RTE Act Andhra Pradesh: ప్రభుత్వ బడులపై ఆర్టీఈ దెబ్బ
- AP Teachers TV
- Apr 10
- 2 min read

విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది
ఇప్పటికే పాఠశాలల్లో తగ్గిపోతున్న విద్యార్థులు
2025-26లో ఆర్టీఈ ప్రవేశాలకు అనుమతిస్తూఉత్తర్వు
అమరావతి, ఏప్రిల్ 9(ఏపీ టీచర్స్ టీవీ ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే, ఆర్టీఈ వల్ల వీరి చేరికలు మరింతగా పడిపోతున్నాయి. మరోవైపు ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులపై కూడా సందిగ్ధత నెలకొంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించాలి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం... ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనే ఆర్టీఈ అమలు చేయాలి. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కిలోమీటరు పరిధిలో, 6 నుంచి 8 తరగుల విద్యార్థులకు 3 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. రాష్ట్రంలో దీనికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామని, ఇవి అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, అందువల్ల ఆర్టీఈ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆర్టీఈ అమలు వల్ల ప్రభుత్వ బడులకు రావాల్సిన పిల్లలు ప్రైవేటు బాట పడుతున్నారని వివరించింది.
కాగా, రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి విద్యా హక్కు చట్టాన్ని అమలుచేస్తున్నారు. సుమారు 34వేల మంది విద్యార్థులు ప్రస్తుతం ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. పట్టణాల్లో రూ.8వేలు, గ్రామాల్లో రూ.6500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 ఫీజులుగా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అవే ఫీజులు అమల్లో ఉండటంపై ప్రైవేటు పాఠశాలలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఎంత ఖర్చు చేస్తున్నారో, అంతే మొత్తం ఆర్టీఈ విద్యార్థులకు ఫీజు కింద చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం కోర్టుకు వెళ్లడంతో కొత్త ఫీజుల ఖరారుకు ప్రభుత్వం ఇటీవల కమిటీని నియమించింది. ఇదిలా ఉండగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యా హక్కు చట్టం కింద 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే నియమించిన కమిటీ సిఫారసు మేరకు ఆర్టీఈ ఫీజులుంటాయని పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి ఫీజులు ఖారారు చేయాల్సి ఉంది. ఆర్టీఈ కింద ఉచిత ప్రవేశాలు పొందేవారికి తల్లికి వందనం పథకం మినహాయించాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.
Recent Posts
See Allపాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారి సమావేశంలో ముఖ్యాంశాలు ఈరోజు జరిగిన గౌ|| డైరెక్టర్ గారి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వి....
Comments