ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిపుణుల సహకారంతో ప్రత్యేక వీడియోల రూపకల్పన
తేది: 23.05.2024
విజయవాడ
ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి
• తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిపుణుల సహకారంతో ప్రత్యేక వీడియోల రూపకల్పన
• మధ్యాహ్న భోజన పథకం మెనూలోని వివిధ వంటకాల తయారీపై శిక్షణా వీడియోలు
• వీడియోలో రుచికర, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల వివరణ
• రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో అందించే ఆహారం నాణ్యత, రుచిని నిర్ధారించడమే లక్ష్యం
• 100 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేటట్లు ప్రోత్సహించాల్సిందిగా డీఈవోలకు ఆదేశం
• కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ద్వారా విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్, సహచర్యం పెరుగుతాయన్న నమ్మకం
• “తల్లిదండ్రుల- ఉపాధ్యాయుల గృహసందర్శన”లో ఈ అంశం చర్చించేలా సంబంధిత తరగతి ఉపాధ్యాయులదే బాధ్యత
:- పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనం తినేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ డీఈవోలను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలోని వివిధ వంటకాల తయారీపై గురువారం తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిఫుణుల సహకారంతో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శిక్షణా వీడియోలను రూపొందించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న పథకంలో భాగంగా ప్రతి రోజు మెనూ భిన్నంగా ఉండటంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఎలా తయారు చేయాలో, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక వీడియోలను రూపొందించామన్నారు. రోజుకొక వీడియో ఉండేలా 6 వీడియోలను రూపొందించి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశామన్నారు. వీడియోలను ఈ న్యూస్ కింద చూడవచ్చు.
రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలు అందించే 85,000 మంది వంట వాళ్లతో ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రధానోపాధ్యాయులకు సూచించాలని డీఈవోలకు ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. స్మార్ట్ ఫోన్లు లేని వంట వారికి ప్రతి ఉన్నత పాఠశాల తరగతి గదిలో ఇన్‌స్టాల్ చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లోని స్మార్ట్ టీవీల ద్వారా పాఠశాల సమయం తర్వాత వీడియోలను ప్రదర్శించి చూపించాలని తెలిపారు.
రాష్ట్రంలోని 44,190 పాఠశాలలన్నింటిలోనూ అందించే ఆహారం యొక్క నాణ్యత, రుచిని నిర్ధారించడమే తమ లక్ష్యమన్నారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 90% మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేస్తుండగా, 10% మంది విద్యార్థులు ఇంటి నుండి టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకుంటున్నారని, అది పాఠశాల వాతావరణానికి హానికరమన్నారు. పాఠశాలలో విద్యార్థులంతా కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ద్వారా వారిలో టీమ్ స్పిరిట్, సహచర్యం పెరుగుతాయని తెలిపారు. ఇవి విద్యార్థి భావోద్వేగ మేధస్సు (EQ) యొక్క నాలుగు స్తంభాలలో రెండింటికి (సామాజిక అవగాహన మరియు సామాజిక నిర్వహణ) చాలా కీలకమన్నారు. AI మరియు చాట్‌జిపిటి (ChatGPT) యుగంలో భావోద్వేగ మేధస్సు (EQ) విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆయా లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించడం తమ బాధ్యతగా భావించాలన్నారు. టిఫిన్ బాక్స్‌లు తీసుకురావడం వల్ల వారి తోటి విద్యార్థులతో దూరం పెరగడమే గాక వారి భావోద్వేగ మేధస్సు (EQ) పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 44,190 పాఠశాలలకు గానూ 36,612 పాఠశాలలు 100% మధ్యాహ్న భోజనం వినియోగిస్తుండగా, 5,012 పాఠశాలల్లో 95-99 శాతం, 885 పాఠశాలలు 90-95 శాతం, 439 పాఠశాలలు 85-90 శాతం, 353 పాఠశాలలు 80-85 శాతం, 522 పాఠశాలలు 50-80 శాతం, 60 పాఠశాలలు 30-50, 236 పాఠశాలలు 30% కంటే తక్కువగా ఉన్నాయి. ప్రతి డీఈవో ఈ విద్యా సంవత్సరంలో తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లోని 100% విద్యార్థులు 100% మధ్యాహ్న భోజనం తినేలా చూడటమే లక్ష్యంగా పనియాలని ఆదేశించారు. జూన్ నెలలో జరిగే తల్లిదండ్రుల- ఉపాధ్యాయుల గృహసందర్శన కార్యక్రమంలో ఈ విషయాన్ని చర్చించేలా సంబంధిత తరగతి ఉపాధ్యాయులు చూడాలని తెలిపారు.
............................................................................................................
జారీ చేసిన వారు: సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సోమవారం మెనూ హాట్ పొంగల్ , వెజ్ పులావ్ తయారీ వీడియో :
మంగళ వారం మెనూ పులిహోర, దొండకాయ పచ్చడి, రాగి జావ తయారీ:
బుధవారం మెనూ వెజ్ కర్రీ తయారీ విధానం :
గురువారం మెనూ పులిహోర, సాంబార్ రైస్ , టొమాటో పచ్చడి తయారీ విధానం:
శుక్రవారం మెనూ పప్పు ఆకుకూర తయారీ విధానం :
శనివారం మెనూ పప్పు చారు, స్వీట్ పొంగల్ తయారీ విధానం :
ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హార్ట్ సింబల్ నొక్కండి. 100 లైకుల టార్గెట్ చేరడానికి సహకరించండి. ధన్యవాదాలు 🙏
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments