Gold: బంగారం కొందాం ఈటీఎఫ్ రూపంలో
- AP Teachers TV
- Mar 21
- 2 min read
శుభకార్యం, పండగలు సందర్భం ఏదైనా సరే బంగారం గురించే ఆలోచన. ఆభరణాల రూపంలోనూ.. పెట్టుబడిగానూ ఇది ఎంతో ప్రత్యేకం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా ప్రపంచమంతా నమ్మే విశ్వసనీయ మదుపు పథకం

శుభకార్యం, పండగలు సందర్భం ఏదైనా సరే బంగారం గురించే ఆలోచన. ఆభరణాల రూపంలోనూ.. పెట్టుబడిగానూ ఇది ఎంతో ప్రత్యేకం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా ప్రపంచమంతా నమ్మే విశ్వసనీయ మదుపు పథకం. ఇటీవలి కాలంలో పసిడి ధర పెరుగుతుండటంతో చాలామంది బంగారంలో మదుపు చేయాలనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మొత్తంతోనూ పసిడిలో మదుపు చేసేందుకు వీలు కల్పించే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్ల (గోల్డ్ ఈటీఎఫ్) గురించి తెలుసుకుందాం.
బంగారం పది గ్రాముల ధర రూ.90వేలకు మించి పోయింది. దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. భవిష్యత్తు అవసరాల కోసం బంగారాన్ని కూడబెట్టాలనే ఆలోచనా పెరిగింది. వైవిధ్యమైన పెట్టుబడులు ఎప్పుడూ శ్రేయస్కరమే. ఇందులో బంగారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చాలామంది బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనేందుకే ఇష్టపడతారు. శుభకార్యాలు, ఇతర అవసరాల సందర్భంలో ఇది తప్పనిసరి. ఆభరణాలు, నాణేలు, ఇతర రూపాల్లోనే కాకుండా.. పెట్టుబడి దృష్టితో, చిన్న మొత్తంతో బంగారం కొనాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
దేశీయ బంగారం ధరలకు దగ్గరగా ఉంటూ.. చిన్న మొత్తంలోనూ పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేవే గోల్డ్ ఈటీఎఫ్‌లు. వీటిలో మదుపు చేయడం అంటే.. బంగారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో కొనడం అన్నమాట. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు వీటిని యూనిట్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. కావాలనుకున్నప్పుడు వెంటనే అమ్మొచ్చు. పసిడిలో సులభంగా లావాదేవీలు నిర్వహించేందుకు ఇవి ఒక సులభమైన మార్గంగానూ అనుకోవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ కొన్నారంటే మదుపరులు ఆ మేరకు 99.5 శాతం శుద్ధతతో బంగారాన్ని కొన్నట్లే లెక్క. బంగారం రేట్లలో వచ్చే హెచ్చుతగ్గులే గోల్డ్ ఈటీఎఫ్‌లపైన ప్రభావాన్ని చూపిస్తాయి. బంగారం 10 శాతం పెరిగితే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధర 10శాతానికి అటూఇటూగా లాభాన్ని అందిస్తుంది.
తక్కువ ఖర్చుతో
బంగారం నేరుగా కొన్నప్పుడు కొన్ని ఖర్చులూ కలిసి ఉంటాయి. దీంతో మార్కెట్ ధరకన్నా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. అమ్మేటప్పుడు అన్ని ఖర్చులూ తిరిగి రావు. ఈ ఇబ్బంది గోల్డ్ ఈటీఎఫ్‌లతో ఉండదు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఉన్న రేటును బట్టి అమ్మొచ్చు. కొనొచ్చు. బంగారాన్ని భద్రపర్చడమూ కష్టమే. ఈటీఎఫ్‌ల ద్వారా కొన్నప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. కాబట్టి, రక్షణకు ఇబ్బందేమీ ఉండదు.
డీమ్యాట్ ఉంటే చాలు..
గోల్డ్ ఈటీఎఫ్‌లు కొనాలని అనుకుంటే డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. మీ మొబైల్ నుంచే యూనిట్లను కొనొచ్చు. అమ్మొచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. మీరే సొంతంగా లావాదేవీలు చేసుకోవచ్చు. దీనివల్ల మీకు సమయమూ కలిసొస్తుంది. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడి విలువనూ చూసుకుంటూ ఉండొచ్చు.
పన్ను భారం లేకుండా
బంగారాన్ని నేరుగా కొన్నప్పుడు 3 శాతం వరకూ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు కొన్నప్పుడు నామమాత్రపు రుసుములు ఉంటాయి. పెట్టుబడిపై వచ్చే లాభాలకు నిబంధనల మేరకు మూలధన పన్ను వర్తిస్తుంది.
రూ.75తోనూ..
సాధారణంగా బంగారాన్ని కొనాలంటే రూ.వేలల్లోనే అవసరం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గ్రాము పసిడికి దాదాపు రూ.9,300 వరకూ అవుతుంది. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.75 తోనూ పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా వీటిని కొనుగోలు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు ఇదే మొత్తాన్ని వెనక్కి తీసుకొని, అసలైన బంగారాన్ని కొనొచ్చు.
క్రమానుగతంగా..
ఒకేసారి పెట్టుబడి పెట్టడంతోపాటు, క్రమానుగతంగానూ బంగారంలో మదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. డీమ్యాట్ ఖాతా లేని వారు గోల్డ్ ఫండ్లను, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. నెలనెలా మదుపు చేయొచ్చు.
బంగారం ధర పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో దీర్ఘకాలిక వ్యూహంతో గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చు. మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి 10-15 శాతం వరకూ కేటాయించడం వల్ల వైవిధ్యం సాధ్యమవుతుంది.
Comments