తామర గింజలు తిన్నారా
తామర గింజలు తిన్నారా
ఫూల్ మఖానా ఈ పేరు వింటే ఎవరికైనా దాంతో చేసే కూర మాత్రమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వాటిని మనం పెద్దగా వాడం. దాంతో అవేంటో కూడా పెద్దగా పట్టించుకోం కానీ వాటిని దేవతల ఆహారంగా భావించి ఇష్టంగా తినేవాళ్లు ఎందరో. ఎందుకో ఏమిటో ఓసారి చూద్దామా
తామరపువ్వు బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీ... ఇలా దేవతల ఆసనంగా అందరికీ సుపరిచితమే. పూజాదికాల్లోనూ దానిదే అగ్రాసనం. ఆ తామరపువ్వు గింజలే ఈ ఫూల్ మఖానా. వీటినే తామరగింజలు, ఫాక్స్ నట్స్ అనీ పిలుస్తారు. తాజాగానూ, వేయించుకునీ, ఎండబెట్టి ఉడికించుకునీ ఇలా రకరకాలుగా వీటిని తింటుంటారు. ఉత్తరాదిన అన్ని రకాల పండగలూ పూజల్లో వీటితో ప్రత్యేకంగా వంటల్ని తయారుచేసి నైవేద్యంగానూ పెడతారు. కేవలం మనదేశంలోనే కాదు, తూర్పుఆసియా దేశాలన్నింటిలోనూ డెజర్ట్‌లూ స్వీట్ల తయారీలోనూ వాడుతుంటారు. చైనా కొత్త సంవత్సరానికి చేసుకునే స్వీట్లలో ఇది తప్పనిసరి. అక్కడి సంప్రదాయ వైద్యంలోనూ వీటి వాడకం చాలా ఎక్కువ. తాజా గింజలు అంతటా దొరకవుగానీ ఎండబెట్టినవి మాత్రం అన్నిచోట్లా మార్కెట్లో దొరుకుతాయి. మనదేశంలో ఈ తామరగింజల పంటకి బీహార్ పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా దొరికే మఖానాలో 63 శాతం అక్కడే పండుతాయి. తాజా తామరగింజల్లో ఎండిన వాటిల్లోకన్నా శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం తక్కువ. ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్... వంటివి ఎక్కువ. అందుకే మణిపురి వాసులు వీటిని పచ్చిగానే ఎక్కువగా తింటారు.
ఎండినవాటినే మఖానా అని హిందీలో పిలుస్తారు. ఇవి ముదురు గోధుమరంగులోనూ తెలుపురంగులోనూ రెండు రకాలుగా దొరుకుతాయి. నిజానికి రెండూ ఒకటే. కానీ బాగా పండి కాయ ఎండాక తీసేవి ముదురురంగులో ఉంటే, గింజ పూర్తిగా తయారై, కాయ ఆకుపచ్చరంగులో ఉండగానే తీసేవి తెలుపురంగులో ఉంటాయి. అయితే కొందరు రంగుకోసం గింజల్ని హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ వంటి వాటితో బ్లీచ్ చేసి మరీ విక్రయిస్తుంటారు. అందుకే తెల్లగా ఉండే వాటికన్నా చూడ్డానికి అందంగా లేకున్నా ముదురురంగులో ఉండేవి కొనుక్కోవడమే ఉత్తమం.
ఎండు బఠాణీల మాదిరిగానే వీటిని కూడా ముందురోజు రాత్రే నానబెట్టుకుని కూరల్లోనూ, సూపుల్లోనూ, పుడ్డింగుల్లోనూ, పాయసాల్లోనూ, స్నాక్స్‌లోనూ వాడుకోవచ్చు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై... వంటి వాటితో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి స్నాక్.
పాప్‌కార్న్‌ను తలపించే తామరగింజల్లో పోషకాలూ ఔషధగుణాలూ లెక్కలేనన్ని. అందుకే అనేక ప్రాంతాల్లో ఈ గింజలకోసమే తామర పంటను పండిస్తుంటారు.
ఉపయోగాలేంటి
అన్ని వయసుల వాళ్లకీ తేలిగ్గా జీర్ణమయ్యే లక్షణం ఉండటం వల్ల వీటిని చిన్నా పెద్దా ఎవరైనా తినొచ్చు.
వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు వయసుని మీదపడనీయవు. అందుకే మఖానాను ఓ యాంటిఆక్సిడెంట్‌గా పేర్కొంటారు పోషకనిపుణులు. ముఖ్యంగా ఇందులో ఎల్-ఐసొయాస్పార్టిల్ మిథైల్‌ట్రాన్స్‌ఫెరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను బాగుచేస్తుంది. దాంతో యాంటీ ఏజింగ్‌కోసం తయారుచేసే క్రీముల్లోనూ మందుల్లోనూ వాడేందుకూ ప్రయత్నిస్తున్నారు.
వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్ధకానికీ మంచి మందే. శరీరంలోని వ్యర్థాలనూ టాక్సిన్లనూ తొలగిస్తుంది.
తామరగింజల్ని తరచూ తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. సోడియం తక్కువ. పొటాషియం ఎక్కువ. అందుకే బీపీరోగులకు ఇది చాలా మంచి ఆహారం.
తామరగింజల్లో క్యాలరీలు తక్కువ కావడంవల్ల మధుమేహులకి ఎంతో మంచి ఆహారం. పీచు ఎక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లకీ ఇది మంచి స్నాక్ ఫుడ్.
అనీమియా రోగులకి దీన్ని మందుగా ఇస్తారు సంప్రదాయ వైద్యులు.
గర్భిణులకీ బాలింతలకీ వీటిని ఆహారంలో ఇవ్వడంవల్ల నీరసం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, ప్లీహం పనితీరుకి దోహదపడతాయి.
నిద్రలేమి, చికాకులతో బాధపడేవాళ్లు వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల చక్కని ఫలితం ఉంటుంది.
డయేరియాను నివారించడంతోబాటు ఆకలినీ పెంపొందిస్తాయి. తరచూ మూత్రానికి వెళ్లేవాళ్లకీ అమీబిక్ డిసెంట్రీతో బాధపడేవాళ్లకీ ఇది ఎంతో మేలు చేస్తుంది.
కీళ్లనొప్పులతో బాధపడేవాళ్లకీ మంచిదే.
ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలవల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆ రెండింటినీ తగ్గించే గుణం దీనికి ఉండటం విశేషం.
చూశారా మరి
మనం ఏ విందు భోజనాల్లోనో ఏ ఒక్కసారో కూర రూపంలో తినే ఫూల్ మఖానాలో ఎన్ని మంచి గుణాలో. వీలైతే ఇకనుంచైనా వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments