top of page

AP Mega DSC: మెగా డీఎస్సీకి మీరు సిద్ధమా? ఇలా సిద్ధం కండి..!



AP Megs DSC Preparation

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఈ పోస్టులకు ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తారని అంచనా. పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటున్నప్పటికీ అభ్యర్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధమైతే ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవచ్చు!  

ప్రకటించిన ఉద్యోగాల్లో  జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయుల్లో 2259 కొలువులున్నాయి. అన్ని రకాల ఎస్‌జీటీ 6599, స్కూల్‌ అసిస్టెంట్‌ 7487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 ఉద్యోగాలున్నాయి. 


పరీక్ష విధానం: ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్‌-1 గా ఇంగ్లిష్‌ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మార్కులు లెక్కిస్తారు. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వెయిటేజి 20 శాతం ఉంటుంది.  


అర్హతలు: టెట్‌ పాసైన అభ్యర్థులను మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. గతంలో టీఆర్‌టీ ఉండేది. ఈసారి దరఖాస్తు పూర్తిచేసినప్పుడు మాత్రమే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయడం, ఏ సంస్థ కింద పనిచేస్తారో తెలియజేయాలని చెప్పారు. అంటే.. స్థానిక సంస్థలు, ట్రైబల్‌ వెల్ఫేర్, సోషల్‌ వెల్ఫేర్, రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలల పోస్టులకు. బీఈడీ/  డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి అర్హత లేదు. 

డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంది. అందుకే డీఎస్సీ 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. 160 ప్రశ్నలు ఉంటాయి. 



టెట్‌ వెయిటేజీ  

దీన్ని లెక్కించడానికి ఓ ఉదాహరణ చూద్దాం. మొత్తం టెట్‌ మార్కులు 150. సాధించినవి 130. 

20 శాతానికి లెక్కిస్తే సాధించిన మార్కులు/ మొత్తం మార్కులు శ్రీ 20 వెయిటేజి. 130/150X20 = 17.3

ఈ డీఎస్సీలో ఓపెన్‌ కేటగిరీవారి వయసు 42 నుంచి 44 సంవత్సరాలకు పెంచారు. 2024 జులై 1 నాటికి 44 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు 5 ఏళ్లు అదనంగా ఉంటుంది. 


రిజర్వేషన్‌: ఎస్సీ వర్గీకరణ తర్వాత ఏపీలో మొదటి నోటిఫికేషన్‌ డీఎస్సీనే అని చెప్పాలి. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కూడా డీఎస్సీలో ఇదే తొలి అవకాశం.  


సన్నద్ధత ఇలా!

  • పరీక్ష సన్నద్ధతకు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. జూన్‌ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరుగుతాయి. 

  • ఎడ్యుకేషన్‌ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ఎస్‌జీటీ కంటెంట్, మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు, స్కూల్‌ అసిస్టెంట్‌కు ఆరు నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకూ ఉంటుంది. 

  • ప్రణాళికాబద్ధంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించి సన్నద్ధం కావాలి. 

  • మోడల్‌ ప్రశ్నపత్రాలు సాధన చేస్తూ.. వేటిలో వెనుకబడి ఉన్నారో గ్రహించి వాటిని ఎక్కువగా చదవాలి. 

  • జీకే, కరెంట్‌ అఫైర్స్‌ ఎస్‌జీటీకి 8 మార్కులు, స్కూల్‌ అసిస్టెంట్‌కు 10 మార్కులకు ఉంటుంది. విద్యా దృక్పథాలు ఎస్‌జీటీకి 4 మార్కులు, స్కూల్‌ అసిస్టెంట్‌కు 5 మార్కులకు ఉంటుంది. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే సైకాలజీ కంటెంట్‌ టెట్‌లో ఉన్న అంశాలే కాబట్టి. జీకే, కరెంట్‌ అఫైర్స్‌ గత ఆరు నెలల జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ అంశాలు చూస్తూ, గత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి.

  • దరఖాస్తుకు వయసు పెంచడంతో ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తున్నవాళ్లూ ఉంటారు. కాబట్టి పోటీ తీవ్రంగా అంటే.. సగటున ఒక ఉద్యోగానికి 40 మంది వరకూ పోటీ పడే అవకాశం ఉంది. 

ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2678 పోస్టులున్నాయి. 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. కొంతమంది నాన్‌లోకల్‌ రాయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే వెళ్లాలి. ఎందుకంటే 20 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉద్యోగాలకు మాత్రమే అర్హులుగా ఉంటారు. నాన్‌లోకల్‌లో రిజర్వేషన్‌ విధానం వర్తించదు. 

ఇప్పుడున్న ఈ పరిమిత సమయాన్ని ఆయా సబ్జెక్టుల మార్కుల వెయిటేజీని బట్టి సన్నద్ధమవుతూ ప్రధాన అంశాలతో నోట్స్‌ రాసుకోవాలి. గత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తూ.. మోడల్‌ పేపర్‌లను సాధన చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 10 నుంచి 12 గంటలు శ్రమించి చదివి సాధన చేస్తే గెలుపు మీదే!

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 15

పరీక్ష తేదీలు: జూన్‌ 6 నుంచి జులై 6 వరకు

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఎడ్, డీఎడ్, డీఈఈడీ, ఏపీటెట్‌/సీటెట్‌ స్కోరు

వయసు: 2024 జులై 1 నాటికి 18-44 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: రూ.750 

వెబ్‌సైట్‌: https://apdsc.apcfss.in/



 
 
 

Comments


bottom of page