లక్ష్మీదేవి అడ్రస్.. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్: Micro Investment
చిన్న నాణాలంటూ చిన్నచూపు చూడకండి.జేబుకు బరువై పోతున్నాయని బేజారైపోకండి. ఆ చిల్లర పైసలే రేపు నోట్లు అవుతాయి. నోట్ల కట్టలూ అవుతాయి.

చిన్న నాణాలంటూ చిన్నచూపు చూడకండి.జేబుకు బరువై పోతున్నాయని బేజారైపోకండి. ఆ చిల్లర పైసలే రేపు నోట్లు అవుతాయి. నోట్ల కట్టలూ అవుతాయి. ఒక్క రూపాయితోనూ పొదుపు-మదుపు ఆరంభించే అవకాశం ఉన్న ‘మైక్రో ఇన్వెస్ట్‌మెంట్’ ప్రాధాన్యాన్ని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులూ నొక్కి చెబుతున్నారు. షేర్లు, బంగారం, బాండ్లు... ఇలా అనేక మార్గాల్లో మదుపు చేసుకోవచ్చని సిఫార్సుచేస్తున్నారు.
అమ్మ పోపుల డబ్బా... ఓ మంత్రాల పెట్టె! పెద్దోడికి పరీక్ష ఫీజు కడుతుంది. చిన్నోడికి కొత్త సైకిలు కొనిస్తుంది. చిట్టితల్లికి వెండి పట్టీలు చేయిస్తుంది. తాతయ్య వైద్యానికి సాయం అందిస్తుంది. బంధు మిత్రులకు భరోసా ఇస్తుంది. అలా అని, అమ్మకేం జీతం రాదు. పసుపుకుంకాల కింద వచ్చిన ఆస్తిపాస్తులూ ఉండవు. నెలనెలా ఇంటి ఖర్చులకు నాన్న ఇచ్చే డబ్బులోనే... కొంత మిగలగా, కొంత మిగుల్చుకోగా పోగైన చిల్లర పైసలే అవన్నీ! తన పొదుపరితనంతో, ముందుజాగ్రత్తతో, కించిత్ లౌక్యంతో... ఆ పదులను వందలుగా, వందలను వేలుగా మార్చేస్తుంది అమ్మ. పర్సనల్ ఫైనాన్స్ పరిభాషలో చెప్పాలంటే, ఇదంతా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ మహత్యమే! ఒక్క అడుగుతో వేయిమైళ్ల ప్రయాణం సాధ్యమైనప్పుడు... ఒక్క రూపాయితో సుదీర్ఘ ఆర్థిక యాత్రను మాత్రం ఎందుకు ఆరంభించలేం? ఆ ఆశావాదమే మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌కు తొలి పెట్టుబడి. క్రమశిక్షణతో అడుగేస్తే, పద్ధతిగా మదుపు చేస్తే మనం చిల్లర పైసలంటూ చిన్నచూపు చూసే రూపాయి బిళ్లలూ, మనం పోతేపోనీ అని నిర్లక్ష్యం చేసే పది రూపాయల నోట్లూ దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టిస్తాయి.
బాత్‌రూమ్‌లోని కుళాయిలో లీకేజీ మొదలవుతుంది. టప్‌టప్‌మంటూ నిమిషానికో నీటిచుక్క కారిపోతూ ఉంటుంది. సాయంత్రానికంతా సగం బకెట్ నీళ్లు డ్రైనేజీ పాలవుతాయి. తెల్లారేసరికి ఓవర్‌హెడ్ ట్యాంకు మీదా ప్రభావం పడుతుంది. రెండు రోజులకైనా ఖాళీ కాని ట్యాంకు, ఇరవై నాలుగు గంటలకే నిండుకుంటుంది. మళ్లీ మోటారు వేసుకోవాలి. దెబ్బకు కరెంటు బిల్లు పెరుగుతుంది. లీకేజీ వల్ల బాత్‌రూమ్ ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఫలితంగా ఫ్లోర్ పాచిపట్టి పోతుంది. పొరపాటున ఎవరైనా కాలుజారి పడిపోతే... హాస్పిటల్ బిల్లు తడిసి మోపెడవుతుంది. అయినా, ఇక్కడ వృథాగా పోతున్నది నీళ్లు మాత్రమేనా? కానేకాదు. మన చెమట, మన రక్తం, మన శ్రమ, మన సంపాదన. ఇదే పోలిక చిల్లర పైసలకూ వర్తిస్తుంది. ఒక ఒకటి ఒకటే. కానీ వంద ఒకట్లు వంద. వంద వందలు పదివేలు. పదివేల వందలు అక్షరాలా పదిలక్షలు!
తాబేలు స్ఫూర్తితో...
పురాణాలు తాబేలును లక్ష్మీదేవి వాహనంగా చెబుతాయి. తాబేలు కవచంపై శ్రీచక్రం ఉన్న బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం అదృష్ట చిహ్నంగా భావిస్తారు. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా తాబేలు పరుగుతో పోల్చుకోవచ్చు. అందులో మెరుపు వేగం ఉండకపోవచ్చు. అచ్చంగా మందగమనమే కావచ్చు. కానీ స్థిరత్వం ఉంటుంది. ఆ పట్టుదల ముందు దీర్ఘకాలంలో కుందేలైనా కుదేలు కావాల్సిందే. కుందేలు ఆయువు మహా అయితే పదేళ్లు. అదే తాబేలు కనీసం నూట పదేళ్లు బతుకుతుంది. తన జీవితకాలంలో కుందేలు కంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తుంది. సుదీర్ఘ జీవనం, అలుపెరుగని ప్రయాణం... తాబేలు ప్రత్యేకతలు. అత్యుత్తమ పెట్టుబడుల లక్షణాలు కూడా. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ ఏనాడూ తప్పనిసరి ఖర్చులు తగ్గించుకోమని ఒత్తిడి చేయదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అదనంగా సంపాదించమనీ సలహా ఇవ్వదు. అర్థంలేని వృథాను అరికట్టమంటుంది.
దుబారాను దూరం పెట్టమంటుంది. ఖర్చుల తర్వాత మిగిలే చిల్లర పైసలను మదుపు చేస్తే చాలని సూచిస్తుంది. నిత్యావసరాలు, బట్టలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు... దేన్నయినా డిస్కౌంట్ సేల్‌లోనే కొనడం. ఆన్‌లైన్ క్రెడిట్ పాయింట్లను వినియోగించుకోవడం. విద్యుత్ వృథాను అరికట్టడం. ఫ్రిజ్‌లోని పదార్థాలు చెత్తపాలు కాకుండా జాగ్రత్తపడటం. చిన్నపాటి చిట్కాలతో వాహనాల మైలేజీ పెంచుకోవడం. సినిమా, రెస్టారెంట్ ఖర్చులకు కొంతమేర కోత పెట్టడం. క్రెడిట్‌కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తూ ఆలస్య రుసుముల భారం వదిలించుకోవడం. ఇలా, నెలవారీ బడ్జెట్‌లో వృథాకు కళ్లెం వేయడానికి ఎన్నో మార్గాలు. ప్రతి కొత్త అలవాటులానే, మొదట్లో కష్టంగా అనిపించినా మెల్లమెల్లగా జీవితంలో భాగమైపోతుంది. క్రమంగా బడ్జెట్‌లో పది నుంచి ఇరవైశాతం మిగులు సాధిస్తాం. ఆ సొమ్మును మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ వైపు మళ్లించుకుంటాం.
రాజు, రాము ఒకే కంపెనీలో ఉద్యోగులు. హోదాలూ, జీతాలూ సమానమే. ఒకే ఫండ్ హౌస్ నుంచి ప్రతినెలా చెరో పదివేలు ‘సిప్’ చేస్తున్నారు. సొంతింటి ప్రయత్నంలో భాగంగా ఇద్దరూ తమ పెట్టుబడులన్నీ నగదు చేసుకున్నారు. రాజుతో పోలిస్తే రాము రూ.లక్ష అదనంగా అందుకున్నాడు. కారణం... రాము సిప్‌తో పాటు ‘మైక్రో ఇన్వెస్ట్‌మెంట్’ మార్గాన్నీ అనుసరించాడు. ఆ ‘చిల్లర’ పైసల కానుకే ఈ నోట్ల కట్ట. రాజు ఎందుకో ఈ మార్గాన్ని విస్మరించాడు.
‘మైక్రో’ప్రెన్యూర్లు వచ్చేశారు...
