వెరసి ఒక గంటలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం, అంటే సగటున గంటకు 110 కిలోమీటర్లు… మొత్తంగా నిలబడిన ఆరు ప్రాణాలు….
ఊపిరాడనట్లు పద్మ ఒక్కసారి కళ్ళు తెరిచింది .
నిదానంగా ఇంటికి చేరింది. ప్రాణం లేని రెండు జీవాలు ఇంటిలోకి నిర్జీవంగా నడిచాయి. ఇంటిలో దీపం వెలగడం లేదు.
శేఖర్ వడిలో గువ్వపిల్ల లా వణికి పోతున్న పద్మ నిద్రపోవట్లేదన్న విషయం తెలుస్తూనే ఉంది. అర్ధరాత్రి ఎప్పటికో “నేను మీతో వస్తానండి” అన్న పద్మ గొంతు జీరగా వినిపించింది శేఖర్ కి. “ మీ వ్యాపారం మీరు చూసుకోండి నేను మాత్రం పిల్లవాడిని, ఈ దేశాన్ని వదిలిపెట్టను,” అని భీష్ముంచుకోన్న ఒక్కప్పటి ధైర్యం ఆ గొంతులో ఏమాత్రం లేదు. లాలనగా పద్మను తన వైపు తిప్పుకొని
“వెళ్దాం, రేపే వెళ్దాం, అయితే వెళ్లేటప్పుడు మరొక్కసారి,నువ్వు ఊపిరి పోసిన మనషులను కలిసి వెళ్దామా ?” అన్నాడు శేఖర్ .
పద్మ అనిన “ఉమ్” గది లోని నిశ్శబ్దాన్ని ఏమాత్రం చెరప లేకపోయింది.
మర్నాడు ఉదయం రిటన్ జర్నీ ప్రారంభమైంది. ఇద్దరూ ఉదయం తమ తిరుగు ప్రయాణాన్ని హాస్పిటల్ నుండి ప్రారంభించారు.
శేఖర్ మొదటి బెడ్ పక్కన కూర్చొని, చేతిని తాకాడు, ఆ చేతికి దగ్గరగా నడుము, దానిమీద లోతైన గాయము.
“ నాన్న ఐ యాం సారీ, నేను నేర్చుకున్న ప్రతి విషయము నువ్వు నేర్పిందే , నిరంతరం కష్టపడటం.. ఎంత పని ఒత్తిడి ఉన్న నిబ్బరంగా ఉండటం చుట్టూ ఎంత చెడు ఉన్న, మంచిని మాత్రమే స్వీకరించటం, చెడును వదిలించుకోవడం. నువ్వు…చెప్పిన, ఏ విషయము నేను మర్చిపోలేదు నాన్న, అన్ని ఆచరించాను కూడా… ఇప్పటికీ కూడా ….ఆచరిస్తున్నాను .దీనికి సాక్షమె ఈ మూత్రపిండం. చూడు నీ మాటలు ఎలా శిరసావహిస్తుందో..చుట్టూ ఎంత చెత్త ఉన్న, గుండె ఎంత ఒత్తిడి చేస్తున్న ఈ కిడ్నీ నవ్వుతూ పనిచేస్తుందంటే నువ్వు చెప్పిన మాటలే నాన్న .ఇది నువ్వు ఇచ్చిన ధైర్యమే. ఈ బిడ్డ నీ మాటని ఎప్పుడు జవదాటలేదు.. పోయిన నా ప్రాణం సాక్షిగా వాటిని ఆచరిస్తూనే ఉన్నాను” శేఖర్ కు ఏవో మాటలు గాల్లో వినిపిస్తున్నాయి.
నెమ్మదిగా తలెత్తాడు శేఖర్ .ఎదురుగా ఉన్న లోకం కన్నీటి చెమ్మతో మసక గా కనిపిస్తుంది.
శేఖర్ రెండో బెడ్ వద్దకు వెళ్లాడు. అది తన బిడ్డ గుండె చప్పుడు.
“నాన్న నువ్వు వస్తావని నాకు తెలుసు, అది ఈ గుండెకు మాత్రమే తెలుసు నాన్న . అందుకే ఆక్సిజన్ అందని 30 సెకండ్స్ కే మెదడు మరణిస్తే, నేను మాత్రం మీకోసం కొట్టుకుంటూనే ఉన్నాను. శరీర అవయవాళ్ళకల్లా చివరిగా మరణించే అవయవం నేనే నాన్న.అది నీ కోసమే, నేను చూసిన మొదటి ప్రపంచం నీ చూపుడువేలు, నేను చూసిన లోకం అంతా నీ భుజాల మీద నుండి, అటువంటిది, నిన్ను పలకరించకుండా పాతిపెట్టేస్తారేమోనని భయమేసింది. కానీ అ..మ్మ… నన్ను రెండోసారి కన్నది నాన్న. ఎంత కష్టపడి నన్ను బతికించుకుందో నీకు తెలుసా? బహుశా ఈ ప్రపంచంలో పురిటి నొప్పులు కన్నా బాధాకరమైన ఏమైనా ఉన్నాయంటే, అవి అమ్మ కార్చిన కన్నీరే.. . నాకు నిన్ను తిరిగి కలిసే ఈ అవకాశం కల్పించిన అమ్మకు ధన్యవాదాలు చెప్పు.”
శేఖర్ కంటి వెంట నదుల దారులు .ఇక ముందుకు కదల లేక హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు
బరువైన గుండెతో దంపతులిద్దరూ విమానాశ్రయం చేరారు .కొద్దిసేపటికి బోర్డు పాస్ అనౌన్స్ విని పించింది. నిశ్శబ్దంతో గడ్డ కట్టినట్లు ఇద్దరు గేటు వైపుకు కదిలారు. గాలి గుసగుసలో తన బిడ్డ గొంతు పిలిచినట్లు వినిపిస్తుంది. వెను తిరిగి చూశాడు శేఖర్. తన వైపు చేతులు ఊపుతూ చాలా చూపులు. అవి తన బిడ్డ పంపించిన మనుషులవి. కాదు కాదు తన బిడ్డ బ్రతికించిన కుటుంబాలవి.ఎవరైనా తమ వెంట ఏమి తీసుజీకెళ్ళ గలరు.. ఇలా నాలుగు మంచి చూపులు తప్ప.
రచయిత : శ్రీ Ch.వీరప్పయ్య , ప్రముఖ సీనియర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు , గుంటూరు
Comments