top of page

పెండింగ్ బకాయిలు, పిఆర్సి సాధన కోసం 2న కలెక్టరేట్ల ఎదుట ధర్నా

• సిఎస్ కి ఫ్యాప్టో ధర్నా నోటీస్


FAFTO Dharna Notice To CS AP
FAFTO Dharna Notice To CS AP

పెండింగ్ బకాయిలు, నూతన వేతన సవరణ సంఘం, మధ్యంతర భృతి (ఐఆర్) సాధన కోసం ఏప్రిల్ 2న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఫ్యాప్టో వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కి శుక్రవారం నోటీస్ అందించామని ఫ్యాప్టో ఛైర్మన్ ఎల్ సాయిశ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.

నాలుగేళ్ల నుంచి పిఎఫ్, ఎపిజిఎస్ఐ లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు, పిల్లల చదువుల ఫీజులు చెల్లింపు, వివాహ ఖర్చులు మరమ్మతు వంటి వాటి కోసం పాక్షిక విత్ డ్రా కోసం దరఖాస్తులు చేసుకుని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. అవసరాల కోసం అధిక వడ్డీలకు ఉద్యోగులు అప్పులు చేసిన పరిస్థితులు రాష్ట్రమంతటా ఉన్నాయని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఈ చెల్లింపులు జరగడం లేదని పేర్కొన్నారు.


మరణించిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టలేదని, లోకల్ బాడీస్లో ఖాళీలు

లేవనే అసంబద్ధమైన కారణం చూపి నిలుపుదల చేశారని వివరించారు. సరెండర్ లీవు బకాయిల కోసం 2022 జనవరి నుంచి ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎకు అనుసంధానంగా ఇవ్వాల్సిన 5 డిఎలకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇవ్వాల్సిన రెండు డిఎలను ఇప్పటికీ ప్రకటించలేదని వివరించారు.


సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన 90 శాతం డిఎ బకాయిలు, సిపిఎస్ మినహాయింపులు వారి ఖాతాల్లో జమకావడం లేదని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 12వ పిఆర్సి కమిషన్ నియమించాలని, ఆలోపు 30 శాతం ఐఆర్, కొత్త డిఎలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.


ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 2న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి పోరాటం చేస్తామని హెచ్చరించారు.


 
 
 

Comments


bottom of page