‘డబ్బు సంపాదించడానికే పనిచేసేవారు కుబేరులు కాలేరు. డబ్బుతో పనిచేయించు కోవడం తెలిసినవాళ్లే సంపన్నుల జాబితాలో చేరతారు’ అంటారు రిచ్‌డాడ్-పూర్‌డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకీ. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం డబ్బు భాష నేర్చుకుంటాం. డబ్బు స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. డబ్బుతో పనిచేయించడం తెలుసుకుంటాం. ఆ బలమైన పునాదులతో మన ఆర్థిక సౌధాన్ని నిర్మించుకోవచ్చు. ఇక్కడ మదుపు చేయడానికి అనేక మార్గాలు. స్టాక్స్, డిజిటల్ గోల్డ్, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), మ్యూచువల్ ఫండ్స్... దేన్నయినా ఎంచుకోవచ్చు. తాత్కాలికంగా ఎగుడుదిగుళ్లు ఉన్నా దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రాబడినే అందుకుంటాం. అందుకే, కొత్తతరం ఇటువైపు మొగ్గు చూపుతోంది. ఇంటర్నెట్ వినియోగం, యూపీఐ చెల్లింపులు, యువత ఆర్థిక అలవాట్లు... మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ బూమ్‌కు ప్రధాన కారణం. ఇప్పటికే, ఎంతోమంది ఫిన్‌టెక్ ఆంత్రప్రెన్యూర్లు చిల్లరను నోట్లుగా మార్చే పనిలో తలమునకలై ఉన్నారు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్‌లో కాలు పెట్టడానికి కనీస అర్హత... ఓ ఖరీదైన బ్రీఫ్‌కేస్, అందులో పెద్దనోట్ల కట్టలు. అదంతా గతం. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ పుణ్యమాని... చిల్లర పైసలతోనూ శ్రీమహాలక్ష్మి కటాక్షం సాధ్యం అవుతోంది. ఆ మదుపు కూడా మనకు అనువైన పద్ధతుల్లోనే. ఏ ఇ-కిరాణా కొట్టులోనో సరుకులు ఆర్డర్ చేస్తాం.
బిల్లు మూడువందలా డెబ్భై రూపాయలు అవుతుంది. ఇంకో ముప్పై రూపాయలు జోడిస్తే... ‘చుత్తా’ అయిపోతుంది. మన అనుమతితో ఆ అదనపు సొమ్ము నేరుగా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు చేరుతుంది. రోజూ మనం ఆన్‌లైన్‌లో ఏదో ఒకటి తెప్పించుకుంటూనే ఉంటాం కాబట్టి, ప్రతి చెల్లింపుతో కొంత చిల్లర మదుపు ఖాతాలో జమ అవుతుంది. ఖర్చు చేస్తూనే పొదుపు చేయడమంటే ఇదే! నిత్యం పది, పాతిక, వంద... ఇలా ఓ స్థిరమైన చిన్న మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి మళ్లించేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఖర్చుచేసే ప్రతి రూపాయికీ, పది పైసల చొప్పున ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌కు మళ్లించే డిజిటల్ పేమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. స్పెన్నీ, డెసిమల్, స్పేర్8 తదితర వేదికలు ఆ మొత్తాల్ని రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. జార్‌లాంటి సంస్థలైతే నేరుగా ఇ-బంగారాన్నే కొనిపెడతాయి. చెల్లింపు జరిగిన మరునిమిషమే ఆయా సంస్థల యాప్‌లలో మన పెట్టుబడుల వివరాలు నమోదు అవుతాయి. కొన్ని యాప్స్ ‘గేమిఫికేషన్’ పద్ధతిలో పొదుపు-మదుపు పాఠాలూ నేర్పుతాయి. మన డబ్బు ఎలా వృద్ధి చెందుతున్నదీ నేరుగా యాప్‌లో చూసుకోవచ్చు.
మరీ అవసరమైతే ఆ రోజు విలువకు అమ్ముకోవచ్చు. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే... కాయిన్ రూపంలోనో, బిస్కెట్ రూపంలోనో అచ్చంగా బంగారమే కావాలనుకుంటే కొరియర్ ద్వారా పంపుతారు. ఎవరి మీదో ఆధారపడటం ఎందుకనుకుంటే... నేరుగా మనమే మదుపు చేసే అవకాశాలూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కూడా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రోత్సహిస్తోంది. నెలకు వంద రూపాయల పెట్టుబడితోనూ మైక్రో-సిప్‌ను రూపొందించాలని మ్యూచువల్ ఫండ్ కంపెనీలను ఆదేశించింది. ఈ తరహా పథకాలకూ ఆదరణ పెరుగుతోంది. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను తాత్కాలిక అవసరాల కోసం ఉపసంహరించుకోకుండా, కనీసం ఓ పదేళ్లు కొనసాగించడం మంచిదని చెబుతారు నిపుణులు. అప్పుడే, చిల్లర మదుపులోని చమక్కుల్ని కళ్లారా చూడగలం.
