Spoken English Skills | ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!
ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా? మాట్లాడాలని ఉన్నా.. తప్పులొస్తే నలుగురూ ఏమనుకుంటారోనని జంకుతున్నారా? ఈ కింది టిప్స్ ప్రయత్నించి నేర్చుకోవడం ఆరంభిస్తే ఇంట్లోనే ఈజీగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు నేర్చుకోవచ్చు.
ఉన్నత చదువులు అభ్యసించినా చాలా మంది ఆంగ్లం(English)లో మాట్లాడాలంటే హడలెత్తిపోతుంటారు. భాష పట్ల అవగాహన ఉన్నా అవతలివారు తప్పులు ఎత్తిచూపుతారేమోనని ఒకవైపు.. పదాలు దొరక్క ఇంకో వైపు.. వెనకడుగేస్తుంటారు. ఈ భయాలకు సమాధానం ఒక్కటే.. అదే ఇంగ్లిష్ నేర్చుకోవడం! ఈ బిజీ లైఫ్‌లో కొత్తగా నేర్చుకోవడం జరిగే పని కాదులే అనుకుంటే ఎప్పటికీ నేర్చుకోలేరు. ఇంట్లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగానే కొన్ని టిప్స్ పాటించి ఆడుతూ పాడుతూ మీ ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. మరి, ఆ మెళకువలేంటో చూద్దామా!
మీ చుట్టూ ఉన్నవారితో వీలైనంత మేరకు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇంగ్లిష్‌లో సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం వంటివి అలవాటు చేసుకోండి. ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఇంగ్లిష్ పుస్తకాలూ చదవడం మొదలుపెట్టండి.
ఇంగ్లీషు సినిమాలు అనగానే ‘స్పైడర్ మ్యాన్’, ‘సూపర్‌మ్యాన్’, ‘అవెంజర్స్’ వంటి సూపర్ హీరోల చిత్రాలే చాలా మందికి గుర్తొస్తాయి. అవి చూసేది కేవలం యాక్షన్ సీన్ల కోసం మాత్రమే. కానీ అంతకంటే ఎన్నో మంచి సినిమాలు ఉన్నా అవి ఇంగ్లిష్‌లో ఉండటంతో చాలా మంది వాటి జోలికెళ్లరు. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనే సామెతలా ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ ఉంటే అదే వస్తుంది. వారు పలికేది అర్థం కాకపోతే సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూస్తే చాలా ఉపయోగం ఉంటుంది. తెలుగు సినిమాలకు కూడా ఈ మధ్య ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వస్తున్నాయి. వాటిని ఆన్‌లో పెట్టుకుని చూడడం మేలు.
దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇయర్‌ఫోన్స్ కామన్‌గా ఉంటున్నాయి. తీరిక దొరికినప్పుడల్లా చాలా మందికి సంగీతం వినడం అలవాటే. వినోదంలో కొంత భాగం విజ్ఞానానికి (ఆంగ్లం) ఉయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని మ్యూజిక్ ప్లేయర్లలో పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అప్పుడప్పుడూ మీకిష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలను ఆంగ్లంలో వింటూ ఉండండి. అలానే వీలైతే ఆడియో బుక్స్ కూడా వినండి. దీని వల్ల ఇంగ్లీష్ పదాలు పలికే విధానం తెలుస్తుంది. చాలా మందికి తాము పదాలు తప్పుగా పలుకుతామోనన్న భయం ఉంటుంది. వినడం ద్వారా ఆ అనుమానం తొలగిపోతుంది.
మీకు వార్తలంటే ఇష్టముంటే రోజూ ఆంగ్ల దినపత్రికలను తిరగేయండి. మీ చుట్టూ జరిగే సంఘటనల గురించి చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు అవే వచ్చేస్తాయి. ఏవైనా తెలియకపోతే రిఫరెన్స్ నిఘంటువు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మొబైల్స్‌లోనూ నిఘంటువులున్నాయి. టైప్ చేసిన వెంటనే పదానికి అర్థం తెలుస్తుంది.
రోడ్లపై కనిపించే ప్రకటనల బిల్‌బోర్డులు ఎక్కువగా ఆంగ్లంలో ఉంటాయి. వీటిని చదివి అర్థం తెలియకపోతే నిఘంటువులో వెతికితే ఎప్పటికీ గుర్తుంటాయి. అలాగే, ఎక్కువగా కార్లను గమనించండి. వీటి పేర్లు అనేకం ఉంటాయి. omni అనేది మారుతి వాహనం. దీని అర్థం a vehicle used for several purposes.ఇలా కొత్త పదాలు, అర్థాలు నేర్చుకోవచ్చు.
ఇప్పుడు అందరి ఫోన్లలో వాట్సాప్ ఉంటోంది కదా. ఏదో ఒక గ్రూపులో మీరూ సభ్యులుగా ఉండే ఉంటారు. అప్పుడప్పుడూ అందులో ఇంగ్లీషులో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి. అలాగని గ్రూపులో ఎవరో మీ తప్పుల్ని ఎత్తి చూపుతారని భయపడకండి. చాలా మంది ఇలా భయపడే ముందడుగు వేయరు.
ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫోరమ్‌లు, సోషల్‌మీడియా గ్రూప్‌లు, లాంగ్వేజ్ ఎక్స్‌ఛేంజ్ వేదికల్లో చేరండి. తద్వారా స్థానిక స్పీకర్లతో పాటు తోటి అభ్యాసకులతో మీరు మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. అలా చేయడం ద్వారా మాండలికాలు తెలియడంతో పాటు ఉచ్చారణ మెళకువలు అలవడతాయి.
మీ మాటలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లంలోనే ఉండేలా చూసుకోండి. మీరు అవతలి వ్యక్తులతో జరిపే చర్చలు, మీ ఆలోచనలను ఆంగ్ల భాషలోనే వ్యక్తపరచండి. మీ భాషా ఉచ్ఛారణపైనా దృష్టిపెట్టండి . అప్పుడప్పుడూ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుండండి. మనకు ఉచితంగా లభించే సర్వీసు ఇది. మీరు మాట్లాడే వ్యక్తి ఎవరో తెలీదు కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారన్న మీమాంస ఉండదు.
ఆంగ్లం నేర్చుకొనేందుకు Duolingo, fluentU, hello English, Babbel, Memrise, Rosetta Stone వంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్‌లను వినియోగించవచ్చు. ఇవి మీ ప్రాక్టీసును మరింతగా మెరుగుపరుచుకొనేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఇంటరాక్టివ్ ఎక్సర్‌సైజ్‌లు, అభ్యాససన ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా భాష నేర్చుకోవచ్చు.
మీ దిన చర్యను ఇంగ్లిష్‌లో రాయడం అలవాటు చేసుకోండి. మీ అనుభవాలు, ఆలోచనలు మీకు ఇష్టమైన అంశాలను ఒక పుస్తకంపై రాయడం ద్వారా మీ పద సంపద పెరుగుతుంది. వాక్య నిర్మాణం మెరుగుపడుతుంది.
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే వారితో స్నేహం చేయండి. వారితో ప్రతిరోజూ ఆంగ్లంలో మాట్లాడటం ద్వారా త్వరగా నేర్చుకోగలుగుతారు. ఈ ప్రాక్టీస్ వల్ల మీరు ఏదైనా తప్పులు మాట్లాడితే వారు మిమ్మల్ని సరిచేయడం ద్వారా ఇంకా బాగా నేర్చుకోవచ్చు.
లోకల్ స్పీకర్లను అనుకరించండి. వాళ్లు ఏం చెబుతున్నారో గమనించి అలాగే మీరూ పలకడం ప్రాక్టీసు చేయండి. తద్వారా భాషలో సహజత్వం అలవడుతుంది.
మరీ ముఖ్యంగా.. ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని భారం అనుకోవద్దు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకోండి. నేర్చుకోవడం ఆరంభించి మధ్యలో ఆగిపోవడమూ మంచిది కాదు. నేర్చుకోవాలన్న తపన నిత్యం కొనసాగాలి. ప్రారంభంలో కష్టం అనిపించినా కొన్నాళ్లకు కొద్దికొద్దిగా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆ కిక్కు అనిర్వచనీయం! ఇంకెందుకు ఆలస్యం ఇంగ్లిష్ నేర్చుకోవడం ఇప్పటి నుంచే ఆరంభించండి!!
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Commentaires