ఫోన్ పోయిందా? ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సిమ్ మార్చినా కనిపెట్టొచ్చు! Lost your phone?
Lost your phone: ఫోన్ పోగొట్టుకున్నారా? ఈ పోర్టల్ సాయంతో మీ ఫోన్‌ను ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలా అంటే..?

Lost your phone | మొబైల్ ఫోన్.. ఇది లేకుండా చాలా మందికి రోజు గడవదు. మనిషి జీవితంతో అంతలా మమేకమైందీ గ్యాడ్జెట్. డబ్బు చెల్లింపుల నుంచి కాంటాక్టులు, మెసేజ్‌లు, ఫొటోలు, విజ్ఞానం, వినోదం.. ఇలా అన్నింటికీ సెల్ ఫోన్ పైనే ఆధారపడుతుంటాం. ఇంతటి విలువైన ఫోన్ చోరీకి గురైతే? సాధారణంగా అయితే ఫోన్ పోతే ఆశలు వదుకోవాల్సిందే. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్ అందుబాటులోకి వచ్చిన కారణంగా.. పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికి పట్టుకోవడం సాధ్యమవుతోంది.
సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేయడం.. అది దొరికాక తిరిగి అన్‌బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. ఎవరైనా ఫోన్ పోయిన తర్వాత తొలుత మీసేవ కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ప్రతిని భద్రపరచుకోవాలి. అనంతరం సెల్‌ఫోన్ స్టోర్‌కు వెళ్లి అదే నంబర్‌పై కొత్త సిమ్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గానే పాత సిమ్ బ్లాక్ అయిపోతుంది. అనంతరం సీఈఐఆర్ పోర్టల్ ఓపెన్ చేస్తే కనిపించే అందులో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ (Block Stolen/Lost Mobile) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లో అప్పటివరకు వినియోగించిన ఫోన్ నంబర్లు, ఐఎంఈఐ (IMEI) నంబర్లతోపాటు అక్కడ అడిగిన ఇతర వివరాలను నమోదు చేయాలి. ఫిర్యాదు ప్రతి, వ్యక్తిగత గుర్తింపుకార్డు (ఆధార్ మాదిరి), ఫోన్ కొనుగోలు రశీదు (అందుబాటులో ఉంటే) అప్‌లోడ్ చేయాలి. అనంతరం.. మీ కొత్త సిమ్‌కు రిక్వెస్ట్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ఆధారంగా కేసు స్టేటస్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఇలా ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా సీఈఐఆర్ పోర్టల్ సిబ్బంది ఆ ఫోన్‌ను బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు.
వేరే సిమ్ వేసినా..
సాధారణంగా ఫోన్ దొంగిలించినా/ దొరికినా.. వాళ్లు దానిలో కొత్త సిమ్ వేసుకొని వినియోగించుకోవాలని చూస్తారు. ఇలా బ్లాక్ చేసిన మొబైల్లో ఇతరులు ఎవరైనా సిమ్ కార్డ్ వేస్తే, వెంటనే సీఈఐఆర్‌కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. పోలీసులతో పాటు దొంగిలించిన ఫోన్‌లో వేసిన కొత్త సిమ్‌కు మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ రాగానే పోలీసులకు ఫోన్ ఏ ప్రాంతంలో ఉందనే విషయం సులువుగా తెలిసిపోతుంది. వెంటనే పోలీసులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి విషయం వివరిస్తారు. ఇక దొంగిలించినా లేదా పొరపాటున దొరికినా ఆ ఫోన్‌ను తిరిగి ఇవ్వకుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని గ్రహించి వెంటే మొబైల్‌ను తిరిగి ఇవ్వాల్సిందే.
అన్- బ్లాక్ చేసేయండిలా..
ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దొరికితే యూజర్ సీఈఐఆర్ పోర్టల్‌లో అన్-బ్లాక్ ఫౌండ్ మొబైల్ (Un-Block Found Mobile) ఆప్షన్‌ను ఎంచుకొని రిక్వెస్ట్ ఐడీ, ఫోన్ నంబర్ వివరాలు సమర్పిస్తే.. ఫోన్ అన్-బ్లాక్ అవుతుంది. అలా దాన్ని తిరిగి వినియోగించుకోవచ్చు.
మీ ఐఎమ్‌ఈఐ నంబర్ బ్లాక్‌లో ఉందా?
ఇక సాధారణంగా చోరీ చేసిన ఫోన్లను ఇతరులకు తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. అలా కొనుగోలు చేసినప్పుడు చిక్కుల్లో పడకుండా ముందు జాగ్రత్తగా.. తాము ఎంచుకున్న ఫోన్ ఐఎమ్‌ఈఐ నంబర్ బ్లాక్ లిస్ట్‌లో ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం KYM<15 అంకెల ఐఎమ్‌ఈఐ నంబర్> టైప్ చేసి14422కు ఎస్సెమ్మెస్ పంపి మీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments