top of page

అది ఆట కాదు.. కన్నీటి గాధ


అది ఆట కాదు.. కన్నీటి గాధ

బెట్టింగ్‌ యాప్‌ల ఉచ్చులో పడి విలవిల

ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావంతో భారీగా రుణాలు

అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు


బెట్టింగ్‌ యాప్‌లు యువత ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సినీ, టీవీ తారలు, సామాజిక సేవకుల ముసుగులో ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని రూ.లక్షలు సంపాదించామని నోట్ల కట్టలను చూపుతూ వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వీటికి ఆకర్షితులై ఎంతోమంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆడుతున్నారు. కొందరు రుణ యాప్‌లను ఆశ్రయించి ఆ ఉచ్చులో చిక్కుతున్నారు. చివరికి అసలు, వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో రెండేళ్లలో సుమారు 10 మంది బెట్టింగ్‌ ఉచ్చులో పడి బలవన్మరణం చెందినట్లు అంచనా. ఆయా కుటుంబాలు బిడ్డల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు ఉబికివస్తున్నాయి.

కడుపుకోత మిగిల్చాడు

బాలానగర్‌ వినాయకనగర్‌కు చెందిన డి.తరుణ్‌రెడ్డి(21) బీటెక్‌ పూర్తి చేశాడు. ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రముఖ వర్సిటీలో సీటు సంపాదించాడు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగా రూ.6 లక్షల ప్యాకేజీతో కొలువు లభించింది. తల్లిదండ్రులు పొంగిపోయారు. ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు సరదాగా మొదలైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు అలవాటుగా మారాయి. రెండేళ్లుగా పందేలు కాసేందుకు క్రెడిట్‌ కార్డుతో రూ.3 లక్షలు.. వ్యక్తిగత రుణం రూ.4 లక్షలు తీసుకొని నష్టపోయాడు. అప్పులన్నీ తీర్చిన తండ్రి కొడుకుని సున్నితంగా మందలించాడు. గతేడాది డిసెంబర్‌లో అప్పులు తీరగానే.. ఈ ఏడాది జనవరి 13న బెట్టింగ్‌లతో క్రెడిట్‌ కార్డుతో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు తెలిసేలోగా.. జనవరి 22న ఉరేసుకున్నాడు



చితికిపోయి.. కొడుకుని కోల్పోయి

గుడిమల్కాపూర్‌కు చెందిన బాలకృష్ణ కుమారుడు శీలం మనోజ్‌ గతేడాది దుండిగల్‌లోని కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఆన్‌లైన్‌ బెట్టింగులకు దగ్గరయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించవచ్చంటూ మనోజ్‌ను రొంపిలోకి లాగారు. రుణయాప్‌లు, ఇతర మార్గాల్లో అప్పులు చేశాడు. సొమ్మంతా నష్టపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. నెల వాయిదాలు చెల్లించట్లేదంటూ ఒత్తిడి చేయడం.. అప్పుల విషయం బయటకు తెలిస్తే బంధువుల్లో పరువు పోతుందని భావించాడు. మనస్తాపంతో గతేడాది ఫిబ్రవరి 26న ఉరేసుకొని చనిపోయాడు. మనోజ్‌ చేసిన రూ.5 లక్షల అప్పును తండ్రే తీర్చాడు. ఆర్థికంగా చితికిపోయి.. కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు కన్నీటి మధ్య జీవనం సాగిస్తున్నారు. ఎదిగిన బిడ్డలు చేసిన తప్పులు కన్నవారిని మనోవేదనకు గురిచేస్తాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

బిడ్డకు దూరమై కోలుకోలేని తల్లి

ఎదిరే కొమరయ్య, లక్ష్మి దంపతులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోచమ్మబస్తీలో ఉంటారు. సాయికిరణ్‌(21) ఏకైక సంతానం. తల్లి కూలీకెళుతూ.. తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. కుమారుడిని నారాయణగూడలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీలో చేర్చారు.  రూ.1.50 లక్షల బైక్‌ కొనిచ్చారు. ఏడాది క్రితం స్నేహితుల ప్రభావంతో బెట్టింగ్‌ యాప్‌లకు దగ్గరయ్యాడు. రూ.2 లక్షలు అప్పు చేశాడు. బైక్‌ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. తప్పటడుగు వేశాడని గ్రహించిన తల్లిదండ్రులు రూ.రెండు లక్షల అప్పు తీర్చారు. బుద్ధిగా చదుకోమని చెప్పారు. బెట్టింగ్‌ వ్యసనంతో మరోసారి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. బైక్‌ తాకట్టు పెట్టాడు. చేసిన అప్పులు.. కన్నవారి మనోవేదన చూసి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుంగిపోయిన తల్లి మూడు నెలలుగా మంచానికే పరిమితమైంది. భార్య ఆలనాపాలనా చూస్తున్నాడు. అప్పులన్నీ తీరుస్తాం బిడ్డా.. నువ్వు ఆగం కావొద్దని చెప్పినా ఇట్టా చేసుకున్నాడని సాయికిరణ్‌ అమ్మమ్మ బాలమణి కన్నీరుమున్నీరయ్యారు.




 
 
 

Comments


bottom of page