top of page
Writer's pictureAP Teachers TV

నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం..రతన్‌ టాటా కన్నుమూత! RATAN TATA PASSED AWAY

నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం..రతన్‌ టాటా కన్నుమూత! RATAN TATA PASSED AWAY


వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్‌...

వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్‌ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు.


వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రతన్‌ టాటా. కేవలం వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంలో కూడా తనకు ఎవరు సాటిలేరని నిరూపించుకున్నారు రతన్‌ టాటా. రతన్ టాటా ఎంతో ఉదారమైన వ్యక్తి. 86ఏళ్ల రతన్ టాటా 28 డిసెంబర్ 1937న జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు.



ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు.. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించాడు. మొదట టాటా గ్రూప్‌లో అసిస్టెంట్‌గా చేరారు. రతన్‌ టాటా..1991 మార్చి నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను నడిపించారు. 2008లో, రతన్ టాటాను భారత ప్రభుత్వం దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్‌ టాటా.. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్‌ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.   

రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు..

తొలుత టాటా స్టీల్‌లో చేరిన రతన్‌ టాటా.. అనంతరం గ్రూప్‌ను అంచెలంచెలుగా ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ, దిశ చూపించారు. దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన ఆయన.. టాటా గ్రూప్‌ నుంచి రిటైర్మెంట్‌ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. తన సంపదలో 60-65 శాతం దాతృత్వానికే కేటాయించారు.  



బిజినెస్‌ టైకూన్‌గా పేరున్న రతన్‌ టాటా.. టాటా గ్రూప్‌ను రెండు దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. జేఆర్‌డీ టాటా నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్‌ టాటా.. గ్రూప్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. ఇక వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసమాన్యమైనది. 2000లో బ్రిటిష్‌ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన.. ప్రపంచంలోనే ‘టీ’ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో కోరస్‌ స్టీల్‌, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్‌ కంపెనీగా మార్చారు. ఇక టాటా మోటార్స్‌ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఇండికా కారును 1998లో రతన్‌ టాటా మార్కెట్‌కు పరిచయం చేశారు. దీంతో భారత వాహన రంగంలో సెన్సేషనల్‌గా మారింది. 

దాతృత్వంలో రతన్‌ టాటాకు సాటిరారు.. 

కొవిడ్‌ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం రూ. 1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్‌ టాటా ప్రకటించారు. ‘‘అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో కొవిడ్-19పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్టు కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికీ పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం" అని రతన్ టాటా తన ప్రకటనలో స్పష్టంచేశారు.






0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page