Budget 2025: బడ్జెట్‌లో పాత పన్ను విధానానికి మంగళం? నిపుణులు ఏమంటున్నారు?

Budget 2025 | ఇంటర్నెట్‌డెస్క్: ఫిబ్రవరి 1 సమీపిస్తున్న వేళ.. బడ్జెట్‌పై (Union budget) మధ్యతరగతిలో అంచనాలతో పాటు ఊహాగానాలు అంతకూ పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు పన్ను మినహాయింపులు కల్పిస్తారని, తద్వారా వేతన జీవులకు ఊరట కల్పిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అది శ్లాబుల రూపంలోనా? స్టాండర్డ్ డిడక్షన్ రూపంలోనా అన్నవి ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వచ్చింది. ఈసారి బడ్జెట్‌లో పాత పన్ను విధానం (Old Tax Regime) రద్దుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు అమలవుతున్నాయి. 2020 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొత్త విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. శ్లాబుల మార్పు, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు వంటి మార్పులన్నీ కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు. కొత్త పన్ను విధానంవైపు ఎక్కువ మందిని ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని బట్టి ప్రభుత్వ వైఖరి ఏంటన్నది చూసే వారికి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడంతో పాటు పాత పన్ను విధానానికి స్వస్తి పలికే విషయంపైనా ఏదో ఒక ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, పాత పన్ను విధానం తొలగింపు అంశంపై చార్టర్డ్ అకౌంటెంట్లు, నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమకేది సరైన విధానమో లెక్కించి ఎంచుకోవడం క్లిష్టతరమైన వ్యవహారమని, కాబట్టి సులువుగా లెక్కించి ఫైల్ చేసేందుకు వీలున్న కొత్త పన్ను విధానమే కొనసాగించడం మేలని టాక్స్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. కొత్త పన్ను విధానాన్ని దాదాపు 70 శాతం మంది ఎంపిక చేసుకున్నారని, పెద్ద సంఖ్యలో ఉన్న వారిని కొత్త పన్ను విధానానికి మరల్చాలంటే ఇంకొన్ని మార్పులు అవసరం అని అభిప్రాయపడ్డారు. అయితే, ఒకేసారి పాత పన్ను విధానం రద్దు చేస్తే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు, పన్ను ఆదా పథకాలపై ప్రభావం పడుతుందని మరో నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు పాత పన్ను విధానం ఎంచుకున్న వారు ఇప్పటికే దీర్ఘకాలానికి పన్ను ప్రణాళిక వేసుకుని ఉంటారని, కాబట్టి కనీసం మూడేళ్ల వ్యవధి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు రద్దు చేయకపోయినా, పాత పన్ను విధానానికి ముగింపు పలుకుతామన్న సంకేతాన్నయితే ఇవ్వొచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజంగానే కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!!
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Kommentarer