top of page
Writer's pictureAP Teachers TV

పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు!

కౌమారంలో మీసాన్నీ, యవ్వనంలో రోషాన్నీ.. గిఫ్ట్‌బాక్స్‌లో పెట్టి మరీ అందించిన టెస్టోస్టిరాన్‌ హఠాత్తుగా సహాయనిరాకరణ చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది.


కౌమారంలో మీసాన్నీ, యవ్వనంలో రోషాన్నీ.. గిఫ్ట్‌బాక్స్‌లో పెట్టి మరీ అందించిన టెస్టోస్టిరాన్‌ హఠాత్తుగా సహాయనిరాకరణ చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆ రసిక శిఖామణిని ఉత్తుత్తి మన్మథుడిగా మార్చేస్తుంది. ప్రతి యాభైమంది పురుషుల్లో ఒకరు టెస్టోస్టిరాన్‌ టెస్టులో విఫలం అవుతున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్య సంక్షోభానికి అనేక కారణాలున్నా.. జీవనశైలి లోపాన్నే ప్రధాన ముద్దాయిగా బోన్లో నిలబెడుతున్నారు వైద్య నిపుణులు.  


ఇతను.. అతనేనా?ఒకటో నంబరులా నిటారుగా ఉండేవాడు. ఇప్పుడేమో, ప్రశ్నార్థకంలా ఓ పక్కకి వాలిపోయాడు. వేడి తగ్గింది. వాడి మాయమైంది. ఆత్మవిశ్వాసం ఆవిరైంది. కండబలం కరిగిపోయింది. పెద్ద వయసూ కాదు. తీవ్ర అనారోగ్యాలూ లేవు. అయినా ఎందుకిలా? చిత్తుగా  ఓడిపోయిన మత్తగజంలా? ఊహించని ఆ మార్పు అతడినీ కుంగదీస్తోంది. ఎంత మథనపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో?

ఏ ఆడపిల్లో అయితే అక్కకో, చెల్లికో చెప్పుకుని బరువు దించేసుకుంటుంది. నాలుగు కన్నీళ్లు రాల్చి నిశ్చింతగా నిద్రపోతుంది. అతనేమో చెట్టంత మగాడాయె! ఏకంగా తన పురుషత్వమే ప్రమాదంలో పడిందని ఎలా చెప్పుకుంటాడు పాపం? మొహమాటం పక్కనపెట్టి ఆ ప్రయత్నమూ చేశాడు. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తే మగ మెనోపాజ్‌.. ఆండ్రోపాజ్‌ లక్షణమని సమాధానం వచ్చింది. ఊబకాయం వల్ల కావచ్చని ఒకరూ, మధుమేహం దాడి చేసిందని మరొకరూ జోస్యం చెప్పారు. అన్నీ నిజాలు కాదు. అలా అని, అబద్ధాలూ కావు. అర్ధ సత్యాలు. అరకొర సమాచారాలు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాక కానీ స్పష్టత రాలేదు.. టెస్టోస్టిరాన్‌ లోపమని. ప్రతి యాభైమంది పురుషుల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. నిన్న మొన్నటి వరకూ టెస్టోస్టిరాన్‌ లోపాన్ని పెరిగే వయసుతో ముడిపెట్టేవారు. నడివయసు సంక్షోభంగా చిత్రించేవారు. ఇప్పుడు, పాతికేళ్ల యువకుల్లోనూ కనిపిస్తోంది.  



మగతనానికి బండగుర్తు!

టెస్టోస్టిరాన్‌.. పురుషుడికి మగతనాన్ని ప్రసాదించే దమ్మున్న హార్మోను. ఆమె నుంచి అతడిని వేరుచేసే స్పష్టమైన విభజన రేఖ. కండబలాన్నిచ్చి భౌతికంగా శక్తిమంతుడిని చేస్తుంది. గుండెబలాన్నిచ్చి ఉద్వేగ పరంగానూ బలవంతుడిగా మారుస్తుంది. తొంభై అయిదుశాతం టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ వృషణాల్లోనే తయారవుతుంది. మిగతా ఐదుశాతాన్ని అడ్రినల్‌ గ్రంథి సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తాన్నీ మెదడు ఒంటిచేత్తో నియంత్రిస్తుంది. అబ్బాయిలు కౌమారంలోకి ప్రవేశించగానే.. మీసాలూ గడ్డాలూ మొలవడం, పీలగా ఉన్న గొంతు కాస్తా గంభీరంగా మారిపోవడం, లేలేత శరీరం దృఢంగా తయారుకావడం.. టెస్టోస్టిరాన్‌ ప్రభావాలే. ప్రతి డెసీలీటరు రక్తంలో 300 నానోగ్రాముల కంటే తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉన్నప్పుడు.. దాన్ని ‘హైపోగోనాడిజం’గా పరిగణిస్తారు. పురుషుడిలోని టెస్టోస్టిరాన్‌ స్థాయిని నిర్ధారించడానికి చిన్నపాటి రక్తపరీక్ష సరిపోతుంది. మగాడికి నలభై దాటాక ఏడాదికి ఒక శాతం చొప్పున టెస్టోస్టిరాన్‌ ఊట మందగిస్తుంది. ఆరుపదుల తర్వాత మరింత వేగంగా పడిపోతుంది. కానీ, నేటితరం విషయానికి వచ్చేసరికి నాలుగు పదులు నిండకుండానే నిండుకుంటోంది. వృత్తి ఉద్యోగాల ఒత్తిడి, వేళాపాళాలేని భోజనాలు, నిద్రలేమి.. తదితర జీవనశైలి సమస్యలు ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన రుగ్మతలూ దీనికి తోడవు తున్నాయి.



ఏమైంది రావుగారూ?

పాల్‌ ఉరఫ్‌ గోపాల్ర్‌ావు.. ఓ ఐటీ కంపెనీలో టీమ్‌ లీడర్‌. వయసు నలభై లోపే. పక్కా ప్రొఫెషనల్‌. లక్ష్యాల వెంట పరుగులు తీస్తాడు. అవసరమైతే, రాత్రీ పగలూ ఆఫీసులోనే ఉంటాడు. ఆరునెలలకో ఇంక్రిమెంటు, ఏడాదికో ప్రమోషను అతని ఖాతాలో పడాల్సిందే. ఎన్ని ఒత్తిళ్లున్నా.. మొహం మీద చిరునవ్వు చెదరదు. శరీరానికి అలసట తెలియదు. ఇదంతా గతం. తనిప్పుడు పూర్తిగా మారిపోయాడు. తరచూ డ్యూటీకి డుమ్మా కొడతాడు. అకారణంగా మీటింగ్స్‌ వాయిదా వేస్తాడు. చిన్న విషయాలకే సిబ్బంది మీద విరుచుకు పడతాడు. ఆ ప్రవర్తన మేనేజ్‌మెంట్‌కూ నచ్చడం లేదు. అతణ్ని తప్పించే ఆలోచనలో ఉంది. టెస్టోస్టిరాన్‌ లోపం గోపాల్‌ అసలైన వ్యక్తిత్వాన్ని మబ్బులా కమ్మేసింది. ఈ హార్మోన్‌ లోపం నేరుగా మనసు మీద దాడి చేస్తుంది. మన ప్రవర్తనను శాసిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత లోపిస్తుంది. మతిమరుపు మొదలవుతుంది. ఇట్టే అలసిపోతారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లినా వెళ్తారు. దీంతో ఆఫీసులో మెమోలూ, ఇంట్లో చివాట్లూ తప్పవు. గోపాల్‌ ప్రస్తుతం ఈ దశలోనే ఉన్నాడు. టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితాలు రెండూ సమస్యలపాలైన లక్షలమంది యువకులకు ప్రతినిధి అతను.



మాజీ ‘మన్మథుడు’!

రాజారామ్‌కు ఇంకా నడివయసు  రాలేదు. కానీ, రూపం మారిపోయింది. జుట్టు రాలిపోయింది. పొట్ట పొడుచు కొచ్చింది. ఛాతీ ఎత్తుగా, సున్నితంగా మారింది. అడుగుతీసి అడుగేసినా ఆయాసమే. లైంగిక జీవితమూ ఏమంత సాఫీగా సాగడం లేదు. తరచూ అంగస్తంభన సమస్య వేధిస్తోంది. ఇవన్నీ తాజా పరిణామాలే. అప్పట్లో సన్నగా కరెంటుతీగలా ఉండేవాడు. పడకగదిలో అయితే.. కుర్ర గుర్రమే. ఇంతలోనే ఎంత మార్పు! జీవనశైలిలో చిన్నపాటి తేడా కూడా లేకపోయినా.. బరువు మాత్రం భారీగా పెరిగిపోవడమనేది టెస్టోస్టిరాన్‌ లోపానికి తొలి సంకేతం. లైంగిక జీవితంలోని స్తబ్ధతనూ తేలిగ్గా తీసుకోలేం. చాలామంది ఆఫీసు ఒత్తిడిని సాకుగా చూపించి.. సర్దుకుపోతారే కానీ, దాన్నొక హార్మోన్‌ సమస్యగా గుర్తించరు. చికిత్స అవసరమనీ అంగీకరించరు. టెస్టోస్టిరాన్‌ తగ్గినప్పుడు, శారీరక దృఢత్వమూ దెబ్బతింటుంది. నిస్సత్తువ ఆవరిస్తుంది. చిన్నచిన్న బరువుల్నీ ఎత్తలేరు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ వీర్యం నాణ్యతనూ ప్రభావితం చేస్తుంది. సంతాన లేమికి దారితీయవచ్చు. రాజారామ్‌ ప్రస్తుతం ఓ వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. క్రమంగా మునుపటి ఉత్సాహాన్ని సొంతం చేసుకుంటున్నాడు.