అదో కిక్!
మనం మిఠాయి కొట్టుకు వెళ్లగానే, దుకాణదారు ఓ స్వీటు ముక్క చేతిలో పెడతాడు. వెంటనే నోట్లో వేసుకుంటాం. రుచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. పావు కిలో కొనడానికి వెళ్లినవాళ్లం... ఏకంగా రెండు కిలోలు ఆర్డర్ చేస్తాం. బద్ధకించీ బద్ధకించీ... మొత్తానికి ఓ రోజు వాకింగ్‌కు బయల్దేరతాం. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాలు భలేగా నచ్చుతాయి. పదిహేను నిమిషాల్లో తిరిగొద్దామని వెళ్లినవాళ్లం కాస్తా గంటసేపు నడిచేస్తాం! ఏదో సందర్భంలో ఓ మిత్రుడు పాత పుస్తకం చేతిలో పెడతాడు. ఆర్నెల్ల తర్వాత... యథాలాపంగా రెండు పేజీలు తిరగేస్తాం. ఆసక్తిగా అనిపిస్తుంది. ఏకబిగిన చదివేస్తాం! మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ కూడా అలాంటిదే. చిల్లరతో మొదలైనా చిల్లర దగ్గరే ఆగిపోదు.
పెద్దనోట్లకూ విస్తరిస్తుంది. ఒక్కసారి పొదుపు అవసరం తెలిశాకా, మదుపు ప్రాధాన్యం అర్థమైపోయాకా, రాబడి రుచి మరిగాకా... మన ఆలోచనా విధానమే మారిపోతుంది. డబ్బును చూసే పద్ధతిలోనూ తేడా వచ్చేస్తుంది. ఖర్చయిపోగా మిగిలిన సొమ్మును దాచుకోవడం కాదు, దాచుకోగా మిగిలిన సొమ్మునే ఖర్చు చేయాలని తీర్మానించుకుంటాం. అత్యవసర నిధి, రిటైర్మెంట్ ఫండ్ గురించీ సీరియస్‌గా ఆలోచిస్తాం. చిల్లర విషయంలో మునుపటి తేలికభావం మాయమైపోతుంది. కాబట్టే, చిల్లర మదుపును ‘ఛేంజ్ ఇన్వెస్ట్‌మెంట్’ అనీ అంటారు. నిజానికి ఇది ‘మార్పు’ ఇన్వెస్ట్‌మెంట్ కూడా. ముహూర్తాలతో పన్లేదు. మంచిరోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో పెద్ద మొత్తం ఉండాలన్న నియమం లేదు. బోనస్‌లూ, ఇంక్రిమెంట్లూ వచ్చిన తర్వాతే మొదలుపెట్టాలనే షరతు లేదు. దలాల్‌స్ట్రీట్ కదలికల మీదో, బంగారం ధరల హెచ్చుతగ్గుల మీదో పట్టు సాధించాకే ఇన్వెస్ట్ చేయాలనుకోవడమూ సరికాదు. చిన్నచిన్న పెట్టుబడులు పెడుతూనే మార్కెట్ మెలకువలు తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది మైక్రో ఇన్వెస్ట్ట్‌మెంట్. ఆ ప్రయత్నంలో ఏదైనా పొరపాటు చేసినా పెద్దగా నష్టపోయేదీ ఉండదు. అది మన జీవితంలోని అత్యుత్తమమైన తప్పే అవుతుంది. ఏ మనీ గురువులూ బోధించని విలువైన పాఠాన్ని నేర్పుతుంది ఆ అనుభవం. నిర్లిప్తతతోనో, బద్ధకంకొద్దో మైక్రో ఇన్వెస్ట్ట్‌మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసినంత కాలం... చిల్లర శ్రీమహాలక్ష్మి మన గడప బయటే నిలబడుతుంది.
