పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్
ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిలు దాదాపు 26 వేల కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు శ్రీకాకుళం క్రాంతి భవన్ నందు ఎస్టీయు శ్రీకాకుళం జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద తనదైన శైలిలో ప్రసంగించారు.గత ప్రభుత్వమే 21,980 కోట్లు రూపాయలు బకాయిలు పడినట్టు ఆర్థిక శ్వేత పత్రంలో శాసనసభ సాక్షిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వెల్లడించారు. అయితే వాటి విడుదలకై ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని 2023 జూలై నాటికి 11వ వేతన సవరణ గడువు ముగిసి17నెలలు గడుస్తున్నా వేతన సవరణ చైర్మన్ రాజీనామా చేసిన పిదప నూతన చైర్మన్ను నియమించలేదని, మధ్యంతర భృతి ఊసే లేదని సరెండర్ లీవ్ చెల్లింపులు,పిఎఫ్ లోన్లు, ఏపీజిఎల్ఐ లోన్లు పెండింగ్ బకాయిలపై నిమ్మకి నీరు ఎత్తినట్లు ఈ ప్రభుత్వ విధానం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ పదోతరగతి యాక్షన్ ప్లాన్ పై సెలవు రోజుల్లో పనిచేసేలా ఉపాధ్యాయలపై అనవసర ఒత్తిడి తగదని వివిధ రకాల ఆన్లైన్ యాప్ల డాటా నమోదును పూర్తిగా తగ్గించాలని ఉపాధ్యాయుని తరగతి గదికి దూరం చేసే బోధనేతర పనులను పూర్తిగా తొలగించాలని, ప్రాధమికోన్నత పాఠశాలలను కొనసాగించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ మంజూరు చేయాలని, MTS ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల ఆగ్రహం తప్పదని ఎస్టీయూ దశలివారీ ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి డి. శ్యామ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి జి.రమణ, ఆర్ధిక కార్యదర్శి పి.రామకృష్ణ, వివద మండలాల నాయుకులు,పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ความคิดเห็น