Nara Lokesh: విద్యార్థుల సెల్‌ఫోన్లకే పరీక్ష ఫలితాలు
- AP Teachers TV
- Mar 19
- 2 min read
SSC Results on Whatsapp

జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
జూన్ 30 నుంచి వాట్సప్ గవర్నెన్స్ 2.0
నోటిమాటగా చెబితే టికెట్ బుకింగ్
విద్యుత్తు బిల్లుల చెల్లింపు సహా ఇతరసేవలు కూడా..
పౌరులు అడిగిన సేవను పది సెకన్లలో అందిస్తాం
శాసనసభలో మంత్రి లోకేశ్
అమరావతి: జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘ఒకచోట నుంచి మరో చోటకు టికెట్ కావాలని నోటితో చెబితే.. టికెట్ బుక్ చేస్తుంది. నంబర్ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుంది. అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయి’ అని వివరించారు. పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే.. వాటిని వాట్సప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. శాసనసభలో ‘వాట్సప్ గవర్నెన్స్’పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు.
‘ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం 200 సేవలు అందుతున్నాయి. మార్చి నెలాఖరుకు 300, జూన్ 30కల్లా 500 సేవలు అందిస్తాం. పౌరులు అడిగిన సేవను 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో 1.23 కోట్ల లావాదేవీలు జరగ్గా.. అందులో వాట్సప్ ద్వారా చేసినవి 51 లక్షలు. వాట్సప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగా చేరువైందో చెప్పేందుకు ఇదే నిదర్శనం.
విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్‌టికెట్లు పొందారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా దీనిద్వారా అందుబాటులోకి తెస్తాం. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తాం. కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఫిజికల్ పత్రాల్లాగే ఎలక్ట్రానిక్ పత్రాలూ చెల్లుబాటవుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణకు వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించే బిల్లు తెస్తాం’ అని లోకేశ్ చెప్పారు. ధాన్యం సేకరణలో వాట్సప్ సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత ఆలోచనతో ప్రారంభించారని.. దాన్ని కూడా అనుసంధానిస్తామన్నారు.
గత ప్రభుత్వ వేధింపుల నుంచి పుట్టిన ఆలోచన
‘గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి నుంచి ఎక్కువ మంది గెలిచినా.. బీసీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అప్పటి ఎమ్మెల్యే అడ్డుపడ్డారు. కులధ్రువీకరణ పత్రం ఇవ్వనీయకుండా వేధించారు. సర్టిఫికెట్ కోసం ఎలా వేధిస్తారో అప్పుడే చూశాను. అక్కడ్నుంచే ఈ ఆలోచన మొదలైంది. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని, చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోందని పాదయాత్ర సమయంలోనూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇబ్బందులు తీర్చడానికే వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.
జగన్‌కు ఫోన్ కొని పంపిస్తే నేర్చుకుంటారేమో!
‘పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అయినా పేటీఎం బ్యాచ్‌లు అసత్యప్రచారం చేస్తున్నాయి. వాట్సప్ గవర్నెన్స్‌లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తామని సవాల్ చేశా. ఎవరూ స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ వాడరంటున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక ఫోన్ కొని అందులో వాట్సప్ గవర్నెన్స్ లోడ్ చేసి పంపిస్తే.. అప్పుడైనా నేర్చుకుంటారేమో’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.
గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యేలు
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాలని, రెవెన్యూలో బ్లాక్‌చైన్ ఆధారిత విధానాలు అమలు చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో లొకేషన్ షేరింగ్ అవకాశం కూడా ఇందులో ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కోరారు. వాట్సప్ గవర్నెన్స్‌లో గ్రామాల్లో సమస్యలు, పాఠశాలల్లో ఇబ్బందులు చెప్పే విధానం అమలు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యలున్నందున వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.
కేంద్ర పథకాల సేవలను కూడా దీనిలో అందించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు. తమ నియోజకవర్గంలో ఒకరు రెండేళ్లుగా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రానికి తిరుగుతున్నా మంజూరు చేయలేదని.. వాట్సప్ గవర్నెన్స్ వచ్చాక వెంటనే వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం నగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, లోకం నాగమాధవి మాట్లాడారు.
Comments