vinayaka vratha kalpam: వినాయక వ్రత కల్పం, పూజా విధానం
vinayaka vratha katha: గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బితబ్బిబ్బయిపోతాడు. బొజ్జగణపతి భక్త సులభుడు. శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించేవారిని.. సకల విఘ్నాల నుంచీ కాపాడతాడు, సర్వశుభాల్నీ ప్రసాదిస్తాడు. ఇదే, స్వామి వ్రతకల్పం...
గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బితబ్బిబ్బయిపోతాడు. బొజ్జగణపతి భక్త సులభుడు. శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించేవారిని.. సకల విఘ్నాల నుంచీ కాపాడతాడు, సర్వశుభాల్నీ ప్రసాదిస్తాడు. (vinayaka chavithi pooja vidhanam telugu)ఇదే, స్వామి వ్రతకల్పం..
పూజాసామగ్రి
పసుపు, కుంకుమ, అక్షతలకి బియ్యం, జేగంట, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్ధరిణలు, అగరుబత్తీలు, హారతి కర్పూరం బిళ్ళలు, 2 కొబ్బరికాయలు (వాటిని కొట్టేందుకూ, ఆ నీళ్లు పట్టేందుకూ ఏర్పాట్లు చేసుకోవాలి), అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, లోతు ఉండి వెడల్పుగా ఉన్న పళ్ళాలు (నైవేద్యానికీ, పత్రికీ) 2, దీపారాధన వస్తువులు, యథోచితంగా పత్రి (మొత్తం నీటితో కడిగి ఏ జాతికి ఆ జాతిని విడివిడిగా పెట్టుకోవాలి), చేయితుడుచుకోవడానికి ఒక వస్త్రం.
పత్తి (దూది)ని సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దిన యజ్ఞోపవీతాలు 2 చేసుకోవాలి. రూపాయిబిళ్ళలంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి, నీటిని ఒత్తి కుంకుమని అద్దిన రక్తవస్త్రాలు 2, అగరుబత్తి పుల్లలకు దూదిని చుట్టి నేతిలో/నూనెలో ముంచి పొడిగా ఉండేలా ఒత్తిన ‘కైవత్తులు’ 2 తయారుచేయాలి.
5 తమలపాకుల్లో రెండు వక్కలూ, 2 అరటిపళ్ళూ చొప్పున పెట్టి దారంతో చుట్టిన తాంబూలాలు 6 సిద్ధం చేసుకోవాలి.
ఒక పాత్రలో పంచామృతం (చిన్న చెంచా తేనె, అంతే పెరుగు (ఆవు పెరుగు శ్రేష్ఠం), అంతే పాలు, అంతే పంచదార, అంతే నెయ్యి కలిపి) సిద్ధం చేసుకోవాలి.
వినాయకుడికి ఉండ్రాళ్లన్నా, తెల్ల నువ్వులు కలిపిచేసిన మోదకాలన్నా చాలాఇష్టం. ఇవికాక, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. యథాశక్తి ఎవరికి కలిగింది వాళ్లు పెట్టొచ్చు.ఇలా సిద్ధం కావాలి: వినాయక చవితినాడు వేకువజామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలంటుస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకుల తోరణాలుకట్టుకోవాలి. దేవుడి గది ఉంటే దాన్ని లేదా ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి అలకాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టాలి. దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గు వేయాలి. దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.
పూజచేసేవాళ్లు బొట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరోపీట తీసుకోవాలి. దానిపై నూతనవస్త్రం (పంచె లేదా తువ్వాలు) పరిచి, అక్షతలు వేయాలి. మూడు ఆకులు (తమలపాకు కొనలు వేళ్లను తాకాలి), రెండు వక్కలు, రెండు పళ్లు, దక్షిణ పట్టుకోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।।అయం ముహూర్తః సుముహూర్తోస్తు... తదేవలగ్నం సుదినం తదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవలక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామియశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాతయో స్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమబొట్టు పెట్టాలి.ప్రార్థన: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపఃధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంద పూర్వజఃఅని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి.బొటనవేలు, ఉంగరం వేలు, మధ్యవేళ్లతో అక్షతలు తీసుకుని పసుపు గణపతిమీద వేసి నమస్కారం చేయాలి. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు... అని నమస్కారం చేయాలి.
ఆచమనం: ఆచమ్యా ఓం కేశవాయస్వాహా (స్త్రీలైతే కేశవాయనమః అనాలి), ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా - అని చదువుతూ ఉద్ధరిణతో కుడిఅరచేతిలోకి మినపగింజ మునిగేంత నీటిని తీసుకుని, చప్పుడు కాకుండా కిందిపెదవితో స్వీకరించాలి. ఉద్ధరిణతో మరోసారి నీళ్లు తీసుకుని కుడిచేతిని కడుక్కుని చేయి తుడుచుకోవాలి. తరవాత కింది మిగతానామాలూ చదవాలి.
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః
దీపారాధన: దీపం వెలిగించి, పూలూ అక్షతలూ వేసి నమస్కారం చేయాలి. (ఈ కింది మంత్రాలు చదువుతూ పూలూ అక్షతలూ పసుపు గణపతిమీద వేయాలి.)
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః... ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః... ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః... ఓం శచీపురంధరాభ్యాం నమః... ఓం అరుంధతీవశిష్ఠాభ్యాం నమః... ఓం సీతారామాభ్యాం నమః... సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమోనమః
భూతోచ్ఛాటన: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాఃఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభేఅని చదివి... అక్షతలు వాసన చూసి, భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. మిగతావాళ్లు కుడిచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. తరవాత ప్రాణాయామం చేయాలి.
సంకల్పం: ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం, శుభేశోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య (హైదరాబాద్ ప్రాంతీయులు వాయవ్య ప్రదేశే అని, తిరుపతి వాళ్లు ఆగ్నేయప్రదేశే అని, ఇతర ప్రాంతాల వాళ్లు ఈశాన్య ప్రదేశే అని చదువుకోవాలి) ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ స్థిరవాసరే... శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః ...... గోత్రస్య...... నామధేయస్య (పూజ చేసేవారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ముద్దిశ్య, వర్షేవర్షేప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ అక్షతలూ నీళ్లూ వదలాలి).
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యేతదంగ కలశారాధనం కరిష్యే అని అక్షతలూ నీళ్లూ వదలాలి.(కలశానికి గంధం, కుంకుమలతో బొట్టుపెట్టాలి. కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేయాలి)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితఃమూలో తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాఃకుక్షౌతుసాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరారుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃకలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ...గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతినర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ।।కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ సంప్రోక్ష్యతమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడిమీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి.
ఓం శ్రీమహాగణాధిపతయే నమోనమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోస్తు... అని అక్షతలు వేయాలి.స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి. పువ్వులు రెండు చేతుల్లోకీ తీసుకుని...
గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమమ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్।।ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃధ్యాయామి ధ్యానం సమర్పయామి.ఆవాహయామి ఆసనం సమర్పయామినవరత్న ఖచిత సింహాసనం సమర్పయామిపాదయోః పాద్యం సమర్పయామి...హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖేశుద్ధాచమనీయం సమర్పయామిఉపచారికస్నానం... కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతిమీద చల్లాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామిస్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామిశ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామిశ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి,శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాన్ ధారయామి,శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి, శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమఃధూపమాఘ్రాపయామి... (అగరుధూపం చూపించాలి), శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి)ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.నైవేద్యం: ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యంభర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్...సత్యం త్వర్తేన పరిషించామి... అని నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.అమృతమస్తు... పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలాలి.అమృతోపస్తరణమసి... అని నైవేద్యంపైన నీళ్లు చల్లినీళ్లూ అక్షతలూ పళ్లెంలో వదలాలి.
శ్రీమహాగణపతి దేవతా స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భూత్వా వరదో భవతు...ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తుఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తుశ్రీమహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామిపసుపు గణపతి పూజాక్షతలు శిరసున ధరించాలి.శ్రీ మహాగణాధిపతయే నమః... గణపతిం ఉద్వాసయామిఅని పసుపు గణపతిని తూర్పువైపుకి జరపాలి.శ్రీ మహాగణాధిపతయే నమః... యథాస్థానం ప్రవేశయామిశోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ... అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇక్కడికి హరిద్రా గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది.
వరసిద్ధి వినాయకవ్రత ప్రారంభం
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమఃప్రాణప్రతిష్ఠాపన ముహూర్త స్సుముహూర్తోస్తు అని మట్టిగణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయాలి.స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు।। స్తిరోభవ వరదోభవ ప్రసీద ప్రసీద(అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలూ పూలూవేసి నమస్కరించాలి)
షోడశోపచార పూజ:భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణంవిఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే।।ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజంపాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్।।ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభంభక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్।।
ధ్యానం: ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభంచతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్।।ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃఆవాహయామి (అక్షతలు వేయాలి)
ఆసనం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃఆసనం సమర్పయామి (అక్షతలు లేదా పూలు వేయాలి)
అర్ఘ్యం: గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందనగృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్‌ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః అర్ఘ్యం సమర్పయామి(తమలపాకుతో స్వామిపైన నీళ్లు చల్లాలి)
పాద్యం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃపాద్యం సమర్పయామి।। (మళ్లీ కొంచెం నీటిని స్వామికి చూపించి, స్వామి పాదాల ముందుంచాలి)
ఆచమనీయం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః ఆచమనీయం సమర్పయామి।।(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
మధుపర్కం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః మధుపర్కం సమర్పయామి ।।(తేనె, పెరుగు, నెయ్యి కలిపి సమర్పించాలి)
స్నానం: పంచామృత స్నానం సమర్పయామి ।।(పంచామృతం స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃశుద్ధోదక స్నానం సమర్పయామి।।(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
వస్త్రం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః వస్త్రయుగ్మం సమర్పయామి ।। (నూతన వస్త్రం లేదా పత్తికి పసుపు, కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించాలి)
యజ్ఞోపవీతం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః యజ్ఞోపవీతం సమర్పయామి ।। (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
గంధం: ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃగంధం సమర్పయామి।। (స్వామిపై గంధం చల్లాలి)
అక్షతలు: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్‌శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతేఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃఅక్షతాన్ సమర్పయామి।। (అక్షతలు వేయాలి)
పుష్పాలు: సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతేఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమఃపుష్పాణి పూజయామి ।। (స్వామిని పూలతో అలంకరించాలి, పూజించాలి)
అథ ఏకవింశతి పత్ర పూజ:
(ఒక్కొక్క నామం చదువుతూ పత్రాలతో స్వామిని పూజించాలి)ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామిఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి (వాకుడు)ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి (మారేడు)ఓం గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి (గరికె)ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)ఓం లంబోదరాయ నమః - బదరీపత్రం పూజయామి (రేగు)ఓం గుహాగ్రజాయ నమః - అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)ఓం గజకర్ణాయ నమః - వటపత్రం పూజయామి (మర్రి)ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి (మామిడి)ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి (గన్నేరు)ఓం భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామిఓం వటవే నమః - దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారుపత్రం పూజయామిఓం ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి (మరువం)ఓం హేరంబాయ నమః - సింధువారపత్రం పూజయామి (వావిలి)ఓం శూర్పకర్ణాయ నమః - జాజీపత్రం పూజయామిఓం సురాగ్రజాయ నమః - గండకీపత్రం పూజయామిఓం ఇభవక్త్రాయ నమః - శమీపత్రం పూజయామి (జమ్మి)ఓం వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి (రావి)ఓం సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి (మద్ది)ఓం కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాణి పూజయామి.
ధూపం: ధూపమాఘ్రాపయామి ।। (అగరుధూపం స్వామికి చూపించాలి)
దీపం: దీపం దర్శయామి ।। (దీపాన్ని స్వామికి చూపించాలి)
నైవేద్యం: మహానివేదన (అన్నం మొదలైన భోజనపదార్థాలు, పిండివంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపండ్లు అన్నింటినీ స్వామి ముందుంచాలి)
శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమఃమహానైవేద్యం సమర్పయామిఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ అని నైవేద్యంపై నీళ్లు చల్లాలి.సత్యం త్వర్తేన పరిషించామి... నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.అమృతమస్తు... స్వామి దగ్గర నీళ్లు వదలాలి.అమృతోపస్తరణమసి... అని నైవేద్యంపైన నీళ్లు చల్లి ఈ కింది మంత్రాలు చెబుతూ అయిదుసార్లు చేత్తో నైవేద్యాన్ని స్వామికి చూపించాలి.ఓం ప్రాణాయస్వాహా... ఓం అపానాయస్వాహా... ఓం వ్యానాయస్వాహా... ఓం ఉదానాయస్వాహా... ఓం సమానాయ స్వాహా... మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (స్వామి దగ్గర నీళ్లు చల్లాలి)అమృతాపిథానమసి... ఉత్తరాపోశనం సమర్పయామిహస్తౌ ప్రక్షాళయామి... పాదౌ ప్రక్షాళయామి... ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి... అంటూ నీళ్లు చల్లాలి.
