Education: అమ్మానాన్నలూ.. ఇలా పాటిస్తే మంచి మార్కులు!
తమ పిల్లల చదవులపై నేటి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. పదేళ్ల క్రితం చూస్తే ప్రాథమిక విద్యాభాస్యం చేసేవారిపై దృష్టి ఎక్కువగా ఉండేది. సరిగా ఏకాగ్రత చూపరనో? చిన్నవారనో ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

తమ పిల్లల చదవులపై నేటి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. పదేళ్ల క్రితం చూస్తే ప్రాథమిక విద్యాభాస్యం చేసేవారిపై దృష్టి ఎక్కువగా ఉండేది. సరిగా ఏకాగ్రత చూపరనో? చిన్నవారనో ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత పాఠశాల (6-10వ తరగతి), ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన వారిపై తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ప్రత్యేక శ్రద్ధకనబర్చుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివేవారిని కేవలం కళాశాలలకే వదిలేయడం లేదని తాజా ‘విద్యాస్థితి నివేదిక-2024’ చెబుతోంది.
ఇంటర్‌లో గరిష్ఠ మార్కులు, తదుపరి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకే లక్ష్యంగా ఇంట్లోవాళ్లు బాగా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలల సమయం అనంతరం ప్రతిరోజూ రెండు, మూడు గంటలైనా సమయం కేటాయిస్తున్నారు. వార్షిక పరీక్షలు దగ్గరపడిన కొద్దీ.. వారు వెనుకబడిన సబ్జెక్టులేమిటో గుర్తించి కోచింగ్ ఇప్పిస్తున్నారు. కావాల్సిన మెటీరియల్, ఇతర అవసరాల్ని సమకూర్చుతున్నారు. అంతాబాగానే ఉన్నా.. సాధారణ రోజులు, ముఖ్యంగా పరీక్ష సమయాల్లో విద్యార్థులపై ఒత్తిడి కలిగేలా తల్లిదండ్రులు ప్రవర్తించొద్దని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. వారి ఆందోళనల్ని పారదోలి.. ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు. అప్పుడే, అమ్మానాన్నలకు పిల్లలూ మంచి మార్కులేస్తారని సూచిస్తున్నారు.
ఇలా చేసి చూడండి...
సబ్జెక్టుల వారీ సన్నద్ధత, విరామానికి సంబంధించి పిల్లలతో కలిసి టైం టేబుల్ తయారుచేయండి.
కావాల్సిన పుస్తకాలు, రిఫరెన్స్ మెటీరియల్, ఇతర సామగ్రిని సేకరించేందుకు సహాయపడండి.
ముఖ్యాంశాలు రాయడం (బ్రీఫ్ నోట్స్), ఇతరులతో చర్చించండి వంటి చిట్కాలు వీలైనన్ని నేర్చుకునేలా ప్రోత్సహించండి.
చదువు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలున్నా ఇంట్లో చెప్పేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి.
అలసట దరిచేరకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా తగినంత నిద్రపోనివ్వండి. వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి.
అభ్యసనలో, అంతర్గత పరీక్షల్లో చూపిన ప్రతిభను గుర్తించి అభినందించండి. ఇతరులతో పోల్చకండి.
చిన్న విజయాలను సెలబ్రేట్ చేయండి. చదువులో మరింత మెరుగయ్యేలా ప్రోత్సహించండి.
ర్యాంకులు, మార్కులే లక్ష్యం కాకుండా.. అకడమిక్‌పరంగా ప్రతిభచూపడం ముఖ్యమనే ఆలోచన కలిగించండి.
మా అబ్బాయి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అంతర్గత పరీక్షల అనంతరం అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పాఠశాలకు వెళ్లి తెలుసుకుంటున్నాం. నేను ఉద్యోగిని. అయినా, తీరిక చేసుకుని సమయం కేటాయిస్తున్నా. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అడిగి తెలుసుకుంటున్నా. ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాయులతో ఫోన్లో మాట్లాడి నివృత్తి చేయిస్తున్నాం. పరీక్షల సన్నద్ధతకు ఇంట్లో ప్రత్యేక వసతులు కల్పించాం.
రాంబాబు, పదో తరగతి విద్యార్థి తండ్రి, వైఎస్సార్‌నగర్, ఖమ్మం
‘పరీక్షలు పిల్లల జీవితంలో ఓ భాగమే. పరీక్షలే వారి జీవితమనేలా తల్లిదండ్రులు వ్యవహరించొద్దు. ఇతరులు బాగా చదువుతున్నారనో, ఫీజులు రూ.లక్షలు చెల్లించామనో మందలించొద్దు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. విశ్రాంతి కోసం తోటి విద్యార్థులతో ఆడుకునేలా, వ్యాయామం చేసేలా చూడాలి. సెలవు రోజుల్లో విహార ప్రదేశాలకు, తీరిక ఉన్నప్పుడు బంధుమిత్రుల ఇళ్లకు తీసుకెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడపాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, చదువుపై ఏకాగ్రత కుదురుతుంది’.
నాగరాజశేఖర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం


Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Commentaires