top of page

పాఠశాల విద్యలో 4 రకాల బడులు

Writer's picture: AP Teachers TVAP Teachers TV

గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు-117ను రద్దు చేసి, కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసింది.


AP Government Schools
AP Government Schools

ప్రాథమికోన్నత, హైస్కూల్‌ ప్లస్‌లు రద్దు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు

ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేశ్‌ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు


త ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు-117ను రద్దు చేసి, కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌ నిర్వహించిన సమావేశంలో ముసాయిదాలోని అంశాలను అధికారులు వెల్లడించారు. వాటిపై ఆయా నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు రకాల పాఠశాలల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రాథమిక పాఠశాలలే మూడు రకాలుగా ఉండనున్నాయి. ప్రాథమికోన్నత, హైస్కూల్‌ ప్లస్‌ విధానాలను రద్దుచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో 3-12 తరగతులు నిర్వహిస్తున్నారు. మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. వీటిల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండగా.. ప్రయోగశాలలు లేవు. రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు-117 కారణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మార్చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3,448 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులకు చెందిన 2,43,540 మంది విద్యార్థులను తరలించారు. దీంతో 12,247 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి. దీంతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు వెళ్లిపోయిన 3, 4, 5 తరగతులను తిరిగి వెనక్కి తీసుకురానున్నారు.



ఆరు నుంచి నాలుగుకు తగ్గింపు

  • పూర్వ ప్రాథమిక విద్య-1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ), ఒకటి, రెండు తరగతులను కలిపి ఫౌండేషన్‌ స్కూల్‌గా పిలుస్తారు. వీటిలో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ చొప్పున కేటాయిస్తామని అధికారులు ప్రతిపాదించారు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న 20మందికి ఒక టీచర్‌ విధానాన్ని కొనసాగించాలని కోరాయి.

  • పూర్వ ప్రాథమిక విద్య-1, 2.. ఒకటి నుంచి ఐదు తరగతులున్నవి బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలు. విద్యార్థులు బడికి వెళ్లే మార్గంలో నదులు, వాగులు, వంకలు, జాతీయ రహదారులను దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. సామాజిక కేటగిరి కాలనీల్లో వీటిని నిర్వహిస్తారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామస్థుల అనుమతి మేరకు నిర్ణయం తీసుకుంటారు.

  • విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే పూర్వ ప్రాథమిక విద్య-1, 2, ఒకటి నుంచి ఐదు తరగతులను కలిపి మోడల్‌ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రతి తరగతికీ ఒక్కో టీచర్‌ చొప్పున గరిష్ఠంగా ఐదుగురిని ఇస్తారు. పిల్లల సంఖ్య 120 మించితే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు. 

  • 6-10 తరగతులతో ఉన్నత పాఠశాలలు ఉంటాయి. అంగన్‌వాడీలు పూర్వ ప్రాథమిక విద్య-1, 2తో శాటిలైట్‌ ఫౌండేషన్‌ బడులుగా కొనసాగుతాయి. 

ఆ రెండు విధానాలు రద్దు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత బడుల విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే దాని గ్రేడ్‌ తగ్గిస్తారు.. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఉన్నతీకరిస్తారు. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. ఒకవేళ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోయినా, విద్యార్థులు వెళ్లేందుకు సహజ, కృత్రిమ అవరోధాలు ఏమైనా ఉంటే స్థానికంగానే ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తారు. 

  • 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మారుస్తారు. ఇక్కడ ఉండే 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. ఒకవేళ 31 నుంచి 59 మంది విద్యార్థులు ఉన్నప్పుడు దాని గ్రేడ్‌ తగ్గించడమా? పెంచడమా? అనే దాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. 

  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 60 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే దాన్ని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు. 

  • హైస్కూల్‌ ప్లస్‌లోని ఇంటర్మీడియట్‌ను ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ విద్యా శాఖకు అప్పగిస్తారు. దీంతో హైస్కూల్‌ ప్లస్‌ విధానం ఉండదు.



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page