పిల్లలకు పాఠాలు
‘భారతీయులు పేదలుగా పుట్టి... సంపన్నులుగా మారి... నిరుపేదలుగా మరణిస్తారు’ అని ఎగతాళి చేస్తుంటారు ఆర్థికవేత్తలు. కారణం, నిరుపేద కుటుంబంలో జన్మించినా... కష్టపడి కోట్లకు కోట్లు సంపాదించినా... ఆ సొమ్మును కనీస అవసరాలకూ ఖర్చు చేసుకోరు. ఆస్తి పాస్తులన్నీ వారసులకు కట్టబెట్టాలనే అర్థంలేని ఆరాటమే అందుకు కారణం. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు సైకిల్ నేర్పుతాం. ఈత నేర్పుతాం. సంగీతం నేర్పుతాం. కోడింగ్ కూడా నేర్పుతాం. కానీ, ఏ దశలోనూ సంపాదన గురించి బోధించం. మనిషికి అత్యవసరమైన జీవన కళ ఇది. పైసాపైసా కూడబెట్టి కోట్లకొద్దీ సంపదను బంగారు పళ్లెంలో అందించినా... పిల్లలకు బొత్తిగా ఆర్థిక విద్య తెలియకపోతే, ఆ కొండల్ని మన కళ్లముందే కరిగించేస్తారు. మనం భారీగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, ఆర్థిక అక్షరాలు నేర్పగలిగితే, డబ్బు విలువ తెలియజెప్పగలిగితే... వాళ్లే సంపాదించు కుంటారు. సంపాదించింది నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకున్నది పదింతలు చేసుకుంటారు. ఎదుగుతున్న దశలో పిల్లలతో ఆర్థిక అక్షరాభ్యాసం చేయించడానికి మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ అత్యుత్తమ మార్గం.
‘నీ పాకెట్ మనీ నీ ఇష్టం. కానీ, ఖర్చుచేయగా మిగిలిన చిల్లర పైసల్ని మాత్రం జాగ్రత్తగా మదుపు చేయాలి!’ అని షరతు పెడితే కాదంటారా? ఉత్సాహంగా ముందుకొస్తారు. పది ఇరవైగా, యాభై వందగా డబ్బే డబ్బును పొదుగుతున్న తీరును చూసి మురిసిపోతారు. అంతేనా, వాళ్లకు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుంది. ఎందుకు పాతాళానికి పడిపోతుందో, ఎందుకు పైపైకి దూసుకుపోతుందో కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. ఆమాత్రం అవగాహన చాలు. జీవితంలో స్థిరపడ్డాక తొలి సంపాదన నుంచే మదుపు ప్రయాణం ప్రారంభిస్తారు.
పెద్దలకూ పనికొస్తుంది
వయసు పెరిగేకొద్దీ డబ్బు అవసరమూ పెరుగుతుంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగులు కూడా నిరభ్యంతరంగా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. మెడికల్ షాపులో ఏ మందులో కొన్నప్పుడు తిరిగిచ్చే చిల్లర పైసలనూ, నెలాఖరుకు పెన్షన్ ఖాతాలో మిగిలే అడుగుబొడుగు నోట్లనూ పెట్టుబడిగా మార్చుకోవచ్చు. సంపాదనాపరులు సైతం మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను అదనపు మదుపు మార్గంగా భావించవచ్చు. రోజూ సాయంత్రం ఇంటికెళ్లాక పర్సులోంచి ఓ పది రూపాయలు తీసి పక్కన పెట్టినా... అందులో ఆదివారాలు మినహాయించినా... నెలకు రెండొందల యాభై రూపాయలు అవుతుంది. పాతికేళ్లకు ఆ సొమ్ము డెబ్భై అయిదు వేలకు చేరుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏ సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలోనో స్టాక్ మార్కెట్‌కు మళ్లిస్తే... దీర్ఘకాలంలో సాలీనా పద్నాలుగు శాతం రాబడితో దాదాపు రూ.ఆరు లక్షలు సమకూరుతుంది. రిటైర్మెంట్ ఫండ్‌కు ఇది అదనపు జోడింపు. అనుకోని ఖర్చుల్ని అధిగమించడానికి కూడా పనికొస్తుంది. దేశ జనాభాలో ఐదుశాతం మందే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, తొంభై అయిదుశాతం ప్రజలు ఓ దీర్ఘకాలిక మదుపు మార్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను జనంలోకి తీసుకెళ్లగలిగితే... మదుపర్ల సంఖ్యా పెరుగుతుంది. షరా: ఏ పెట్టుబడిలో అయినా రిస్క్ ఉంటుంది. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌కూ ఈ మాట వర్తిస్తుంది.
***
పంచుకునే మనసు ఉంటుంది. పంచుకోడానికి డబ్బు ఉండదు. వికలాంగుల కోసమో, అనాథల కోసమో నిజాయతీగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయాలని చాలాసార్లు అనుకుంటాం. కానీ, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా ఏ నెలకు ఆ నెల నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటాం. అలా అని, పూర్తిగా వెనక్కి తగ్గడానికేమో అంతరాత్మ అంగీకరించదు. ఇలాంటి సందర్భాల్లో మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను సామాజిక బాధ్యతలకు ఓ వేదికగా ఎంచుకోవచ్చు. రెండేళ్లు తిరిగేసరికి మంచి మొత్తమే సమకూరుతుంది. ఆ డబ్బు ఓ పేద విద్యార్థి పాఠ్య పుస్తకాలకు పనికిరావచ్చు. ఓ వృద్ధుడి నేత్ర చికిత్సకు సరిపోవచ్చు. ఓ వికలాంగుడి వీల్ చెయిర్‌కు ఉపయోగ పడొచ్చు. అవును, చిన్న మొత్తాలతో పెద్ద సంతృప్తీ సాధ్యమే.
‘చిల్లర’ మదుపు ఇలా...
అనేక అంకుర సంస్థలు మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ సేవలు అందిస్తున్నాయి. ఆయా కంపెనీల విశ్వసనీయత, గత చరిత్ర, తాజా ఆర్థిక ఫలితాలు, సర్వీస్ చార్జీల ఆధారంగా ఓ మంచి వేదికను ఎంచుకోవాలి. తర్వాత, ఆ కంపెనీ మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రాథమిక వివరాలతో లాగిన్ కావాలి. నో యువర్ కస్టమర్ (కేవైసీ) కాలమ్‌లో వివరాలు నింపాలి. కొన్ని సంస్థలు రూ. యాభైవేల లోపు వార్షిక పెట్టుబడులకు కేవైసీ అడగటం లేదు కూడా. ఐచ్ఛికాల్లోకి వెళ్లి స్టాక్ మార్కెట్, బంగారం... ఇలా నచ్చిన పెట్టుబడి మార్గానికి టిక్ పెట్టొచ్చు. షాపింగ్‌లో మిగిలే చిల్లర పైసలు, బ్యాంకు ఖాతా నుంచి రోజువారీ లేదా నెలవారీ చెల్లింపులు... ఇలా మనం నిధులు సమకూర్చే విధానాన్నీ స్పష్టం చేయాలి. అవసరమైతే మన బ్యాంకు ఖాతాతో ఆ చెల్లింపుల్ని అనుసంధానించాలి. ఆ తర్వాత కూడా, ప్రతి రూపాయీ మన ఖాతాలో జమ అవుతున్నదీ లేనిదీ గమనించుకుంటూ ఉండాలి. ఫండ్ హౌస్ పనితీరుపై ఓ కన్నేసి ఉంచాలి. రాబడి ఏమంత సంతృప్తికరంగా లేకపోతే, ప్రత్యామ్నాయం ఆలోచించాలి. చిల్లర ఎవరికీ ఊరికే రాదు!
‘సూక్ష్మ’ సూక్తులు!
సంపాదించడం కళే. కానీ, సంపాదించింది నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద కళ.
మొదట సంపాదిస్తూ ఆనందించాలి, ఆ తర్వాత పొదుపు చేస్తూ ఆనందించాలి, చివరగా ఖర్చు చేస్తూ ఆనందించాలి.
సంపద సృష్టికి రెండే మార్గాలు. ఒకటి.. ఇంకొంత సంపాదించడం లేదా ఇంకొంత పొదుపు చేయడం.
నీ ఆర్థిక స్థితిని నీ సంపాదన నిర్ణయించదు, నీ ఖర్చులు నిర్ధారిస్తాయి.
పొదుపు అనేది అంకెలకు సంబంధించిన వ్యవహారం కాదు, నిబద్ధతతో ముడిపడిన విషయం.
సంపన్నుడిలా కనిపించాలని ఆరాటపడినంత కాలం, నువ్వు పేదగానే మిగిలిపోతావు.
మనం కాపాడుకున్న సొమ్మే కష్టకాలంలో మనల్ని కాపాడుతుంది.
పొదుపు మహా సులభమైన పని... మన కోసం మన అమ్మానాన్నలు చేసిపెట్టినప్పుడు!
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments