top of page
Writer's pictureAP Teachers TV

ఫేసియల్ యాప్ తో జీతాలకు లింకు-బిగుస్తున్న ఉచ్చు!


ఫేసియల్ యాప్ తో జీతాలకు లింకు.... బిగుస్తున్న ఉచ్చు!

నిన్న కెజిబివి స్కూళ్లు... నేడు సచివాలయ ఉద్యోగులు ....

తదుపరి ఉపాధ్యాయులపైనే గురి.....!


ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు గడ్డు కాలమే!

పువ్వమ్మా.... పత్రమ్మా ... అంటూ ఊరడిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రస్ఫుటం చేసింది. ఫేసియల్ యాప్ హాజరు ప్రాతిపదికన వేతనాలు చెల్లింపు అనే పిడుగులాంటి వార్త ఇపుడు చక్కర్లు కొడుతోంది. అదే ఇపుడు ఉద్యోగవర్గంలో భయాందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల్లో వురుకులు పరుగులు మొదలయ్యాయి. ప్రభుత్వద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడం కోసం 2018లో ప్రవేశపెట్టబడిన బయోమెట్రిక్ కరోనా కాలంలో అటకెక్కింది. ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత పెంచేందుకే తమ చర్యలు అని బయటికి ప్రకటించినా ప్రభుత్వాధినేతల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను, వారి వైఖరిని ఇరుకున పెట్టాలనే వ్యూహం అంతర్లీనంగా ఉందనేది జగమెరిగిన సత్యం. వ్యవస్థీకృత సోమరితనాన్ని రూపుమాపి సంస్థాగత పటిష్టత ద్వారా ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆశించడం ఆహ్వానించదగిన విధానమే! కార్యాలయాల్లో పేలవమైన పనితీరును ప్రక్షాళన చేయబూనడం వాంఛనీయమే. పని గంటలలో కుదురుగా పని చేయంచడం అవసమే. వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను అమలుచేయడం, సాంకేతికతను అమలు చేయడం, అనవసర కాలయాపనను సంస్కరించడం అవసరమే.

కానీ ఆ ప్రయత్నంలో పనిగట్టుకుని వేధించే చర్యలు సహేతుకం కాదు కదా!. ఫేసియల్ యాప్ హాజరుకు వేతనాల చెల్లింపుకు సంబంధం లేదని చెబుతూవస్తున్న ప్రభుత్వాధినేతల స్వరం మారింది.

ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరిన మూడేళ్ళ తర్వాత ఉద్యోగులను సమయపాలన చట్టానికి మరింతగా పదును పెట్టిన నేపథ్యంలో పరిణామాల పరంపరను ఒకసారి విశ్లేషిద్దాం.


అది కూడా 2022 జనవరి 7న ప్రభుత్వం వేతన సవరణ సంఘం సిఫారసులను పక్కన పెట్టి సొంత సిఫార్సులు ప్రకటించడం, ఉద్యోగవర్గాలకు ఎక్కువ నష్టం వాటిల్లడం, ఉద్యోగులు ఉద్యమ పథం పట్టడం, చలో విజయవాడ నిర్వహించి ప్రభుత్వానికి చెమటలు పట్టించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. కనీసం పీఆర్సీ నివేదిక కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల వాస్తవ ఆకాంక్షలను ప్రభుత్వం వత్తిడిగా భావించింది. ఈ నేపధ్యంలో వారిని కట్టడి చేయాలని గట్టి నిర్ణయానికి వచ్చింది. తొలి అస్త్రంగా పనిభారం పెంచడం, క్షణం తీరికలేని విధంగా కార్యక్రమాలు అమలుచేస్తూ సెల్ ఫోన్ ద్వారానే తమకు అవసరమైన సమాచారాన్ని యాపుల్లో అప్లోడ్ చేయించే యత్నాలు ముమ్మరం చేసింది. బయోమెట్రిక్ యంత్రాలు మంగళం పాడి ఉద్యోగ, ఉపాధ్యాయుల సొంత సెల్ ఫోన్లతోనే పేసియల్ యాప్ వేసేలా కొత్త విధానాన్ని ఆగష్టు నుంచి అమల్లోకి తెచ్చింది. బయోమెట్రిక్ హాజరు సేకరించడం, జవాబుదారీతనం పెంచడం క్షేత్రస్థాయిలో క్రమశిక్షణ పెంచడం వంటి విషయాలు ఆహ్వానించదగినవే.


అయితే ఒకవైపు అధికారాల వికేంద్రీకరణ అంటూనే రెండోవైపున వాస్తవాధికారాల నిర్వహణ ఉన్నతస్థాయిలో కేంద్రీకృతమౌతోంది. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసిన సందర్భంగా తిరిగి విధుల్లోకి అనుమతించే విషయం జిల్లా స్థాయి నుంచి సెక్రెటరీయేట్ కు చేరింది. మెమోకు బదులు సస్పెన్షన్ తొలి అస్త్రంగా మారింది. కనీసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక పూట సెలవు ఇచ్చే అవశిష్ఠ అధికారం కూడా ఉన్నతాధికారుల ఖాతాలో జమయ్యింది.


ఉద్యోగుల శ్రేయస్సు గురించి ఇటీవల ఒక మంత్రివర్యులు సాదాసీదాగా మాట్లాడినా ప్రభుత్వ నిజ వైఖరిగానే భావించాల్సివుంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల పక్షం కాదని అనేది తేటతెల్లమైంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ తమ ప్రాధాన్యత కాదని వారు నేరుగానే స్పష్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వం- ఉద్యోగుల మధ్య అసమతుల్యతకు దారి తీస్తుంది. ఆ బొంద కూడా పీఆర్సీ అమలు విషయంలో ఏర్పడిందే! వాస్తవానికి సదరు పీఆర్సీ ద్వారా ఉద్యోగవర్గం బావుకున్నదేమీ లేదు. వివిధ స్లాబుల్లో కొంత శాతం ఇంటి అద్దె కోత, అశాస్త్రీయంగా, అసాధారణంగా మధ్యంతర భృతి కంటే నాలుగు శాతం ఫిట్మెంట్ నుండి తగ్గింపు, జీతాల పెంపును గణాంకాల్లో చూపి కరువు భత్యంను మాయం చేయడం, జీతంలో పెరుగుదల బయటకు కనిపించినా ఎంత లాభం జరగాలో జరగక పోగా, లోపల ఎంత నష్టం జరకూడదో అంత కంటే ఎక్కువే జరిగింది. మరోవైపు స్వల్పంగా పెరిగిన జీతం నుంచి ఎపిజిఎల్ఐ, పి.ఎఫ్, ప్రీమియం స్లాబులను పెంచి ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కు లాక్కుంది. అంతే చేతికి అందని మొత్తాలకు కూడా ఆదాయపన్ను చెల్లింపు చేయాల్సిరావడం శుభపరిణామం కాదు.

అంతే కాదు, నిజ వేతనాలు అమలు కావట్లేదు. డి.ఏ అంటే అర్థం మారిపోయింది. స్వేచ్చా విఫణిలో ధరల పెరుగుదలకు అనుగుణంగా డియర్నెస్ అలవెన్సు హెచ్చింపు లేనందువల్ల ఉద్యోగుల కొనుగోలు సామర్ధ్యం సన్నగిల్లిపోతుంది. ఎప్పుడు ఇవ్వాల్సిన కరువు భత్యం అప్పుడు రాకపోగా సంవత్సరాల తరబడి పెండింగులో పెట్టి చివరకు రద్దుచేసి స్థాయి అధికారం రాజ్యమేలుతున్నది. నెలసరి జీతాల చెల్లింపులో జాప్యం వారి ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కుంగదీస్తోంది. జీతం చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం రుణాలు తీసుకున్న ఉద్యోగుల పరపతిని దెబ్బ తీస్తోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో కార్యక్రమాల సాఫల్యతకు వారధులైన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాధం పెరిగిపోతోంది. హక్కుల అమలులో నమ్మకం సడలుతున్నది.


ఈ దశలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేసియల్ యాప్ హాజరు ప్రామాణికంగా వేతనాల చెల్లింపుకు దిగితే ఉద్యోగవర్గం మరిన్ని కష్టనష్టాలను చవిచూడాల్సివుంటుంది. సాంకేతిక సమస్యలు పెద్దయెత్తున గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతుండగా ఆలస్యానికి ఆలసత్వం కారణంగానూ, అది గైర్హాజరుగానూ దానికి జీత నష్టాన్ని ప్రతిఫలంగా ఇవ్వాలని తలపోయడం వేధింపులుగానే చూడాల్సివుంటుంది. ప్రతి చిన్న విషయాన్ని సీసీఏ రూల్స్ చట్రానికి ముడిపెడుతున్న అధికారగణం చర్యలు ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెంచేవిగా ఉంటున్నాయి. అదే సందర్భంలో సొంత సెల్ ఫోన్, ఇంటర్నెట్ ప్రభుత్వం కోసం వినియోగించాలని నిబంధన కూడా ఎక్కడా లేదు. ఈ దశలో స్ధానిక డీడీఓ లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సివుంటుంది. ప్రత్యేకించి విద్యారంగాన్ని ఇతర శాఖలతో పొల్చడం సారి కాదు.

బోధనా సమయంలో ఇతర బాధ్యతలు ఇరుకున పెడుతున్నందున అన్నింటికీ మించి తరగతిలో స్వేచ్ఛ తగ్గుతోంది. వీటన్నింటి ఒకసారి పరిశీలించి తదనుగుణంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత. గోవ్యాఘ్ర కదనం అవాచనీయం.!


-మోహన్ దాస్, ఎపిటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్.

0 comments

Comments


bottom of page