top of page

జీర్ణకోశం ఆరోగ్యంగా ఉండాలంటే !

Writer's picture: AP Teachers TVAP Teachers TV

ఛాతీ మంట, దీర్ఘకాల మలబద్ధకం, పేగు పూత.. వంటి జీర్ణకోశ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వీటిల్లో కొన్నింటికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నింటికి శస్త్రచికిత్స అవసరమవ్వచ్చు. కానీ కొన్ని మాత్రం జీవనశైలి మార్పులతోనే చక్కబడొచ్చు. జీర్ణకోశ సమస్యలేవీ లేకపోయినా కొన్ని అలవాట్లతో పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 



సరైన వేళకు సరైన పదార్థాలు

పేగుల ఆరోగ్యానికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఇదే. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి సమతులాహారం కీలకం. పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు ఎక్కువగా.. మాంసం, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ తక్కువగా తినటం మంచిది. క్యాల్షియం, విటమిన్‌ డి వంటి పోషకాలను అందించే పాలు, మజ్జిగ, పెరుగు వంటివీ మేలే. లాక్టోజ్‌ పడనివారు మాత్రం పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ తగినంత పీచు లభించేలా చూసుకోవటమూ ముఖ్యమే. మగవారు రోజుకు 38 గ్రాములు, ఆడవారు 25 గ్రాముల పీచు తినాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఎప్పుడు తింటున్నామనేదీ ప్రధానమే. ఉదాహరణకు- ఛాతీలో మంటతో బాధపడేవారు పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే రాత్రి భోజనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువెక్కువ కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినటమూ ఉపయోగపడుతుంది. 

విసర్జన మార్పులపై దృష్టి

మల విసర్జన తీరుతెన్నులు ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తాయి. ఎప్పుడో అప్పుడు నీళ్ల విరేచనాలు అవటం మామూలే. దీనికి చింతించాల్సిన పనిలేదు. కానీ తరచూ విరేచనాలు అవుతున్నా, నాలుగైదు రోజుల వరకూ తగ్గకున్నా ఏదో తేడా ఉందని అనుమానించాలి. మలంలో రక్తం పడటం, రాత్రిపూట విసర్జన కోసం మేల్కోవటం, విరేచనాలతో పాటు బరువు తగ్గటం లాంటివి సిలియక్‌ డిసీజ్, పేగు పూత, పేగు ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలకు సంకేతాలు కావొచ్చు. విసర్జనలో మార్పులు లేకపోయినా 45 ఏళ్లు దాటాక పెద్దపేగు ముందస్తు పరీక్ష (కొలనోస్కోపీ) అవసరం. యాభై ఏళ్లు పైబడటం, మగవారు కావటం, పొగ తాగటం, ఊబకాయం, ఛాతీలో మంట వంటి ముప్పు కారకాలు గలవారు అన్నవాహిక క్యాన్సర్‌ ముందస్తు పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. 



బద్ధకం వీడాలి

శారీరకంగా చురుకుగా ఉండటం పేగు ఆరోగ్యానికి కీలకం. మలబద్ధకం గలవారికిది మరింత ముఖ్యం. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే అంత ఎక్కువగా పేగులు కదులుతాయి. పెద్ద పేగు ద్వారా ఆహారం త్వరగా ముందుకు కదలటానికి వ్యాయామం తోడ్పడుతుంది. మల బద్ధకం, కాలేయ కొవ్వు తగ్గటానికే కాకుండా పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యానికీ, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికీ వ్యాయామం దోహదం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు అరగంట చొప్పున వారానికి మూడు రోజులు తీవ్ర వ్యాయామం చేయటం మంచిదన్నది నిపుణుల సూచన. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతిరోజూ అరగంట సేపు నడిచినా మంచిదే. వీలైనంత వరకూ రోజులో ఎక్కువసేపు కదిలేలా చూసుకోవటం ముఖ్యం. 

తగినంత నీరు

మన శరీరంలో చాలా వ్యవస్థలు నీటితోనే ముడిపడి ఉంటాయి. నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగా సాగదు. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. పీచుతో పాటు తగినంత నీరు తీసుకుంటే మరింత మంచి ఫలితం కనిపిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నారు. అవసరమైన మేరకు నీళ్లు తాగితే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది కూడా. అలాగే కృత్రిమ తీపి పదార్థాలతో చేసిన పానీయాలకు దూరంగా ఉండాలి కూడా. కృత్రిమ తీపి పదార్థాలతో పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ తీయగా ఉండాలనుకుంటే తేనె వంటి సహజ పదార్థాలు ఎంచుకోవాలి.

మద్యం, నొప్పి మందులు పరిమితం

మద్యం, ఎన్‌ఎస్‌ఏఐడీ రకానికి చెందిన నొప్పి మందులు పేగులకు హాని చేస్తాయి. మద్యం కాలేయానికి హాని తల పెట్టటమే కాదు.. నేరుగా జీర్ణాశయం, పేగుల మీదా ప్రభావం చూపుతుంది. అతిగా మద్యం తాగిన మర్నాడు చాలామంది కడుపునొప్పి, విరేచనాలతో బాధపడటం చూస్తూనే ఉంటాం. ఇటీవలి కాలంలో మద్యం అతిగా తాగినవారిలో జీర్ణాశయం ఉబ్బుతున్నట్టు ఎండోస్కోపీ పరీక్షలో కనిపిస్తోందనీ నిపుణులు చెబుతున్నారు. మద్యం విషయంలో ఆరోగ్యకరమైన పరిమితి అంటూ ఏదీ లేదు. అసలు దీని జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే పరిమితి పాటించాలి. ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ మాటి మాటికీ నొప్పి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో, పేగుల్లో వాపు పక్రియ ప్రేరేపితమవుతుంది. పేగుల్లో పుండ్లు పడొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page