top of page
Writer's pictureAP Teachers TV

నేటి ఉపాధ్యాయ వార్తలు 8.7.2023 ap teachers news

నేటి వార్తావిశేషాలు(8.7.2023)



ap teachers news today విజయవాడలో ఏపీసీపీఎస్ ఉద్యోగుల ఆందోళన విజయవాడ: సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఏపీసీపీఎస్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు... జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు.. అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ... మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి మాట మార్చారన్నారు. సీపీఎస్ రద్దు నాకొదిలేయండి అన్న వ్యక్తి.. మమ్మలనే వదిలేయమంటున్నారని మండిపడ్డారు. తన మ్యానిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పిన జగన్ ఇప్పుడు వాటినీ అవమానించేలా వ్యవహరించారన్నారు. సీపీయస్ నే చిన్న మార్పు చేసి జీపీఎస్ అన్నారని.. జీపీఎస్ వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. జేఏసీ నాయకులు ఏ‌విధంగా అంగీకరించారో అర్ధం కావడం లేదని తెలిపారు.ర విధివిధానాలు రాకుండా బాగుందనే సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీపీఎస్ వల్ల నష్టపోయే తమతో ప్రభుత్వం ఎందుకు చర్చలు చేయడం లేదని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని అడిగారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలు‌ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసు చేసి చివరిలో గంజినీళ్లు తాగమని తమకు చెబుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాట నిల బెట్టుకోకుంటే వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఓడిస్తామని ఏపీసీపీఎస్ ఉద్యోగులు హెచ్చరించారు

16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్కూల్స్‌ అంతంతే! పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్‌లో వెనుకంజ! న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విద్యా యజ్ఞం, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మన నేతలు చెప్పే మాటలు నీటిమూటలేనని తేలింది. దేశంలోని చాలా ప్రాంతాలతో పోలిస్తే పాఠశాలల పనితీరులో తెలంగాణ చాలా వెనుకంజలో ఉంది. పాఠశాలల పని తీరు అంశంలో దేశంలోనే 31వ స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే గ్రేడ్‌లలో కింది నుంచి రెండోదైన ‘ఆకాంక్షి2’కి పరిమితమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా రూపొందించిన ‘పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ సూచీ 202122’ నివేదికను కేంద్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 31వ స్థానంలో నిలిచింది. 1,000 స్కోరుకుగానూ తెలంగాణ 479.9 స్కోరు మాత్రమే సాధించింది. ప్రామాణికాల వారీగా చూస్తే లెర్నింగ్‌ ఔట్‌కమ్‌ నాణ్యతలో 240కి గాను 36.6 స్కోరు, యాక్సెస్‌(పాఠశాలల అందుబాటు)లో 80కి 53.7, మౌలిక సదుపాయాలుసౌకర్యాల్లో 190కి 56.2, సమానత్వంలో 260కి 219.5, పరిపాలనలో 130కి 53.3, ఉపాధ్యాయుల విద్య శిక్షణలో100కి 60.6 స్కోరు మాత్రమే రాష్ట్రానికి లభించింది. మరోపక్క, ఈ ర్యాంకింగ్స్‌లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన స్థానంలో నిలిచింది. మొత్తం 1000కిగాను 543.8 స్కోరు సాధించిన ఏపీ పీజీఐ సూచీలో దేశంలోనే 16వ స్థానంలో నిలిచింది. గ్రేడింగ్‌లోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ‘ఆకాంక్షి1’ గ్రేడ్‌ సాధించింది. కాగా, ఈ స్కోరింగ్‌లో వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన చండీగఢ్‌(659.0), పంజాబ్‌(647.4)లు ప్రచేష్ఠ2 గ్రేడ్‌ దక్కించుకున్నాయి.

సచివాలయాల ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసిందా?వివరాలు సమర్పించండి.. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం గ్రామ/వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు, కొందరు మహిళా కార్యదర్శులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఎంఎస్‌కేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు పిటిషనర్లను రిక్రూట్‌చేశారని.. మహిళా శిశు సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న వీరిని పోలీసు శాఖకు జత చేస్తూ మహిళా పోలీసుగా పేరుమార్చారని తెలిపారు. ఖాకీ డ్రెస్‌ వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. సాధారణ పోలీసుల మాదిరిగా బందోబస్తు, నైట్‌ డ్యూటీలు వేస్తున్నారని వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి జూన్‌ 7 తోనే ముగిసిందన్నారు. అది చట్టంగా రూపుదాల్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తమను మహిళా పోలీసులుగా కొనసాగించాలని, వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కొందరు మహిళా కార్యదర్శులు వేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించింది. విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఇద్దరు కీచక టీచర్ల సస్పెన్షన్‌: వెంకటగిరి, జూలై 7: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బాలికల పట్ల వికృతచేష్టలకు పాల్పడుతున్న దారుణ సంఘటన మరొకటి వెంకటగిరి పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది.బంగారుపేట ఎంపీపీ పాఠశాలలో లక్ష్మీనారాయణ అనే ఉపాధ్యాయుడు ఇటీవల పలువురు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లక్ష్మీనారాయణను చితకబాది అతడి మోటర్‌బైక్‌ను ధ్వంసం చేశారు.ఈ సమాచారం తెలిసి పోలీసులు పాఠశాల వద్దకు చేరుకొని లక్ష్మీనారాయణను స్టేషన్‌కు తరలించారు.గురువారం ఇదే పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు ఓ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఇద్దరు టీచర్లనూ శుక్రవారం సస్పెండు చేశారు. ఈనెల 22న రెండో సెమిస్టర్ పుస్తకాలు అందజేత


ఈనాడు, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లోని 36 లక్షల విద్యార్థులకు ఈనెల 22న రెండో సెమి స్టర్ పుస్తకాలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్ర వారం వెల్లడించింది. నవంబరు నుంచి విద్యార్థులకు పుస్తకాలు అవసరమైనప్పటికీ ముందుగానే అందించేం దుకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. 1-9 తరగతి వరకు 36లక్షల మంది విద్యార్థులకు కోటి పుస్తకాలు అందచేయనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాల లలకు అమెజాన్ ద్వారా పుస్తకాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.

విద్యాశాఖాధికారిపై వేటు!

బదిలీల నుంచి ఉద్యోగోన్నతుల వరకు అంత గందరగోళమే

అనుసరిస్తున్న విధానాలపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదులు

డీఈఓ రమేష్‌ను సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ

ఈ నాలుగు నెలల్లోనే దిగజారిన శాఖ ప్రతిష్ట

ఇన్‌చార్జీ డీఈవోగా ఆర్జేడీ వీఎస్‌.సుబ్బారావుకు బాధ్యతలు

జిల్లా విద్యాశాఖాధికారిపై వేటుపడింది. ఉపాధ్యాయ ఉద్యోగోన్నతుల్లో చోటుచేసుకున్న అవకతకవలే ఇందుకు కారణమైంది. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కీలకమైన స్థానాలను బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలకు ఇటీవల ఎంఈఓ-2 పోస్టులకు పదోన్నతి పొందారు. ఆ ఖాళీలను భర్తీచేసేందుకు స్కూలు అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ప్రమోషన్‌ కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాపైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ కౌన్సెలింగ్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకోవడంతో వాటిని సరిచేయాలని కోరినా పట్టించుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ పట్టించుకున్న పరిస్థితి లేకుండాపోయింది.



ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 7 : సమాజంలో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన జిల్లా విద్యా శాఖ గాడితప్పింది. విద్యాశాఖాధికారే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుసరించిన విధానాలతో శాఖ ప్రతిష్ట దిగజారిపోయింది. నాలుగు నెలల్లోనే ఆయన ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. బదిలీల నుంచి ఉద్యోగోన్నతుల వరకు అంతా గందరగోళం సృష్టించారు. పలు సందర్భాలలో ఉపాధ్యాయ లోకం అనేకసార్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారంటే ఆయన తీరు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పించే విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ వింత పోకడ పోయారు. ప్రభుత్వం చెప్పిందనే కారణంతో భారీగా పోస్టులను బ్లాక్‌ చేశారు. ఆయా పోస్టులకు పైనుంచి ఆర్డర్లు రావడం, వారికి ఆగమేఘాలపై బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే బదిలీల సమయంలో జాబితాల రూపకల్పన సమయంలోనూ అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి.

అన్నింటిలోనూ ఆరోపణలు

ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌లోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. బదిలీల దరఖాస్తుల్లో ఉద్యోగోన్నతులకు అన్‌విల్లింగ్‌ చెప్పినా జాబితాల్లో చూపడం, పోస్టులు లేని చోట నియామకాలతో దాదాపు 40మంది టీచర్లను గాల్లో ఉండడం, తర్వాత వారికి ఎక్కడో ఒకచోట పోస్టుల చూపడం తదితర తప్పులతో విద్యాశాఖ అప్రతిష్ట మూటగట్టుకుంది. తాజాగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సీనియార్టీ జాబితాను ప్రకటించి ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే సీనియార్టీ జాబితాలోనే అనేక అవకతవకలు జరిగాయని వాటిని సరిచేయాలని ఏపీటీఎఫ్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరినా పట్టించుకున్న పరిస్థితి లేదు. సీనియార్టీ జాబితాలోని అవకతవకలను సరిచేయకుండానే ప్రమోషన్ల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయడంతో పెద్ద రగడే జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగునాడు ఉపాఽధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

విచారణకు ఆదేశించిన కమిషనర్‌

ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదులపై స్పందించిన విద్యా కమిషనర్‌ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పదోన్నతుల అవకతవకలపై పరిశీలన చేయాలని ఆర్జేడీ సుబ్బారావును ఆదేశించారు. ఆ మేరకు సుబ్బారావు గురువారం ఒంగోలు చేరుకున్నారు. అదే సమయంలో డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ప్రమోషన్ల సీనియార్టీ జాబితాలో అవకతవకలపై ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ జరుగుతున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. గణితం సీనియార్టీ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఆవుల ఆనంతవిజయలక్ష్మీ, కే.పద్మ, లంకా జనార్దన్‌, బి.వెంకటశివశాస్త్రిలను ముందు వరుసలో ఉంచారు. ఈ ఉపాధ్యాయులు అర్హులైతే గత ఉద్యోగోన్నతుల జాబితాలోనే నమోదు చేసుకుని పదోన్నతులు పొందాల్సి ఉంది. కానీ అందుకుభిన్నంగా జాబితాలో చేర్చడంతో ఆయా ఉపాధ్యాయ సంఘాలు ఆర్జేడీ సుబ్బారావుకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా అంశాలన్నింటిని పరిశీలించిన ఆయన ఆ ఫిర్యాదులను కమిషనర్‌ సురేష్‌కుమార్‌కు పంపడంతో డీఈఓ పి.రమేష్‌ను కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాస్పదమే

డీఈవోగా పి.రమేష్‌ గత ఫిబ్రవరి నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఆ నాటి నుంచి సరెండర్‌ అయ్యే వరకు కూడా అనేక అంశాలు వివాదాస్పదంగానే కొనసాగాయి. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే జిల్లా ఉన్నతాధికారిగా సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనదే. కానీ డీఈఓ తీసుకునే ప్రతి నిర్ణయం లోపభూయిష్టంగా మారింది. ప్రతి విషయంలో గందరగోళం నెలకొంది. దీంతో ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టడం సర్వసాధారణంగా మారింది. గతంలో పనిచేసిన జిల్లాల్లో కూడా ఇదేవిధంగా వివాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. అయినా ఆయన తీరు మార్చుకోకపోవడంతో వివాదాలకు కేరాఫ్‌గా విద్యాశాఖ నిలిచింది.

ఇన్‌చార్జీ డీఈవోగా సుబ్బారావు.. వెంటనే బాధ్యతలు

కాగా డీఈవో పి.రమేషన్‌ను సరెండర్‌ చేయడంతోపాటు ఇన్‌చార్జీ డీఈవోగా ఆర్జేడీ వీఎస్‌.సుబ్బారావుకు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల ఉద్యోగోన్నతుల ప్రక్రియ సోమవారం నుంచి సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికే రూపొందించిన సీనియార్టీ జాబితాలను సుబ్బారావు పరిశీలించి తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా వీఎస్‌ సుబ్బారావు శుక్రవారం సాయంత్రం ఇన్‌చార్జీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను అభినందించారు.



ఏపీఈ సెట్ కౌన్సెలింగ్షెడ్యూల్ ఇదీ!

14 నుండి 17 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు

25న సీట్ల కేటాయింపు

  ఆగస్టు 1న తరగతులు ప్రారంభం

 అమరావతి,ఆంధ్రప్రభ: రెండో సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశిం చిన ఎపిఈసెట్ 2023 కౌన్సిలింగ్ షేడ్యూలును ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం విడుదల చేసారు. జులై పదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ప్రధాన దిన పత్రికలలో పదకొండవ తేదీన ప్రకటన ప్రచురితం అవుతుంది. ఈసెట్ 2023లో అర్హత సాధించిన విద్యార్ధులకు ఎపి ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు కోసం జులై 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దృవీ కరణ పత్రాల వెరిఫికేషన్ కోసం జులై 17 నుండి 20వ తేదీ వరకు నిర్దేశించారు. విద్యార్ధులు ఆప్షన్ల ఎంపిక కోసం 19 నుండి 21 వరకు మూడు రోజులు కేటాయిం చారు. ఆప్షన్ల మార్పు కోసం 22వ తేదీని సూచించగా, జులై 25వ తేదీన సీట్ల కేటా యింపు చేస్తామని నాగరాణి వివరించారు. ధృవీకరణ పత్రాల నిర్ధారణ, < కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 14 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసామని కన్వీనర్ తెలిపారు. ఆన్ లైన్ లో ఏపి ఈసెట్ కౌన్సిలింగ్ కు నమౌదైన విద్యార్ధులకు సహాయ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ధృవీకరణ పత్రాల నిర్ధారణ కోసం విద్యార్ధులు ఎపి ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్ట్, పదవతరగతి ఉత్తీర్ణత పత్రం, డిప్లమో మార్కుల జాబితా, ప్రోవిజినల్ సర్టిఫికెట్, ఏడవ తరగతి నుండి డిప్లమో వరకు స్టడీ సర్టిఫికేట్, టిసి, ట్యూషన్ ఫీజు రిఎంబర్స్ మెంట్ కోరుకునే అభ్యర్ధులు 2020 జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన అదాయ దృవీకరణ పత్రం, వివిధ రిజర్వేషన్లకు అవసరమైన ధృవీకరణ పత్రాలు, లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యుఎస్ దృవీకరణ తదితర పత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం ఈసెట్ కోసం 38,181 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 34,503 మంది విద్యార్ధులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం క్రీడలు, వికలాంగులు, సాయిధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్ సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఈసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు. సీట్లు పొందిన విద్యార్ధులు జులై 25 నుండి 30వ తేదీ వరకు ఐదు రోజుల లోపు అయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని తరగతులు ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం అవుతాయన్నారు.


ఆగస్టు 2 నుంచి శాఖాపరమైనపరీక్షలు

ఈనాడు-అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను ఆగస్టు 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడిం చింది. తేదీల వారీగా పరీక్షల నిర్వహణ వివరాలను వెబ్సైట్లో పెట్టినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

14న ధ్రువపత్రాల పరిశీలన

ఆయుష్ శాఖలోని ఆయుర్వేద, హోమియో విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికచేసిన అభ్యర్థులకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ నెల 14న ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. అదే రోజు యూనాని విభాగంలో మెడికల్ ఆఫీసర్లు, దేవాదాయ శాఖలో అసి స్టెంట్ కమిషనర్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికచేసిన వారికి కూడా ధ్రువప త్రాల పరిశీలన ఉంటుందని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.


ఈసెట్ కౌన్సిలింగ్ 14 నుంచి

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 14 నుంచి చేపట్టనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. 10న ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయనున్నామని, 14 నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసు ములు 17-20: ధ్రువపత్రాల పరిశీలన, 19-21: కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు, 22న ఐచ్ఛికాల మార్పునకు అవకాశం కల్పించినట్లు వెల్ల డించారు. 25న సీట్ల కేటాయింపు, సీట్లు పొందిన వారు 25 నుంచి 30వ తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుం దని తెలిపారు. ఈ సెట్కు 34,503 మంది విద్యార్థులు హాజరు కాగా 31,933 మంది అర్హత సాధించారు.



కొనసాగుతున్న దొడ్డిదారిబదిలీలు:

నేతల సిఫార్సుతో ఉపాధ్యాయులకు కోరుకున్న చోట పోస్టింగ్లు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులు కొన సాగుతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం సిఫార్సు బదిలీలకు తెరలేపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 140 మందికి రాజకీయ పలుకుబడితో బదిలీలు చేసిన ప్రభుత్వం... ఇప్పుడు ఈ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారికి కోరుకున్న చోట పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 40 మందికి ప్రభుత్వం కోరుకున్న చోటకు బదిలీ చేసింది. నిబంధనల మేరకు సాధారణ బదిలీల్లో సీనియారిటీ ప్రకారం స్థానాలు కేటాయించాల్సి ఉండగా... కొందరు అధికార పార్టీ నేతల సిఫార్సుతో కోరుకున్న చోట పోస్టింగ్లు పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో 12వరకు సిఫార్సు బదిలీలు  జరిగాయి. పట్టణాలు, సాధారణ నగరాలకు సమీపంలోని పాఠశాలల్లో పోస్టులను బ్లాక్ చేశారు. దీంతో చాలా మంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ స్థానాలకు రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఇస్తున్నారు.రాజకీయ బదిలీలు పొందిన వారికి పోస్టింగ్లు ఇవ్వడంతో జాప్యం చేయడం, పదోన్నతుల్లో నిబంధనలు ఉల్లంఘించా రనే కారణంతో ప్రకాశం జిల్లా విద్యాధికారిని కమిషనరేట్క సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది.పదోన్నతుల్లో గందరగోళం..స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా కల్పించే పదోన్నతుల్లో గందర గోళం నెలకొంది. ఆఫ్లైన్లో పదోన్నతులు, పోస్టింగ్లు ఇస్తుం డడంతో కొందరు ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతు న్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో పదోన్నతి వదులు కున్న టీచర్లు ఏడాది వరకు పదోన్నతి తీసుకోకూడదని పాఠ శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. గతంలో పదోన్నతి వదులు కున్న వారిని సైతం కొత్త జాబితాలో చేరుస్తున్నారు. దీంతో కొందరికి దూరంగా పోస్టింగ్లు వస్తుండగా.. మరికొందరికి పదోన్నతులు లభించడం లేదు. పోస్టింగ్లు ఇవ్వడంలోనూ కొందరు అధికారులు మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు న్నాయి. కంప్యూటర్ ఆపరేటర్లు జాబితాలను తరచూ మార్చే స్తున్నట్లు కమిషనరేటు ఫిర్యాదులు చేస్తున్నారు.



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page