top of page

ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు #naralokesh #apteacherstransfers

Writer's picture: AP Teachers TVAP Teachers TV


  • ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు!

  • టీచర్లపై అనవసర యాప్ ల భారాన్ని తగ్గించండి

  • స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి #naralokesh

పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష

అమరావతిః ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో బుధవారం సాయంత్రం దాదాపు 3గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.



ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ వత్తిళ్లకు తావులేకుండా విధివిధానాలని రూపొందించాలని కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలన్నారు.



మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను వాకబుచేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్తుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు.



ఈ సందర్భంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కన నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపైనా ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్,

స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.





 
 

Comments


bottom of page