సొంతవైద్యం వద్దు..

హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా టెస్టోస్టిరాన్‌ లోపాన్ని సరిచేస్తారు వైద్యులు. ఇందుకు రెండురకాల వ్యూహాలు అనుసరిస్తారు. మొదటి పద్ధతిలో ఇంజెక్షన్లూ,  పట్టీల ద్వారా టెస్టోస్టిరాన్‌ అందిస్తారు. రెండో మార్గంలో.. తనంతట తాను తయారు చేసుకునేలా శరీర వ్యవస్థకు కొత్తశక్తిని ప్రసాదిస్తారు. కాకపోతే, ఏ ప్రక్రియ అయినా నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. సొంత వైద్యం పనికిరాదు. చాలామంది యువకులు టెస్టోస్టిరాన్‌ మాత్రల్ని లైంగిక ఉద్దీపన ఔషధాలుగా భావిస్తారు. మరింత చురుకైన శృంగార జీవితం కోసం ఆన్‌లైన్‌లో దొరికే క్రీములు, మాత్రలు యథేచ్ఛగా వాడేస్తారు. ఇందులో చాలావాటి తయారీలో ఔషధ నియంత్రణ సంస్థల అనుమతిలేని హానికర రసాయనాల్ని జోడిస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి దీర్ఘకాలంలో హానిచేస్తాయి. ప్రాణాలనూ మింగేస్తాయి. అంగస్తంభన సమస్యో, శీఘ్రస్ఖలన సమస్యో కనిపించగానే.. హార్మోన్‌ లోపం వల్లనే ఇలా జరుగుతోందనే నిర్ణయానికి వచ్చేయకూడదు. కొన్నిసార్లు గుండె జబ్బుల కారణంగానూ అంగస్తంభన ఆగిపోవచ్చు. ఒత్తిడినీ తేలిగ్గా తీసుకోలేం. ఒత్తిడితోపాటు కార్టిసాల్‌ హార్మోన్‌ ఊట కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం వల్ల కూడా టెస్టోస్టిరాన్‌ తయారీ మందగిస్తుంది. పిట్యూటరీ గ్రంథిలో సమస్య ఉన్నప్పుడు సైతం ఆ ఉత్పత్తి పడిపోతుంది. మూల కారణం తెలుసుకోకుండా.. కృత్రిమంగా డోసేజీ పెంచుకుంటూపోతే.. ఓ దశలో వృషణాల్లో టెస్టోస్టిరాన్‌ తయారీ పూర్తిగా ఆగిపోవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కూ దారితీస్తుంది. అకారణ బిడియాలతో, అర్థంలేని భయాలతో అసలు వైద్యమే చేయించుకోనివారు ఎంతోమంది.

ఈ నిర్లిప్తత సొంతవైద్యం కంటే హానికరం. మురగబెట్టేకొద్దీ జటిలం అవుతుంది. కొందరిలో జన్మతః లోపాలు ఉంటాయి. ఏ ప్రమాదంలోనో రెండు వృషణాలూ దెబ్బ తిన్నప్పుడూ, క్యాన్సర్‌ కారణంగా ఏదో ఓ వృషణాన్ని తీసేసినప్పుడూ, వృషణాల పరిమాణం మరీ చిన్నగా ఉన్నప్పుడూ.. ఇలా అనేక సందర్భాల్లో  టెస్టోస్టిరాన్‌ పనితీరు మందగిస్తుంది. కీమోథెరపీ, రేడియేషన్‌ దుష్ప్రభావాన్నీ విస్మరించలేం. కొన్నిసార్లు సమస్య వారసత్వమైందీ కావచ్చు.



జీవనశైలిని మార్చుకుంటే..

ప్రతి పదిమంది ఊబకాయ పురుషుల్లో ఒకరిలో టెస్టోస్టిరాన్‌ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికో బలమైన కారణం ఉంది. ఊబకాయుల కొవ్వు కణజాలంలోని కొన్ని ఎంజైమ్‌లు టెస్టోస్టిరాన్‌ను క్రమంగా.. స్త్రీ హార్మోన్‌ అయిన ప్రొజెస్టెరాన్‌గా మార్చేయగలవు. కొన్ని అధ్యయనాలు టెస్టోస్టిరాన్‌ సమస్యను అధిక రక్తపోటుతోనూ ముడిపెడుతున్నాయి. పెయిన్‌ కిల్లర్లను యథేచ్చగా వాడటమూ ప్రమాదకర ధోరణే. మద్యపానం, ధూమపానం కూడా పురుషత్వ హార్మోన్‌కు శత్రువులే. ఆహారంలో జింక్‌ లోపం  టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుడ్లు, మాంసం, చిక్కుడు జాతి గింజలు, సిరిధాన్యాలు సమృద్ధిగా తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. అదే సమయంలో విటమిన్‌-డి ప్రాధాన్యాన్నీ విస్మరించకూడదు. కాకపోతే, ఆ విటమిన్‌ను శరీరం శోషించు కోవాలంటే.. తగినంత మెగ్నీషియం కావాలి. మెంతికూర, పాలకూర, గోధుమ గడ్డి.. తదితరాలు ఆ కొరతను తీరుస్తాయి. ఆయుర్వేద ఔషధమైన అశ్వగంధనూ సిఫార్సు చేస్తారు సంప్రదాయ వైద్యులు. కొంతమంది వ్యాపారులు గేదెలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకుంటారు. ఇలాంటి పాలు టెసోస్టిరాన్‌ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. సిక్స్‌ప్యాక్‌ కోసం కొందరు, పతకాల మోజులో కొందరు.. దొడ్డిదారిని ఆశ్రయిస్తున్నారు. టెస్టోస్టిరాన్‌ను వినియోగిస్తున్నారు. మొదట్లో అంతా బావున్నట్టే అనిపించినా.. క్రమంగా శరీర వ్యవస్థ మొరాయిస్తుంది. ఆరోగ్య స్పృహ బాగా పెరిగిపోయాక.. కొలెస్ట్రాల్‌ను మనం పెద్ద విలన్‌లా ఊహించుకోవడం మొదలుపెట్టాం. పన్లోపనిగా మంచి కొలెస్ట్రాల్‌నూ దూరం పెడుతున్నాం. మన శరీరానికి కొద్దిపాటి కొలెస్ట్రాల్‌ కూడా అవసరమే. అందులో కొంత టెస్టోస్టిరాన్‌ తయారీలోనూ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను పూర్తిగా విస్మరిస్తే.. ఆ మేరకు టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు, మనిషి ఆయుర్దాయం నూట ఇరవై ఏళ్లని చెబుతారు. ఆ తర్వాత వందేళ్లకు స్థిరపడింది. ఇప్పుడు.. డెబ్భై, ఎనభై. గత యాభై ఏళ్లలో ఆయుర్దాయమే కాదు, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. అప్పట్లో అరవై ఏళ్ల వ్యక్తి టెస్టోస్టిరాన్‌ స్థాయి ఎంతో.. ప్రస్తుతం పాతికేళ్ల యువత స్థాయి కూడా దాదాపుగా అంతే!  

                       *

కేవలం టెస్టోస్టిరాన్‌ కోసమే ప్రయత్నిస్తే.. టెస్టోస్టిరాన్‌ మాత్రమే దక్కుతుంది. అవసరమైన కీలక హార్మోన్లను కోల్పోతాం. అదే పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తే..అన్నీ దక్కుతాయి. టెస్టోస్టిరాన్‌ సహా! ఇంత చిన్న కోడింగ్‌ చిట్కాను ఎందుకు మిస్‌ అవుతోందో నవతరం!



నాగరికతకు మూలం

అరవై అయిదువేల సంవత్సరాల క్రితం.. అనేకానేక కారణాల వల్ల ఆదిమ పురుషుడిలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కొంతమేర తగ్గిందట. ఫలితంగా అతని పశుప్రవృత్తికి పగ్గాలు పడ్డాయి. అప్పటివరకూ ఓ వ్యసనంగా ఉన్న లైంగిక వాంఛ కాస్తా ఓ అవసరం స్థాయికి చేరింది. ప్రేమ, అనుబంధం.. ఉద్వేగాల జాబితాలో చోటు సంపాదించాయి. దీంతో మహిళతో బంధాన్నీ, సహజీవనాన్నీ కోరుకున్నాడు. క్రమంగా ఇల్లు కట్టుకున్నాడు. సేద్యం మొదలుపెట్టాడు. జీవితం సాఫీగా సాగేందుకు అవసరమైన ఆవిష్కరణలు ఆరంభించాడు. పురావస్తు నిపుణుల తవ్వకాల్లో దొరికిన పురుషుల పుర్రెలలో తేడాలను విశ్లేషించడం ద్వారా డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు. అతిప్రాచీనమైన పుర్రెలతో పోలిస్తే.. ఆ తర్వాతి పుర్రెలలో పురుషత్వ లక్షణాలు కొంతమేర తగ్గినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు. టెస్టోస్టిరాన్‌ మోతాదుకూ, మనిషి ప్రవర్తనకూ మధ్య ప్రత్యక్ష సంబంధాన్నీ గుర్తించాయి అంతర్జాతీయ అధ్యయనాలు. దాదాపు వందమంది కరడుగట్టిన నేరస్థులకు రక్త పరీక్ష చేసినప్పుడు.. అందులో తొంభైమందిలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అసాధారణ స్థాయిలో ఉన్నట్టు తేలింది.

క్షణక్షణముల్‌..

మహిళల్లో హార్మోన్లు నెలవారీగా మారిపోతుంటాయనీ, అదే పురుషుడిలో రోజువారీగా మార్పుకు గురవుతుంటాయని చెబుతారు నిపుణులు. టెస్టోస్టిరాన్‌ స్థాయి పూటపూటకూ మారుతుంది. పొద్దున్నే గరిష్ఠంగా ఉంటుంది. మధ్యాహ్నానికి నలభైశాతం పడిపోతుంది. భోజనం తర్వాత అయితే.. ఆ అంకెలు స్టాక్‌ మార్కెట్‌ పతనాన్ని తలపిస్తాయి. కారణం, ఆ సమయంలో మనలోని శక్తి  మొత్తం జీర్ణ ప్రక్రియలో తలమునకలై ఉంటుంది. దీంతో టెెస్టోస్టిరాన్‌ తయారీ ఏమంత వేగంగా జరగదు. గుండెకు మంచి చేసేవన్నీ, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ పెంచుతాయి. కాబట్టి, టెస్టోస్టిరాన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, గుండెనూ కాపాడుకున్నట్టే.

కొన్ని మార్పులు..



‘కంప్లీట్‌ గైడ్‌ టు టెస్టోస్టిరాన్‌’ రచయిత ఫ్రాన్సిస్‌ తన జీవితానుభవాన్ని జోడించి మరీ, జీవనశైలిలో కొన్ని మార్పులను సూచిస్తున్నారు. అందులో కొన్ని..1. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన పాక్షిక ఉపవాస విధానం టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తికి ఎంతోకొంత సహకరిస్తుంది. ఈ పద్ధతిలో రోజులోని ఇరవైనాలుగు గంటల్లో పదహారు గంటలు ఉపవాసం పాటిస్తారు. మిగతా ఎనిమిది గంటల సమయంలోనే భోజనం.  

2. ఆధునిక జీవితాల్లో నిద్రలేమి అతిపెద్ద సమస్యగా మారుతోంది. మనం నిద్రలో ఉన్నప్పుడే టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. కలత నిద్రతో సర్దుకుపోకుండా.. ఎనిమిది గంటలు ఆదమరిచి పడుకోవాల్సిందే.

3. పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడే రసాయనాలు.. హార్మోన్‌ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి, వాటి ఎంపికలో జాగ్రత్తలు అవసరం.

4. మిగతా శరీరంతో పోలిస్తే.. వృషణాలకు కొంత చల్లని వాతావరణం అవసరం. కానీ,బిగుతైన డెనిమ్స్‌ ఆ భాగంలో గాలి చొరబడకుండా చేస్తాయి. దీనివల్ల కూడా టెస్టోస్టిరాన్‌ తయారీకి విఘాతం కలుగుతుంది.

5. ఒత్తిడి ప్రాథమికంగా మానసికమైంది. నెగెటివ్‌ ఆలోచనల సమాహారం. మనం ఏం ఆలోచించాలన్నది మనమే నిర్ణయించుకోగలిగితే.. చెత్తను వదిలించుకోవచ్చు. ఆలోచనల మీద నియంత్రణ సాధించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది.

6. భోజన విధానంలోనూ కొన్ని మార్పులు అవసరమే. అల్లం, ఉల్లి, వెల్లుల్లి,  ఆలివ్‌ ఆయిల్‌ మొదలైన టెస్టోస్టిరాన్‌ పదార్థాలను వంటల్లో విరివిగా వాడాలి.



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Commentaires


bottom of page