top of page
Writer's pictureAP Teachers TV

పాఠాలకు టాటా.. కార్యాలయాల్లో తిష్ఠ

విద్యాశాఖలో నాటి వైకాపా సర్కారు అవలంబించిన అసంబద్ధ విధానాల ఫలితంగా వందల మంది ఉపాధ్యాయులు బోధనకు దూరమైపోయారు.


నేటికీ బోధనేతర విధుల్లో 360 మంది టీచర్లు

కమాండ్‌ కంట్రోల్, ఎస్‌ఎస్‌ఏ,  డీఈవో కార్యాలయాల్లో మకాం

ఎస్‌సీఈఆర్టీలో ప్రతాప్‌రెడ్డి ఇష్టారాజ్యం

వైకాపా సర్కారు నిర్ణయాల ప్రక్షాళనకు సమయమిదే 

అమరావతి: విద్యాశాఖలో నాటి వైకాపా సర్కారు అవలంబించిన అసంబద్ధ విధానాల ఫలితంగా వందల మంది ఉపాధ్యాయులు బోధనకు దూరమైపోయారు. రాష్ట్రంలో 12 వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నా, పురపాలక, మారుమూల ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. 300 మందికి పైగా ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించింది. విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల శుభ్రత ఫొటోలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల్లో ఏకంగా 57 మంది టీచర్లను నియమించింది. విశాఖపట్నంతో పాటు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో వీరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలకు ఫోన్‌ చేసి, వివరాలు తీసుకోవడమే వీరి పని. జిల్లాకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను నియమించి, వారితో కమిషనరేట్‌లోని ఐటీ విభాగానికి వివరాలు చేరవేస్తున్నారు. ఈ పని పొరుగు సేవల సిబ్బందితోనూ చేయించవచ్చు. ప్రభుత్వం మారినా, ఆ శాఖలోని ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచి, టీచర్లను ఇంకా బోధనేతర విధుల్లోనే కొనసాగిస్తున్నారు. ఐటీ విభాగం సేకరిస్తున్న వివరాలు  వెబ్‌సైట్‌లో పెట్టకుండా రహస్యంగా ఉంచుతున్నారు.



ఉపాధ్యాయులతో ఈ తరహా విధులా?

విద్యాశాఖ కమిషనరేట్, సమగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర, కింది స్థాయి కార్యాలయాలు, డీఈవో కార్యాలయాల్లోనూ బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. కొందరు పట్టణాలు, నగరాల్లో ఉండేందుకు రాజకీయ పైరవీలతో ఈ కార్యాలయాల్లో మకాం వేశారు. కర్నూలు జిల్లా హోలగుంద ఉన్నత పాఠశాలలో 2 వేల మందికి పైగా విద్యార్థులున్నారు. ఇక్కడ 59 మంది ఉపాధ్యాయులు అవసరమైతే, ఉన్నది 38 మందే. ప్రకాశం జిల్లా డోర్నాల, నంద్యాల జిల్లా సున్నిపెంటలోనూ ఇదే దుస్థితి. ఇలా బడుల్లో పాఠాలు చెప్పేవారు లేకపోగా, రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో మాత్రం వందల మంది డిప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. హేతుబద్ధీకరణ పేరుతో ఉపాధ్యాయులను మిగులుగా తేల్చిన వైకాపా ప్రభుత్వం.. వారందరినీ రాజకీయ పైరవీలతో డిప్యుటేషన్లపై నియమించింది. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిన కొందరు ఉపాధ్యాయులు విశాఖ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో తిష్ట వేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ స్కూల్‌ అసిస్టెంట్‌ను ఎస్‌ఎస్‌ఏలో డిప్యుటేషన్‌పై నియమించగా, ఉన్నతాధికారికి బంధువైన ఆయన.. అక్కడి నుంచే తనిఖీలంటూ హడావుడి చేస్తున్నారు. కొందరికి నాడు-నేడు ప్రాజెక్టులోనూ విధులు కేటాయించారు.



అదో వైకాపా సానుభూతిపరుల విభాగం 

పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ, అకడమిక్‌ వ్యవహారాలు పరిశీలించాల్సిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)ని.. డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి వైకాపా సానుభూతిపరుల విభాగంగా మార్చేశారు. తన భార్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహకరించిన, రాజకీయ సిఫార్సు చేసిన వారిని ఇందులో నియమించుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న 27 మంది ఉపాధ్యాయుల్లో ఇద్దరికి మాత్రమే ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నాయి. పీజీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి అర్హతలున్న వారిని నియమించాల్సి ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలతో నింపేశారు. వీరి డిప్యుటేషన్‌ సమయం ముగుస్తుండడంతో, తిరిగి పొడిగించేందుకు ప్రతాప్‌రెడ్డి పైరవీలు చేస్తున్నారు. విచిత్రమేంటంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏవో స్వల్ప మార్పులు తప్ప, సీబీఎస్‌ఈ అనుసరించే జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పుస్తకాలనే రాష్ట్ర ప్రభుత్వమూ అనుకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పుస్తకాల పీడీఎఫ్‌లను తీసుకొని, యథాతథంగా ముద్రిస్తోంది. ఏవైనా ఒకట్రెండు మార్పుల చేసినా వాటిలోనూ అనేక తప్పులు దొర్లుతున్నాయి. అనర్హులతో నిండిన ఎస్‌సీఈఆర్టీని కూడా సంస్కరించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. 



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page