ఆ తరగతి విద్యార్థులకు 10రోజులు బ్యాగులు అవసరం లేదు!
ఆ తరగతి విద్యార్థులకు 10రోజులు బ్యాగులు అవసరం లేదు!
విద్యార్థులకు బ్యాగ్ అవసరం లేని (Bagless Days) రోజులు అమలు చేసేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది.
విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి.. తరగతుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం జాతీయ విద్యా విధానంలో (NEP) పొందుపరిచిన సిఫార్సుల అమలుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాగ్ అవసరం లేని (Bagless Days) రోజులు అమలు చేసేందుకు సిద్ధమైంది. సంవత్సరంలో మొత్తంగా 10 రోజులు ఈ వెసులుబాటు కలిగించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
‘‘బోధనా అభ్యాస ప్రక్రియలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడమే దీని ఉద్దేశం. ఇందుకోసం విద్యాసంవత్సరంలో 10 రోజుల పాటు పుస్తకాలు అవసరం లేకుండా చూడాలి. ఒకేసారి కాకుండా మూడు దశల్లో వీటిని అమలు చేయాలి. అన్ని విభాగాల టీచర్లను భాగస్వామ్యం చేయాలి. అవసరమైతే ఇండోర్, ఔట్‌డోర్ కార్యక్రమాలను కలిపి నిర్వహించాలి. కూరగాయల మార్కెట్‌లను సందర్శించి సర్వేలు చేయడం, బుక్‌ఫెయిర్ నిర్వహణ, సోలార్ ఎనర్జీ పార్క్, బయోగ్యాస్ ప్లాంట్‌ల సందర్శన, గాలిపటాల తయారీ, ఎగురవేయడం వంటి కార్యక్రమాలు ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాల్లో ఉన్నాయి.
స్థానిక నైపుణ్యాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు నిర్ణయించిన వృత్తిపరమైన వడ్రంగి, విద్యుత్ పని, ఆభరణాల తయారీ, గార్డెనింగ్, కుండల తయారీ వంటి పనులకు సంబంధించిన నైపుణ్యాలపై ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు అనుభవం పొందవచ్చని తెలిపింది. వీటి ద్వారా పుస్తక జ్ఞానం, వాస్తవిక జ్ఞానానికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోవడంతోపాటు పని వాతావరణంలో నైపుణ్యాలు తెలుసుకునేందుకు వీలుంటుందని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. తద్వారా భవిష్యత్తు కెరీర్‌ను నిర్ణయించుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది.
6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 10 రోజుల పాటు పుస్తకాల అవసరం లేని వాతావరణాన్ని కల్పించాలని జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. దీన్ని అమలు చేసేందుకు గాను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (NCERT)కు చెందిన పీఎస్‌ఎస్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ తాజా మార్గదర్శకాలను రూపొందించింది.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments