Whatsapp features: వాట్సప్ కొత్త ఫీచర్స్: గ్రూప్‌లో ఆన్‌లైన్.. మెన్షన్ చేస్తేనే నోటిఫికేషన్..మరెన్నో !!
- AP Teachers TV
- 2 days ago
- 2 min read

Whatsapp features: వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం వీటిని ప్రకటించింది.
Whatsapp features | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. గ్రూప్‌లో ఆన్‌లైన్ వ్యూ, మెన్షన్ చేస్తేనే నోటిఫికేషన్లు వచ్చే ఏర్పాటు తదితర ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు తాజాగా ఓ బ్లాగ్‌పోస్ట్‌లో ఫీచర్ల వివరాలను వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇవీ..
వాట్సప్ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నా అందులో ఎందరు అందుబాటులో ఉన్నారో ఇంతకుముందు తెలిసేది కాదు. ఇకపై గ్రూప్‌లో ‘ఆన్‌లైన్’లో ఎంతమంది ఉన్నారో నంబర్ రూపంలో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి తరచూ సందేశాలు రాకుండా మ్యూట్ చేసుకునే సదుపాయం ఉంది. అన్ మ్యూట్ చేయకుంటే మెసేజులు వస్తూనే ఉంటాయి. అలా కాకుండా మనల్ని గ్రూప్‌లో ఎవరో మెన్షన్ చేస్తేనో, మనం పెట్టిన మెసేజ్‌కు ఎవరైనా రిప్లయ్ ఇచ్చినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వచ్చే ఏర్పాటు ఉంటే ఎంతో బాగుంటుంది కదూ! ఆ ఫీచర్‌నూ వాట్సప్ జోడించింది. గ్రూప్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్‌కు ఈ ఆప్షన్ ఇచ్చింది.
గ్రూప్‌లో ఎవరైనా శుభవార్త చెప్పారనుకుందాం. ఒకరి తర్వాత ఒకరు అందరూ విషెస్ చెబుతుంటారు. మీరూ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే అప్పటికే వచ్చిన రియాక్షన్స్ మీద క్లిక్ చేస్తే అప్పటికే చెప్పిన వారి ఎమోజీలు కనిపిస్తాయి. అందులో ఒక దాని మీద ట్యాప్ చేస్తే మీ రియాక్షన్ కూడా నమోదవుతుంది. ఈవెంట్స్‌లో ‘మేబీ’ అనే కొత్త ఆప్షన్ జోడించారు. అలాగే ఈవెంట్స్ ప్రారంభ సమయం నుంచి ముగింపు సమయాన్ని జోడించే సదుపాయాన్ని కూడా వాట్సప్ తీసుకొచ్చింది. ఐఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అటాచ్‌మెంట్ విభాగంలో ‘స్కాన్ డాక్యుమెంట్స్’ ద్వారా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఐఫోన్ యూజర్లు కావాలనుకుంటే వాట్సప్‌ను తమ డిఫాల్ట్ కాలింగ్ యాప్‌గా వినియోగించుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు వీడియో కాల్‌లో ఉన్నప్పుడు వేలితో జూమ్ కూడా చేసుకోవచ్చు. వీడియో కాల్ క్వాలిటీని సైతం మెరుగుపరిచినట్లు వాట్సప్ పేర్కొంది. వాట్సప్ ఛానల్ అడ్మిన్లు ఇకపై 60 సెకన్ల షార్ట్ వీడియోను తమ ఫాలోవర్లతో పంచుకోవచ్చు. రెగ్యులర్ చాట్ తరహాలోనే ఛానల్‌లోనూ వాయిస్ మెసేజ్ తాలుకా టెక్ట్స్ ట్రాన్స్‌స్క్రిప్ట్ అయ్యి కనిపిస్తుంది.
కింది బటన్ లేదా పిక్చర్ నొక్కి మీ వాట్సాప్ కొత్త వెర్షన్ కి అప్ డేట్ చేసుకోండి.
Comments