తాంబూలం: పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతంకర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌తాంబూలం సమర్పయామి(తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచి నమస్కరించాలి)
నీరాజనం: (లేచి నిల్చుని హారతి ఇవ్వాలి)నీరాజనం సమర్పయామి ।।(హారతి పళ్ళెంపై కొంచెం నీళ్లు వదిలి, హారతి కళ్ళకు అద్దుకోవాలి)
మంత్రపుష్పం: (నిలుచుని పూలూ అక్షతలూ తీసుకుని చదవాలి)వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభఅవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాఅక్షతలూ పూలూ స్వామి పాదాలవద్ద ఉంచాలి.
ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ ।తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణం పదేపదే ।।అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ।।అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।।(ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి)
ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి.మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతేఅనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్‌సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతిదేవతార్పణమస్తు.శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి. పూజాక్షతలు శిరసున ధరించాలి.
శ్రీ వినాయక వ్రత కథ
vinayaka vratha kalpam telugu: వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘రుషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి’’ అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు... వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
‘‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి’ అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. (vinayaka vratha katha telugu) అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలాలను రకానికి ఇరవైఒకటి చొప్పున నివేదించాలి. పురాణ పఠనంతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. (విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి.) ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది’ అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.
కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితోబాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.
‘‘పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి... ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు.
వినాయకోద్భవం
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి, ఆ బాలుని శిరచ్ఛేదం చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తనవద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండేనికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్నీ త్రిలోక పూజ్యతనూ కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. ఆ తరవాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుం’దని చెప్పాడు. అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమనీ తరుణోపాయం చెప్పమనీ తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని అధీనములు - అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి, నమస్కరించి ‘తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి’ అని ప్రార్థించాడు.
చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్లు మొదలైన పిండివంటలు; టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికాని చేతులు భూమికానక ఇబ్బందిపడుతుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థచూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి, లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, ‘పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’ అని శపించింది.
ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషిపత్నులను మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన రుషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలేనని శంకించి, రుషులు తమ భార్యలను విడనాడారు. రుషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. రుషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ మునులూ పరమేశ్వరునికి తెలుపగా, అతడు అగ్నిహోత్రుని భార్యయే రుషిపత్నుల రూపం ధరించిందని చెప్పి రుషులను సమాధానపరిచాడు. (vinayaka vratha katha) అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి, మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంత దేవతలు ‘పార్వతీ, నీ శాపంవల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకోవా’లని ప్రార్థించారు. ‘వినాయకచవితినాడు మాత్రమే చంద్రుని చూడరాదు’ అని శాపాన్ని సడలించింది పార్వతి.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితినాటి రాత్రి... క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పిదుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ‘అయ్యో... నాకెలాంటి అపనింద రానున్నదో’ అనుకున్నాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తరవాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దాన్ని మాంసఖండమనుకుని అతణ్ణి చంపి, మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తరవాత మణికోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు... చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది.అది చూసి, జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవైఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని ‘దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పట్నుంచీ మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది’ అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు ‘శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వ’మని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితోపాటు తన కూతురు జాంబవతినీ కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి జరిగినదంతా చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు ‘అయ్యో, లేనిపోని నింద మోపి తప్పుచేశా’నని విచారించి, ‘మణితోపాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, క్షమించ’మని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. దేవతలు, మునులు కృష్ణుణ్ణి స్తుతించి ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొన్నారు. మా పరిస్థితి ఏంటి’ అని అడగ్గా ‘భాద్రపద శుద్ధ చతుర్థినాడు ప్రమాదవశాత్తూ చంద్రుణ్ణి చూసినవాళ్లు గణపతిని పూజించి, ఈ శమంతకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థినాడు దేవతలూ మహర్షులూ మానవులూ తమతమ శక్తికొద్దీ గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు.
సర్వేజనాః సుఖినోభవంతు
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Opmerkingen