top of page
Writer's pictureAP Teachers TV

చదువు.. చట్టుబండలు

చదువు.. చట్టుబండలు




వైసీపీ సర్కారు తీరుతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గత ఐదేళ్లలో అమలుచేసిన విధానాలు పిల్లలను చదువులకు దూరం చేసే దుస్థితిని సృష్టించాయి.

వైసీపీ సర్కారు తీరుతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గత ఐదేళ్లలో అమలుచేసిన విధానాలు పిల్లలను చదువులకు దూరం చేసే దుస్థితిని సృష్టించాయి. ఫలితంగా ఈ ఏడాది ఏకంగా 4.24లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌లో తగ్గిపోయారు. వారంతా ఏమయ్యారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఇంటర్మీడియట్‌లోనే విద్యార్థుల సంఖ్య ఏకంగా 2లక్షలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక స్థాయిలోనూ 1.55లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలు వదిలేసినా ప్రైవేటు బడుల్లో చేరి ఉంటారనే అంచనా ఉండగా, ఇప్పుడు అక్కడ కూడా లేరని తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇంత తేడా ఎందుకు వచ్చిందనే దానిపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. కలెక్టర్ల సదస్సు సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.


4992 పాఠశాలల్లో పది మంది పిల్లలూ లేరు

20 మందీ లేని బడులు 12 వేలకు పైనే

ఇంటర్‌లో భారీగా తగ్గిన విద్యార్థులు

ఏకంగా 2లక్షల మంది దూరం

తీవ్రంగా దెబ్బతిన్న విద్యా వ్యవస్థ

గత ప్రభుత్వం తీరుతో ప్రతికూలత

గత వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ఠ విధానాల కారణంగా ప్రభుత్వ బడుల పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టుమని పది మంది కూడా లేని పాఠశాలలు ఏకంగా 4992 ఉన్నట్లు తేలింది. అలాగే, కనీసం 20 మంది కూడా విద్యార్థుల్లేని బడులు 12252 ఉన్నట్లు కలెక్టర్ల సదస్సు సందర్భంగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. 2023-24లో 12,32,342 మంది విద్యార్థులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 10,76,690కి పడిపోయింది. అంటే 1,55,652 మంది విద్యార్థులు ఈ స్థాయిలోనే తగ్గిపోయారు. ఇంత స్థాయిలో అడ్మిషన్లు పడిపోవడానికి కారణాలేంటనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో తరగతి నుంచి టెన్త్‌ వరకు చూస్తే 67,752 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈ కేటగిరీలో ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 9,939 మంది తగ్గారు. ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో అడ్మిషన్లు తగ్గాయంటే శిశు మరణాలు తగ్గడం కొంతవరకు కారణం కావొచ్చు. కానీ గతేడాది బడుల్లో ఉన్నవారు ఇప్పుడు పై తరగతులకు ఎందుకు రాలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్మీడియట్‌లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 10,13,057 మంది ఇంటర్‌ కాలేజీల్లో ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 812377కు పడిపోయింది. అంటే 2,00,680 మంది తగ్గిపోయారు. వీరిలో ఎంతమంది పక్క రాష్ర్టాలకు వెళ్లిపోయారు? ఎంతమంది డ్రాపౌట్‌ అయ్యారు? అనేది తేలాలి. మొత్తంగా ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు 4,24,084 మంది విద్యార్థులు తగ్గారు.


ఉన్నత విద్య ట్రెండ్‌

గతంలో ఉన్నత విద్యలో మాత్రమే రాష్ర్టానికి చెందిన విద్యార్థులు పక్క రాష్ర్టాలకు వలస వెళ్లి చదువుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్‌లోనూ ఆ ట్రెండ్‌ కనిపిస్తోంది. 2లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటే వారిలో చాలా మంది తెలంగాణ, ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదివే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖలో గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యార్థులు వలస బాట పట్టే పరిస్థితులు వచ్చాయి.




విలీనంతో దెబ్బతీశారు

ప్రాథమిక విద్యను జగన్‌ ప్రభుత్వం విలీనంతో దెబ్బతీసింది. 4వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇది ప్రాథమిక పాఠశాలలపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపింది.

ఇప్పుడేం చేయాలి?

విద్యార్థుల సంఖ్య పడిపోవడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఒకేసారి పిల్లలు భారీగా తగ్గిపోవడంతో వారిని తిరిగి బడులకు తీసుకురావాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వం టీచర్లపై బోధనేతర పనులను రుద్ది, బోధన అంశాలను పక్కనపెట్టడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఇంకా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. జీవో 117తో చేసిన ప్రయోగాలు కూడా బెడిసి కొట్టాయి. ఒకే తరగతికి ఒక బడిలో సబ్జెక్టు టీచర్లతో బోధించడం, మరో బడిలో ఎస్జీటీలతో పాఠాలు చెప్పించడం విమర్శలకు దారితీసింది. దానివల్ల ప్రయోజనం లేదని తెలిసినా కొనసాగించడంతో విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే పరిస్థితి వచ్చింది.



0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page