Minister lokesh: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు.

హామీ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం
విద్యార్థులను రాజకీయ సభలకు తరలించే పంథాకు అడ్డుకట్ట వేశాం
ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూట్‌మ్యాప్ సిద్ధం
‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేశ్
అమరావతి: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామన్నారు. గత ఐదేళ్లూ విద్యార్థులను విచ్చలవిడిగా రాజకీయ సభలకు తరలించి, వారి భవిష్యత్తుతో ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాసంస్థలను వైకాపా రంగులు, నేతల ఫొటోలతో నింపేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తొలగించామని, విద్యార్థులను రాజకీయ నేతల సమావేశాలు, సభలకు తీసుకెళ్లే పంథాకు పూర్తిగా అడ్డుకట్ట వేశామని చెప్పారు. విద్యాసంస్థల్లో ఉద్యోగమేళాలు తప్ప.. ఇతర కార్యక్రమాలేవీ నిర్వహించకూడదని ఆదేశించామని తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేశ్ శనివారం ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ కళాశాలల్లో 1.48 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఆరంభించామన్నారు. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరంలో రూ.27.39 కోట్లు, వచ్చే ఏడాది రూ.85.84 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
రోడ్లు వేస్తున్నాం.. జగన్ నిర్భయంగా రావచ్చు
ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీనీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు. తాము ఇవ్వని హామీలనే ఇలా అమలు చేస్తున్నప్పుడు.. ఇచ్చినవి ఎలా విస్మరిస్తామని ప్రశ్నించారు. జగన్ దెబ్బకు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, రూ.నాలుగు వేల కోట్లను వడ్డీగా చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఒకవైపు రాష్ట్ర పరిస్థితిని గాడిలో పెడుతూ, మరోవైపు అన్ని పథకాలూ అమలు చేస్తున్నామన్నారు. ‘కావాలని ఆరోపణలు చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ గాలిలో కాకుండా రహదారులపైకి వచ్చి మేం చేస్తున్న మంచి పనులను చూడాలి. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా వేశాం. కాబట్టి జగన్ నిర్భయంగా రోడ్లపైకి రావచ్చు’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇంటర్ విద్యను నిర్వీర్యం చేశారు
‘గత ప్రభుత్వంలో ఇంటర్ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం పోయింది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాల పిల్లలూ ర్యాంకులు సాధించి.. టీవీ ఛానళ్లలో మారుమోగించేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఎంసెట్, నీట్ మెటీరియల్ కూడా వచ్చే ఏడాది నుంచి ఇస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తాం. ప్రపంచంలో టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో మనవాటిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. పాఠశాల స్థాయిలోనూ విద్యావ్యవస్థ పటిష్ఠతపై దృష్టి సారించాం. ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూట్‌మ్యాప్ తయారైంది’ అని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments