ఈ టీచర్ ది ఎంత మంచి మనసో
ఈ టీచర్ ది ఎంత మంచి మనసో
ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ కొన్నాళ్ల క్రితం సైన్యంలో పనిచేశాడు. కార్గిల్ యుద్ధంలోనూ, పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడూ సైనికుడిగా పోరాడాడు. 2009లో రిటైర్ అయ్యాక టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి డైట్‌లో సీటు సాధించాడు. అది పూర్తి చేశాక టెట్ పాసై 2012లో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా ఉద్యోగం సాధించిన శ్రీనివాస్‌కు పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికి అక్కడ పన్నెండు మంది విద్యార్థులే ఉన్నారు. వారికి ఉన్నత ప్రమాణాలతో బోధించడం మొదలుపెట్టిన శ్రీనివాస్- నవోదయ సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని భావించి కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు.
తాను స్కూలుకు సెలవు పెట్టకుండా, పిల్లలు మానకుండా జాగ్రత్తలు తీసుకునే అతని గురించి మార్కాపురంతోపాటు ఆ చుట్టుపక్కల 15 గ్రామాలకు చెందిన వాళ్లు తెలుసుకుని తమ పిల్లల్ని కూడా ఓబులక్కపల్లి స్కూల్లో చేర్పించడం మొదలుపెట్టారు.. ఇదిలా ఉంటే అక్కడ బోధన మెరుగుపడి, విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ వసతుల లేమి ఇబ్బందికరంగా ఉండేది. దాంతో శ్రీనివాస్ తన దగ్గరున్న ఐదు లక్షలకు, దాతల నుంచి సేకరించిన పది లక్షలు జోడించి - స్కూలుకు రంగులు వేయించడంతోపాటు ఫ్యాన్లూ, బల్లలూ, వాటర్ ఫిల్టర్ వంటివి సమకూర్చాడు. టాయిలెట్లు బాగు చేయించి కార్పొరేట్ స్థాయిలో స్కూలు రూపురేఖల్ని మార్చేయడంతో అక్కడి విద్యార్థుల సంఖ్య 250కి చేరింది.
అలానే ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా సొంతంగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి- పలు కార్యక్రమాలు చేపట్టిన శ్రీనివాస్ గతేడాది బోడపాడులోని ఎంపీపీఎస్ స్కూలుకు బదిలీ అయ్యాడు. అప్పటికి సుమారు నలభై మంది పిల్లలు చదివే ఆ స్కూలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుండేది. ఆ పరిస్థితుల్ని చూసిన శ్రీనివాస్ దాదాపు నాలుగు లక్షలరూపాయలు ఖర్చు చేసి ఆ బడినీ బాగు చేయించాడు.
స్నేహితుల ఆర్థిక సాయంతో స్కూల్లో మరికొన్ని వసతులూ కల్పించిన అతని వద్ద శిక్షణ తీసుకున్నవారిలో దాదాపు ఇరవై మంది చిన్నారులు నవోదయ సీటు సాధించారు. అలా విద్యార్థుల కోసం ఎంతో చేస్తున్న శ్రీనివాస్ ఆర్మీ నుంచి వచ్చే పింఛను మొత్తాన్ని స్కూళ్లను బాగు చేయడానికే వినియోగించడం విశేషం.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
댓글